ఇలా చితికి..

Amrutha Speaks About His Father Maruthi Rao Death - Sakshi

ముగిసిన మారుతిరావు అంత్యక్రియలు

శ్మశానవాటిక వద్ద అమృతను అడ్డుకున్న బంధువులు

నాన్న ఆస్తిపై నాకు ఎలాంటి ఆశలు లేవు : అమృత

ఆస్తి కోసమే అమృత డ్రామాలు : శ్రవణ్‌ 

మిర్యాలగూడ: సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు తిరునగరు మారుతిరావు అంత్యక్రియలు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సోమవారం మధ్యాహ్నం ముగిశాయి. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉన్న ఆర్యవైశ్య భవన్‌లో ఆదివారం ఆయన ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అంత్యక్రియలకు పట్టణవాసులు, బంధువులు భారీగా తరలివచ్చారు. మారుతిరావు భార్య గిరిజ విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఉదయం 10.45 గంటలకు రెడ్డికాలనీలోని ఇంటి నుంచి మారుతిరావు అంతిమయాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటలకు షాబ్‌నగర్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మారుతిరావు చితికి ఆయన తమ్ముడు శ్రవణ్‌ నిప్పంటించారు.

అమృతను అడ్డుకున్న బంధువులు.. 
ఇదిలా ఉండగా తన తండ్రిని కడసారి చూడటానికి అమృత పోలీసు బందోబస్తుతో శ్మశానవాటిక వద్దకు చేరుకుంది. పోలీసు వాహనంలోనే అమృతను ఇంటి వద్ద నుంచి శ్మశానవాటికకు తీసుకొచ్చారు. కాగా అమృత అక్కడికి చేరుకునే లోగా మారుతిరావు మృతదేహాన్ని చితిపై ఉంచారు. చితివద్దకు పోలీసులతో కలసి వెళ్లిన అమృతను మారుతిరావు బంధువులు, పట్టణ వాసులు అడ్డుకున్నారు. అమృత గోబ్యాక్‌.. మారుతిరావు అమర్‌ రహే అంటూ నినాదాలు చేశారు. దాంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని గమనించి పోలీసులు అమృతను వెంటనే తమ వాహనంలో ఆమె ఇంటికి తీసుకెళ్లారు.

ఆస్తి కోసం అమృత డ్రామాలు : శ్రవణ్‌  
‘మారుతిరావు చస్తే తనకు శుభవార్త’అని చెప్పిన అమృతకు ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత అతనిపై ప్రేమ పుట్టుకురావడం చూస్తే, ఆస్తికోసం డ్రామా ఆడుతున్నట్టు ఉందని మారుతిరావు తమ్ముడు శ్రవణ్‌ పేర్కొన్నారు. సోమవారం ఆయన తన అన్న నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ, మారుతిరావు భార్య పుస్తె తీసిన రోజే తాను పుస్తె తీస్తానని అమృత చెప్పిందని, అలాగే మారుతిరావును బహిరంగంగా ఉరి తీయాలని అమృత డిమాండ్‌ చేసిందని అన్నారు. తన వల్ల ఎవరికీ ప్రాణహాని ఉండదని, అమృత తనపై చేసిన ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. ప్రణయ్‌ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా శిక్ష అనుభవించానని, కేసు విషయంలో ఏనాడు కూడా రాజీ కోసం అమృత వద్దకు వెళ్లలేదని తెలిపారు. శ్మశానవాటిక వద్ద ఆమెను తాను అడ్డుకోలేదని, తల్లిపై ప్రేమ ఉంటే ఆమె అక్కడే ఉన్నా ఎందుకు మాట్లాడలేదన్నారు. తన అన్న మారుతిరావుకు అప్పులు ఉంటే వడ్డీతో సహా తీర్చుతానని వెల్లడించారు.

ఆస్తిపై ఎలాంటి ఆశలు లేవు: అమృత  
తండ్రి ఆస్తిపై తనకు ఆశల్లేవని మారుతిరావు కూతురు అమృత చెప్పారు. సోమవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ మారుతిరావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదన్నారు. పశ్చాత్తాపం చెందో, శిక్షపడుతుందనో ఆత్మహత్య చేసుకొని ఉండకపోవచ్చు అని అంది. ఆయనకు బినామీ పేర్లపై  ఆస్తులున్న ట్లు తెలిసిందని, ఆస్తి విషయంలో మారుతిరావును బాబాయి శ్రవణ్‌ కొట్టినట్లు తెలిసిందని చెప్పింది. శ్రవణ్‌ వల్ల తన తల్లికి కూడా ప్రాణ హాని ఉండొచ్చని అనుకుంటున్నానంది. తాను తల్లి వద్దకు వెళ్లనని, ఆమే తనవద్దకు వస్తే చూసుకుంటానని తెలిపింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top