ఆన్‌లైన్‌లో కొనేద్దామా!

Agriculture Department has decided to become part of digital India - Sakshi

     రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని వ్యవసాయ శాఖ నిర్ణయం

     పత్తి తీసే యంత్రాలు మొదలు కార్లు, ల్యాప్‌టాప్‌లు, స్టేషనరీ లభ్యం

సాక్షి, హైదరాబాద్‌: డిజిటల్‌ ఇండియాలో భాగం కావాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. తద్వారా రైతులకు కావాల్సిన వ్యవసాయ ఉపకరణాలు మొదలు తమకు అవసరమైన స్టేషనరీని తక్కువ ధరకు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో అవకతవకలు లేకుండా కొనుగోళ్లు చేయవచ్చని భావిస్తోంది. డిజిటల్‌ ఇండియాలో భాగంగా వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యం లో కేంద్రం ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన గవర్నమెంట్‌ ఈ–మార్కెట్‌ ప్లేస్‌ (జీఈఎం)ను వినియోగించుకోవాలని నిర్ణయించింది. తమ శాఖ తరఫున జీఈఎం పోర్టల్‌ నుంచి కొనుగోళ్లు జరిపేందుకు సిద్ధమవుతున్నామని వ్యవసాయశాఖ కమిషనర్‌ రాహుల్‌ బొజ్జా ‘సాక్షి’కి తెలిపారు. వ్యవసాయ సంబంధ యంత్రాలూ అందులో లభ్యమవుతున్నాయని, వివరాలు పూర్తిగా తెలుసుకున్నాక కొనుగోలు చేస్తామని వివరించారు.  

పత్తి యంత్రాలు మొదలు ల్యాప్‌టాప్‌ల వరకూ... 
ప్రైవేటులో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆలీబాబా తదితర ఆన్‌లైన్‌ పోర్టళ్లు ఎలాగో కేంద్రం ఆధ్వర్యంలో పనిచేసే జీఈఎం  అలాంటిదే. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత సంస్థలే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆయా వస్తువులపై కేంద్ర ప్రభుత్వ పన్నులు ఉండవు. కాబట్టి తక్కువ ధరకే లభిస్తాయి. ప్రభుత్వాలు కొనుగోలు చేసే స్టేషనరీ మొదలు ల్యాప్‌టాప్‌లు, కార్లు, వ్యవసాయ ఉపకరణాలన్నీ లభ్యమవుతాయి. హైఎండ్‌ ఇన్నోవాకారు బయటి మార్కెట్లో రూ. 20 లక్షలుంటే, జీఈఎంలో రూ.16 లక్షలకే కొనుగోలు చేయవచ్చని తెలిపారు. పత్తిని తీసేందుకు బ్యాటరీతో పనిచేసే మిషన్లు అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్లు, హార్డ్‌వేర్‌ పరికరాలు, సీసీ కెమెరాలు, ప్యాసింజర్‌ మోటార్‌ వాహనాలు, కార్యాలయ ఫర్నిచర్‌ వంటి 8 వేలకు పైగా ఉత్పత్తులు అందిస్తున్నారు.

ఇప్పుడు అందజేస్తున్న వ్యవసాయ యంత్రాలను ఆన్‌లైన్‌లో కొనుగోలుచేసే అవకాశం ఉంది. ప్రభుత్వం వాటికి సబ్సిడీ ఇచ్చి రైతులకు అందజేయమని చెబితే పోర్టల్‌లోనే ఆర్డర్‌ చేయడానికి వీలుంది. ఇప్పటికే ట్రాక్టర్లు సబ్సిడీపై ఇస్తున్నామని, వాటినీ ఆన్‌లైన్లో కొనుగోలు చేసే అవకాశాలను అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో జీఈఎంలో కొనుగోలుకు ఆలోచిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పథకానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన చేసి జీఈఎంలో కొనుగోలు చేసే సదుపాయం కల్పిస్తున్నారు. వ్యవసాయ శాఖలోని వ్యవసాయ ఉపసంచాలకులకు ఈ–మెయిల్‌ సౌకర్యం కల్పించి అవసరమైనవి కొనుగోలు చేసేందుకు అనుమతించాలని భావిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top