మర్కటాలకు మహాకష్టం

Animals Suffering From Food Due To Lockdown - Sakshi

కొత్తగూడెం జిల్లాలో ఆహారం దొరక్క జనావాసాల్లోకి వానరాలు

ఈ ఏడాది అడవి మామిడి కాత లేకపోవడంతో సమస్య అడపాదడపా

ఆదుకుంటున్న జంతు ప్రేమికులు 

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రంలోనే అత్యధిక అటవీ ప్రాంతం కలిగి ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లాక్‌డౌన్‌ కారణంగా జనసంచారం తగ్గి వివిధ రకాల వన్యప్రాణుల పరిస్థితి మెరుగుపడగా, కోతులు మాత్రం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. చిరుతలు, ఎలుగుబంట్లు, దుప్పులు, జింకలు, అడవి దున్నలు, అడవి పందులు, కుందేళ్లు ప్రధాన రహదారుల సమీపంలో సైతం స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. వీటి పరిస్థితి ఇలా ఉంటే.. కోతు లు ఆహారం దొరక్క విలవిల్లాడుతున్నాయి. జిల్లాలో కోతులు అత్యధికంగా కొత్తగూడెం–మణుగూరు ప్రధాన రహదారి పక్కన మొండికుంట అటవీ ప్రాంతంలో, కొత్తగూడెం–ఇల్లెందు ప్రధాన రహదారి పక్కన, సారపాక అటవీ ప్రాంతంలో, పాల్వంచ–దమ్మపేట రహదారి పక్కన ములకలపల్లి అటవీ ప్రాంతంలో, కిన్నెరసాని డ్యామ్‌ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుంటాయి. ఆయా ప్రాంతాల్లో ప్రయాణించేవారిలో అధికశాతం మంది కోతులకు నిత్యం ఆహార పదార్థాలను పెట్టేవారు.

ఇలా జిల్లాలో సుమారు 20 వేల వరకు కోతులు వాహనదారులు అందించే పండ్లు, ఇతర ఆహార పదార్థాలపై ఆధారపడేవి. లాక్‌డౌన్‌తో జన సంచారం లేక కోతులు ఆహారం కోసం అలమటిస్తున్నాయి. కాగా.. ఈ ఏడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అడవుల్లో అడవి మామిడి, ఇతర ఫలాలు ఆశించిన రీతిలో కాయలేదు. వాతావరణం అనుకూలించకపోవడంతో రైతుల మామిడి తోటల్లోనూ కాయలు అనుకున్నంతగా కాయలేదు. తునికి కాయలు కూడా అంతంతమాత్రంగానే లభిస్తున్నాయి. దీంతో ఆహారం కోసం కోతులు వివిధ రహదారులపై రోజూ ఎదురుచూస్తున్నాయి. కొన్ని చోట్ల జనావాసాల్లోకి వచ్చి అందిన తిండి ఎత్తుకెళుతున్నాయి. అడపాదడపా కొందరు జంతుప్రేమికులు ఆహారం అందిస్తున్నప్పటికీ అది పరిమితమే కావడంతో రోడ్లవెంబడి మర్కటాలు దీనంగా తిరుగుతున్నాయి. ఎవరైనా వస్తారేమో.. ఏదైనా ఇస్తారేమో అని ఆశగా చూస్తున్నాయి. వేసవి వల్ల అటవీ ప్రాంతాల్లో చిన్న చిన్న కుంటలు సైతం ఎండిపోవడంతో దాహార్తి తీర్చుకునేందుకు కూడా వీలులేకుండా పోయింది.

ఆదుకుంటున్న జంతు  ప్రేమికులు 
ఆహారం దొరక్క అవస్థలు పడుతున్న వానరాలను అడపాదడపా జంతు ప్రేమికులు ఆదుకుంటున్నారు. జంతువులను ఆదుకోవాలంటూ సోషల్‌ మీడియా ద్వారా పలువురు పిలుపునిస్తున్న నేపథ్యంలో స్థానికంగా ఉండే కొందరు అప్పుడప్పుడు కోతులకు కూరగాయలు, తినుబండారాలు, పండ్ల వంటి ఆహార పదార్థాలను అందిస్తున్నారు. కాగా.. కోతులు వేల సంఖ్యలో ఉండడం వల్ల జంతు ప్రేమికులు అందించే ఆహారం వాటికి ఏమాత్రం సరిపోవడంలేదు. దీంతో అర్ధాకలితోనే వానరాలు అలమటిస్తున్నాయి. అడవుల్లో తిండి దొరక్క కోతుల గుంపులు సమీపంలోని జనావాసాల్లోకి వచ్చి తినే పదార్థాలు ఎత్తుకుపోవడం, స్థానికులపై దాడి చేయడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో వానరాలకు ఆహారాన్ని అందించి ఆదుకోవాలని పలువురు జంతు ప్రేమికులు కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top