జయరామ్‌ హత్య కేసు మొదట్నుంచి మళ్లీ! | Andhra police transfers NRI businessman Jayaram'murder case to telangana | Sakshi
Sakshi News home page

జయరామ్‌ హత్య కేసు మొదట్నుంచి మళ్లీ!

Feb 8 2019 12:48 AM | Updated on Feb 8 2019 11:52 AM

Andhra police transfers NRI businessman Jayaram'murder case to telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎక్స్‌ప్రెస్‌ టీవీ చైర్మన్, కోస్టల్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ చిగురుపాటి జయరామ్‌ హత్య కేసు ఆంధ్ర ప్రదేశ్‌లోని నందిగామ పోలీసుల నుంచి తెలంగాణలోని హైదరాబాద్‌ పోలీసులకు బదిలీ అయింది. ఈ ఫైల్‌ నగర పోలీసు కమిషనర్‌ కార్యాలయానికి చేరుకోవడంతో గురు వారం కొత్వాల్‌ అంజనీకుమార్‌ వెస్ట్‌జోన్‌ పోలీసులతో సమీక్షించారు. నేరస్థలం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.10లోని రాకేష్‌రెడ్డి నివాసంలో కావడంతో కేసును ప్రాథమికంగా అక్కడి పోలీసులకే అప్పగించనున్నారు. ఈ కేసులో ఉన్న అనేక అనుమానాల నివృత్తి కోసం ఆది నుంచీ దర్యాప్తు చేయాలని సిటీ పోలీసులు నిర్ణయించారు.

నాటకీయ పరిణామాలపై దృష్టి..
కృష్ణాజిల్లా నందిగామలో ఈ నెల 1న జయ రామ్‌ మృతదేహం లభించిన నాటి నుంచి ఏపీ పోలీసుల దర్యాప్తులో అనేక నాటకీయ పరి ణామాలు చోటు చేసుకున్నాయి. జయరామ్‌ మేనకోడలు శిఖా చౌదరి ప్రధాన అనుమానితురాలు అనే వార్తలు తొలుత వెలువడ్డాయి. అయితే మంగళవారం రాకేష్‌రెడ్డి, వాచ్‌మన్‌ శ్రీనివాస్‌రెడ్డిల్ని మాత్రమే నిందితులుగా ప్రక టిస్తూ అరెస్టు చేశారు. శిఖాను గుట్టుచప్పుడు కాకుండా ఏపీ నుంచి హైదరాబాద్‌కు పంపిం చేశారు. వీటిపై దృష్టి పెట్టనున్న సిటీ పోలీసులు శిఖా చౌదరినీ విచారించాలని భావిస్తున్నారు. గత నెల 31న శిఖా జయరామ్‌ ఇంట్లోకి బల వంతంగా ప్రవేశించి బీరువాలో నుంచి విలువైన పత్రాలు, భూమి పత్రాలు తీసుకువెళ్లినట్లు హతుడి భార్య పద్మశ్రీ ఆరోపించారు. దీనిపై ఆమె జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిఖాను ప్రశ్నించే సమయంలో వీటి గుట్టు విప్పాలని నగర పోలీసులు నిర్ణయించారు. 

కాపాడటానికే ఆ కారణాలా?
జయరామ్‌ హత్య కేసుకు చెందిన వివరాలు వెల్లడిం చిన కృష్ణాజిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి.. జయరామ్‌ రాకేష్‌రెడ్డి నుంచి తీసుకున్న రూ.4.17 కోట్ల కోసమే ఈ హత్య జరిగినట్లు తెలిపారు. దీని పైనా సిటీ పోలీసులు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. రాకేష్‌కు ‘చినబాబు’తో సహా తెలుగుదేశం పార్టీలోని అనేక మందితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే వార్తలు వెలువడ్డాయి. దీంతో రాకేష్‌ను పరోక్షంగా, ఇతరులను ప్రత్యక్షంగా కాపాడ టానికే ఈ కారణాలు చెప్పారా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. వీటి నివృత్తికి నిందితుల్ని కస్టడీలోకి తీసుకోనున్నారు. దీనికోసం జూబ్లీహిల్స్‌ ఠాణాలో కేసు నమోదైన తర్వాత నాంపల్లి కోర్టు నుంచి పీటీ వారెంట్‌ తీసుకోనున్నారు. ఆపై నిందితుల్ని ఏపీ జైలు నుంచి తీసుకువచ్చి ఇక్కడి ప్రక్రియలు పూర్తిచేసుకొని వారిద్దరినీ విచారించాలని నిర్ణయించారు. 

