హైదరాబాద్‌లో మళ్లీ కుండపోత వర్షం

Again Heavy rains lash Hyderabad

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో కుండపోత వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పలు మెయిన్ జంక్షన్‌ ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనాలు కదలాలంటే గంటలకొద్దీ సమయం పడుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా భారీ వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిందని, కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లేవారు తమ ప్రయాణాన్ని మరో రెండు గంటలు వాయిదా వేసుకోవాలని ట్రాఫిక్‌  డీసీపీ రంగనాథ్‌ సూచించారు. లేకుంటే ట్రాఫిక్‌ జామ్‌ పరిస్థితి మరింత తీవ్రతరం అవుతుందని ఆయన తెలిపారు. అమీర్‌పేట శ్రీనగర్ కాలనీలో ఓ నాలా పొంగి పొర్లుతుండగా అందులో నుంచి ఓ వ్యక్తి మృతదేహం బయటపడినట్లు సమాచారం. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

భాగ్యనగరంపై రెండు రోజుల పాటు కరుణ చూపిన వరుణుడు మరోసారి విజృంభించాడు. నగరంలోని పలుచోట్ల గురువారం సాయంత్రం ఆరున్నర సమయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, కొత్తపేట, మలక్‌పేట, సరూర్‌నగర్‌, సంతోష్‌ నగర్‌లో భారీ వర్షం పడగా..బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మోహదీపట్నం, పంజాగుట్టలో కుండపోత వర్షం కురిసింది. అలాగే అమీర్‌పేట, ఎస్‌ఆర్‌ నగర్‌, ఎర్రగడ్డ, సనత్‌ నగర్‌, కూకట్‌పల్లి, మియాపూర్‌,నిజాంపేట, సికింద్రబాద్‌, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, నారాయణగూడ, ట్యాంక్‌బండ్‌, హియాయత్‌ నగర్‌,  ఖైరతాబాద్‌, బషీర్‌బాగ్‌, నాంపల్లి, కోఠీ, పాతబస్తీలో భారీ వర్షం పడుతోంది.

 అలాగే చాంద్రాయణగుట్ట, ఛత్రినాక, గౌలిపురా, భవానీ నగర్‌, లాల్‌ దర్వాజా, షా అలీ బండ, హనుమాన్‌ నగర్‌, పార్వతి నగర్‌, ఫలక్‌ నుమా, అరుంధతి కాలనీ, పటేల్‌ నగర్‌, షంపేట్‌ గంజ్‌, శివాజీ నగర్‌, శివగంగ నగర్‌ రోడ్లపై వర్షం నీరు ప్రవహిస్తోంది. మరోవైపు భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి.  ఇప్పటికే పలు కాలనీలు నీట మునిగాయి. భారీ వర్షం పడటంతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపైకి వర్షపు నీరు భారీగా చేరుకోవడంతో ట్రాఫిక్‌ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక గాలులతో కూడిన వర్షం పడటంతో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. అలాగే కుండపోత వర్షంతో గ్రేటర్‌లోని 16 ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిందని అధికారులు గుర్తించారు. కాగా రేపుకూడా హైదరాబాద్‌లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

మరోవైపు టీ-20 మ్యాచ్‌కు వర్షం దెబ్బ తగిలింది. భారీ వర్షంతో ఉప్పల్‌ స్టేడియం తడిసి ముద్ద అయింది. దీంతో ఉప్పల్‌ స్టేడియాన్ని మైనపు కవర్లతో కప్పి ఉంచారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top