బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా జనవరి 7వ తేదీన హైదరాబాద్‌కు రానున్నారు.
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా జనవరి 7వ తేదీన హైదరాబాద్‌కు రానున్నారు. తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ తీరును ఆయన సమీక్షిస్తారు. ఆగస్టులో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు మిషన్ 2019ను ప్రకటించిన ఆయన వచ్చే ఎన్నికల నాటికి పార్టీ అధికారంలోకి వచ్చే దిశగా శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిస్తూ కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. వాటి అమలు ఎలా ఉందో కూడా ఇప్పుడు ఆయన సమీక్షించనున్నారు.
వాస్తవానికి ఈనెల 27, 28 తేదీల్లోనే ఆయన తెలంగాణ పర్యటనకు రావాల్సి ఉంది. కానీ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ ఎన్‌రోల్‌మెంట్ కార్యక్రమం ఉండటంతో పర్యటనను వాయిదా వేసుకున్నారు. హైదరాబాద్‌తోపాటు వరంగల్‌లో పార్టీ రాష్ట్ర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. సమయం లభిస్తేనే ఈసారి వరంగల్‌కు వెళ్తారని, లేకుంటే జనవరి ఆఖరున్ల ఆ జిల్లాలో పర్యటిస్తారని పార్టీ వర్గాలంటున్నాయి.