ముగిసిన ఆటా వేడుకలు

American Telugu Association Conducted Programs At Hyderabad - Sakshi

హాజరైన హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ

గన్‌ఫౌండ్రీ: అమెరికాలో స్థిరపడి పుట్టిన ప్రాంతానికి సేవ చేయాలనే సంకల్పంతో అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా) ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు వక్తలు అన్నారు. ఈ నెల 11న ప్రారంభమైన ఆటా వేడుకలు ఆదివారం రవీంద్రభారతిలో ముగిశాయి. హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయాలని ఆకాంక్షించారు.

లక్ష మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ భారతీయ సంస్కృతి సం ప్రదాయాలను మరిచిపోకుండా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఎప్పుడో నిర్మించిన పాఠశాలల పునరుద్ధరణకోసం ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు–నేడు కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు భారతీయ సమాజాన్ని చూసి అక్కడి సమాజం సంస్కృతి సంప్రదాయాలను నేర్చుకుందని, కానీ ప్రస్తుత మన సమాజం సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోయిందన్నారు.

అమెరికాలో స్థిరపడినప్పటికీ భారతదేశానికి వచ్చి సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలను నిర్వహించి ఇక్కడ ఉన్న వారికి స్ఫూర్తినిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీనటుడు కృష్ణంరాజుకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. నీరజ్‌ సంపతి (వ్యాపారం, క్రీడలు), శ్రీ కళాకృష్ణ, అశ్వినీరాథోడ్‌ (కళలు), రాహుల్‌ సిప్లిగంజ్, కొమండూరి రామాచారి (సంగీతం), సౌదామిని ప్రొద్దుటూరి (మహిళా సాధికారత), కృష్ణమనేని పాపారావు (సామాజిక సేవా) రంగాల వారికి పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర శాసన సభ్యులు రసమయి బాలకిషన్, బొల్లం మల్లయ్య యాదవ్, ఆటా ప్రతినిధులు అనిల్‌ బోదిరెడ్డి, పరమేశ్‌ భీమ్‌రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top