లెక్క... తేలేదెలా? | Sakshi
Sakshi News home page

లెక్క... తేలేదెలా?

Published Wed, Apr 1 2015 3:34 AM

andhra Pradesh vehicles tax charge

 నల్లగొండ అర్బన్: తెలంగాణ రాష్ట్రంలో తిరిగే ఆంధ్రప్రదేశ్ వాహనాలకు త్రైమాసిక పన్ను వసూలు మొదలైంది. జిల్లాలో వాడపల్లి, కోదాడ, నాగార్జునసాగర్ వద్ద ఉన్న రవాణా శాఖ చెక్‌పోస్టుల వద్ద పన్ను బాదుడు మొదలుపెట్టారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చెల్లించిన వాహన పన్ను ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తిరిగేందుకు ఉన్న వెసులుబాటుకు మంగళవారం అర్ధరాత్రితో గడువు పూర్తయ్యింది. తెలంగాణలో ప్రవేశించే వాహనాల నుంచి ఎంట్రీ టాక్స్‌ను వసూలు చేసేందుకు ప్రభుత్వం జీఓ 15 ఇప్పటికే విడుదల చేసింది. అమలు చేసేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. పన్ను వసూళ్ల కోసం డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ స్వయంగా చెక్‌పోస్టుల వద్ద పర్యవేక్షిస్తున్నారు. జిల్లా సరిహద్దుల నుంచి వెళ్లే టూరిస్టు వాహనాలు, స్టేజి క్యారేజీలు, ఇతర వాహనాలు, గూడ్సు వెహికిల్స్ నుంచి పన్నులు వసూలు చేసేందుకు సిబ్బంది కసరత్తు పూర్తి చేశారు.
 
 వాహనాల గుర్తింపు కష్టమే..
 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాహనాలను గుర్తించడంలో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడంపై ఇంకా డోలాయామాన పరిస్థితులే ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వాహనాలన్నీ ఇటీవల వరకు ఏపీ రిజిస్ట్రేషన్‌తోనే ఉన్నాయి. ఆయా వాహనాల యజమాని స్థానికతను గుర్తించి తెలంగాణేతర వాహనమైతే పన్ను వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తే తప్ప ఏ వాహనం ఏ ప్రాంతానికి చెందిందని ధ్రువీకరించడం సాధ్యపడదు. జిల్లా మీదుగా నిత్యం వెయ్యికిపైగా వాణిజ్య వాహనాలు సంచరిస్తుంటాయి. వీటిల్లో మూడు నాలుగు వందలు తెలంగాణ ప్రాంతానివైతే మిగతా ఆంధ్రా ప్రాంతానికి చెందినవై ఉంటాయి.
 
 కానీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కొందరు ఆంధ్రప్రాంత యజమానులు తెలంగాణ చిరునామాలతో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అలాంటి వాహనాల నుంచి పన్ను ఎలా వసూలు చేయాలనే విషయంపై స్పష్టత రావాల్సివుంది. ట్రావెల్స్ వాహనాల ద్వారా త్రైమాసిక పన్ను రూపంలో సగటున రూ.2 కోట్ల ఆదాయం రావడానికి అవకాశాలున్నాయి. కానీ వాటిల్లో తెలంగాణ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలకు మినహాయింపు ఉండే పక్షంలో రాబడిలో ఏ మేరకు కోత పడుతుందనేది కాలం గడిస్తే తప్ప తెలియదు. అంతేకాకుండా ఈ నెలలో త్రైమాసిక పన్ను చెల్లిస్తే మళ్లీ మూడు నెలల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండకపోవడంతో ఆదాయం రాబడిలో ఒక్కో నెల ఒక్కో మాదిరిగా ఉండే అవకాశాలున్నాయి. మోటారు క్యాబ్‌లు, ఇతర వాహనాలు వారం రోజుల పర్మిట్‌తో పని పూర్తి చేసుకుంటే ఈ వారంలో వచ్చే రాబడి భవిష్యత్తులో ఉండకపోవచ్చు. మరోవైపు ఆంధ్రా ప్రాంతం వాహనాలను ఎన్‌ఓసీపై తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉండడంతో రవాణా శాఖకు రాబోయే రోజుల్లో వచ్చే ఆదాయంపై ప్రభావం ఉండే అవకాశాలున్నాయి.
 

Advertisement
Advertisement