రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయంలో అధికారికంగా గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో ఆయన టీఆర్ ఎస్ చేరిక పూర్తయింది. కేసీఆర్తో భేటీ అనంతరం మంచిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు తనవెంటే ఉన్నారన్నారు. కాగా నియోజకవర్గ అభివృద్ధికి చేయూతనిస్తానని సీఎం హామీ ఇచ్చినందునే టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు మంచిరెడ్డి తెలిపారు.
నాగార్జునసాగర్ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించడం, జాపాల్- రంగాపూర్ అబ్జర్వేటరీ అభివృద్ధి, ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును కృష్ణాజలాలతో నింపడం, మూసీ మురుగునీటి శుద్ధికి సీఎం సహకరిస్తానని భరోసా ఇచ్చినట్లు చెప్పారు. కార్యకర్తలు, నాయకుల ఒత్తిడి మేరకే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నా తప్ప ఎలాంటి వ్యక్తిగత ఏజెండా లేదని స్పష్టం చేశారు. త్వరలో ఇబ్రహీంపట్నంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని, దీనికి సీఎం రానున్నారని ఆయన చెప్పారు.