కీలకంగా మారనున్న ‘రీ–కన్‌స్ట్రక్షన్‌’...
జయరామ్‌ హత్య కేసులో జూబ్లీహిల్స్‌ పోలీసులు చేపట్టనున్న క్రైమ్‌ సీన్‌ రీ–కన్‌స్ట్రక్షన్‌ ప్రక్రియ కీలకం కానుంది. రాకేష్‌ ఇంట్లో అనేక అంశాలు పరిశీలించ నున్నారు. ఆపై గొడవ జరిగిన తీరు, మృతదేహాన్ని కారులోకి వాచ్‌మన్‌ సాయంతో తరలించిన తీరు సహా నందిగామ వరకు జరిగిన పరిణామాలను సరిచూస్తారు. ఈలోపే పలు ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫీడ్‌ సేకరించడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. 

దసపల్లా  గుట్టు విప్పాలని నిర్ణయం..
జయరామ్‌ హత్యకు మూలాలు దసపల్లా హోటల్‌లోనూ ఉన్నాయి. గత నెల 29, 30, 31 తేదీల్లో దసపల్లా హోటల్లో జయరామ్‌కు చెందిన కీలక పరిణామాలు జరిగాయి. ఆ రోజు అక్కడ సమావేశమైనవారిలో హతుడు, నిందితుడు, మరికొందరు ఉన్నారని తెలుస్తోంది. తెల్లచొక్కా ధరించిన ఓ వ్యక్తి సీసీఫుటేజీలో కనిపించినా ఏపీ పోలీసుల దర్యాప్తులో ఈ వివరాలు బయటకు రాలేదు. 31న జయరామ్‌కు ఓ వ్యక్తి రూ.6 లక్షలు అక్కడకు తెచ్చి ఇచ్చారు. అతనెవరు.. దాన్ని తీసుకున్న ఓ యువతి ఎవరు? అనేదీ తేలాల్సి ఉంది. హోటల్‌లో గది ఎవరి పేరిట బుక్‌ అయి ఉంది? అనే వివరాలు పోలీసులు తెలుసుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 44 నుంచి రాకేష్‌రెడ్డి ఇంటి వరకు సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించి ఆ రోజు జయరామ్‌ ఎన్ని గంటలకు వెళ్లారు, మృత దేహాన్ని కారులో ఏ సమయంలో బయటికి తీసుకొచ్చారు? అనే అంశాలు తెలుసుకోనున్నారు.

శిఖా చౌదరికి  ఆ హత్యతో సంబంధం ఉంది: పద్మశ్రీ
ఆంధ్రా పోలీసుల విచారణ సరిగ్గాలేదనే తన భర్త  జయరామ్‌ హత్యకేసును తెలంగాణ పోలీసులకు అప్పగించాలని ఫిర్యాదు చేసానని పద్మశ్రీ వెల్ల డిం చారు. గురువారం ఆమె జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 44లోని తన నివాసంలో మీడియాతో మాట్లా డారు. ఈరోజు తమ పెళ్లిరోజని, గతంలో తన భర్తతో ఉన్న అనుబంధం తలచుకొని కుమిలి పోయానని వెల్లడించారు. ఆయన లేరన్న విషయాన్ని జీర్ణించు కోలేకపోతున్నానని, ఇంకా తన పిల్లలు తేరుకోలేదన్నారు. జయ రామ్‌ మర ణిస్తే ఘటనాస్థలానికి వెళ్లకుండా శిఖాచౌదరి తమ ఇంటికి ఎం దుకు వచ్చిందని, తమతో ఎలాంటి సంబంధం లేనివాళ్లతో ఎందుకు వెళ్లిందని ప్రశ్నించారు. ఈ విష యాన్ని తెలంగాణ పోలీ సులు, ప్రభుత్వం విచా రణ చేసి నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. శిఖాచౌదరికి ఈ కేసుతో సంబంధం లేదని చెప్పడం అన్యాయ మన్నారు. 2014లో శిఖా తమ కుటుంబంలోకి వచ్చింద న్నారు. ఆమె కుటుంబం మొత్తానికి జయరామ్‌ హత్యలో భాగముందన్నారు. కొన్ని ఒత్తిడులకు లొంగి రాకేష్‌రెడ్డిపై కేసును రుద్దారన్నారు. రాకేష్‌ ఎవరో తనకు తెలియదనీ, ఆయనకు ఇవ్వాల్సిన డబ్బుల గూర్చీ తెలీదన్నారు. శిఖాకు ఎవరు సహకరిస్తున్నారో తేల్చాలని కోరారు. ఎక్స్‌ప్రెస్‌ టీవీలో శిఖాకు అంతపెద్ద హోదా ఇవ్వడం సరికాదని తానే తొలగించానన్నారు. 

దర్యాప్తు అధికారిగా బంజారాహిల్స్‌ ఏసీపీ
జయరామ్‌ హత్య కేసు దర్యాప్తు అధికారిగా బంజారాహిల్స్‌ ఏసీపీ కె.శ్రీనివాసరావును నియమించాం. గురువారం కృష్ణా జిల్లా ఎస్పీ నుంచి వచ్చిన ఓ ప్రత్యేక మెసెంజర్‌ కేసు ఫైల్‌ తీసుకువచ్చి అప్పగించాడు. జూబ్లీహిల్స్‌ ఠాణాలో రీ–రిజిస్టర్‌ చేసి దర్యాప్తు ప్రారంభిస్తాం. ఇటీవల జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఓ ఫిర్యాదు ఇచ్చిన జయరామ్‌ భార్య పద్మశ్రీ తెలంగాణ, హైదరాబాద్‌ పోలీసులపై తనకు అపారమైన నమ్మకం ఉందని అన్నారు. దీన్ని నిలబెట్టుకోవాలనే కృతనిశ్చయంతో ఉన్నాం. కేసును అన్ని కోణాల్లోనూ లోతుగా దర్యాప్తు చేసి వీలైనంత త్వరలో పూర్తి చేస్తాం. 
– అంజనీకుమార్, హైదరాబాద్‌ కొత్వాల్‌ 

ఖాకీల పాత్రపైనా సమగ్రంగా...
జయరామ్‌ హత్య ఎపిసోడ్‌లో హైదరాబాద్‌లో పని చేస్తున్న ఇన్‌స్పెక్టర్‌ శ్రీని వాసులు, రాచకొండకు చెందిన ఏసీపీ మల్లారెడ్డిల పాత్ర తీవ్ర సంచలనం సృష్టిం చింది. జయరామ్‌ మృతదేహం తరలింపునకు గాను తాను వారిద్దరికీ ఫోన్లు చేశానని, వారిచ్చిన సలహాల మేరకే వ్యవహరించానని రాకేష్‌రెడ్డి ఏపీ పోలీసుల విచారణలో వెల్లడించాడు. అంతే కాకుండా ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు నల్లకుంట స్టేషనులో ఉన్నప్పుడే మృతదేహం తరలిస్తున్న కారును రాకేష్‌ అక్కడకు తీసుకువెళ్లాడని, బయటే ఉండి ఆయనకు ఫోన్‌ చేశాడని తెలుస్తోంది. అయితే వీటిని ఇద్దరు అధికారులు ఖండిస్తున్నారు. ఈ వివరాల ఆరా కోసం అవసరమైతే వారిద్దరికీ కూడా నోటీసులు జారీ చేసి విచారించనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement