చట్టబండలు

after six months still pending Compensation - Sakshi

ఏళ్లు గడిచినా అందనిపరిహారం, పునరావాసం  

మైనర్లపై కొనసాగుతున్న లైంగిక దాడులు, హింస  

బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడలేదు..

మృగాళ్ల నుంచి బాలికలకు రక్షణ లేదు...   

ఆ చూపులు ఆమెను ఎందుకు వెంటాడుతున్నాయో గుర్తించలేకపోయింది. ఎందుకు పలకరిస్తున్నాయో పసిగట్టలేకపోయింది. ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని చూస్తున్న బాల్యం... ‘తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు’ అని నమ్మే అమాయకత్వం.మనుషులంతా మంచివాళ్లేననే నమ్మకం. కానీ ఆ చూపులు పాప నమ్మకాన్నివమ్ము చేశాయి. ఆ 13ఏళ్ల బాలిక అకస్మాత్తుగా అపహరణకు గురైంది. గుల్బర్గాకు తీసుకెళ్లిన మృగాడు ఆమెను కాటేశాడు. రెండ్రోజులు ఆమెపై పశువాంఛతీర్చుకున్నాడు. ఆరు నెలల కిత్రం బాలాపూర్‌ పరిధిలో జరిగిన సంఘటన ఇది. దీనిపై కేసు నమోదైంది. నిందితుడు అరెస్ట్‌ అయ్యాడు. కానీ బెయిల్‌పై బయటకొచ్చి ఇప్పుడు దర్జాగా తిరుగుతున్నాడు. పాపం ఆ బాధితురాలు జీవచ్ఛవంలా బతుకుతోంది. ఇలాంటి బాధితులెందరో ఉన్నారు. బాలబాలికల రక్షణ కోసం తీసుకొచ్చిన పోక్సో(ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌–2012) చట్టం వీరికిఎలాంటి భరోసాను ఇవ్వలేకపోతోంది.

ఆరు నెలలైనా అందని పరిహారం..  
బాలాపూర్‌ సమీపంలోని ఓ చిన్న బస్తీ. 13 ఏళ్ల ఫరీదా (పేరు మార్చాం) దగ్గర్లోని ఓ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతోంది. తండ్రి ఆటోడ్రైవర్, తల్లి టైలర్‌. నిరుపేద కుటుంబం. ఈ దంపతులకు ఐదుగురు పిల్లలు. ఫరీదా రెండో అమ్మాయి. కష్టపడి పిల్లల్ని చదివిస్తున్నారు. తాను ఎయిర్‌హోస్టెస్‌ కావాలని, ప్రతిరోజు విమానాల్లో తిరగాలని కలలు కంటోంది ఫరీదా. ఆ కలలను సాకారం చేసుకునేందుకు బాగా చదువుకుంటోంది. భవిష్యత్తులో ఆమె ఉన్నత స్థాయికి ఎదుగుతుందని అందరూ భావించారు. కానీ 6 నెలల క్రితం అదే కాలనీకి చెందిన పాతికేళ్ల యువకుడు ఆ అమ్మాయిపై వేధింపులకు పాల్పడ్డాడు. స్కూల్‌కు వెళ్లే దారిలో నిత్యం వెంబడించేవాడు. చివరకు కత్తితో బెదిరింపులకు దిగాడు. చెప్పిట్లు వినకపోతే ఆమె కుటుంబాన్ని అంతమొందిస్తానని హెచ్చరించాడు. ఓ రోజు సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మరో ఇద్దరు స్నేహితులతో కలిసొచ్చి ఆటోలో ఆమెను అపహరించుకొని వెళ్లాడు.

అప్పటికే చాలా రోజులుగా  అతని వేధింపుల గురించి తెలిసి.. ఒకట్రెండు సార్లు హెచ్చరించిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. రెండు రోజులు ఆ అమ్మాయితో తన పశువాంఛను తీర్చుకొని తిరిగొచ్చిన నిందితుణ్ని పోలీసులు అరెస్టు చేశారు. కానీ బెయిల్‌పై బయటకొచ్చిన ఆ మృగాడు ఇప్పుడు దర్జాగా సమాజంలో తిరుగుతున్నాడు. పాపం.. ఆ బాధితురాలు తన కలలు చెదిరిపోయాయనే బాధతో కుమిలిపోతోంది. ఎయిర్‌హోస్టెస్‌ కావాలనే కల చెదిరిపోయి నిరాశ, నిస్పృహలతో జీవిచ్ఛవంలా బతుకుతోంది. ఈ సంఘటన జరిగి ఆరు నెలలైనా ఆమెకు ఎలాంటి మానసిక ఓదార్పు లభించలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందలేదు.  

ఏదీ భరోసా.?   
ఇది ఒక్క ఫరీదా బాధనే కాదు. నగరంలో నిత్యం ఎక్కడో ఒక చోట మైనర్లపై లెంగిక దాడులు జరుగుతున్నాయి. అత్యాచారాలు, వేధింపులు నిత్యకృత్యంగా మారాయి. బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో చిన్నారులు లైంగిక హింసను అనుభవిస్తున్నారు. ఇలాంటి హింస, వేధింపుల నుంచి అతి కష్టంగా బయటపడిన పిల్లలకు ఎలాంటి రక్షణ లభించడం లేదు. సమాజం నుంచి ఎదురయ్యే వివక్ష ఓవైపు... మరోవైపు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు, ఓదార్పు లభించకపోవడం వారిని మరింత కుంగదీస్తోంది. లైంగిక వేధింపుల ఊబి నుంచి బయటపడినా ఆ పిల్లల బంగారు భవిష్యత్తుకు ఎలాంటి భరోసా లభించడం లేదు. ఎలాంటి సంక్షేమ పథకాలు అమలుకు నోచుకోవడం లేదు. 

ఒక్క కేసులోనూ...  
స్వచ్ఛంద సంస్థల అంచనాల మేరకు 2017లో ‘పోక్సో’ చట్టం కింద సుమారు 520 కేసులు నమోదవగా, వీటిలో ఒక్క కేసులోనూ పరిహారం అందలేదు. ‘చివరకు దాడికి గురైన చిన్నారుల మానసిక స్వస్థత కోసం కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మనస్తత్వ నిపుణుల ద్వారా కౌన్సెలింగ్‌ కూడా ఇప్పించలేద’ని విస్మయం వ్యక్తం చేశారు బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షులు అచ్యుతరావు. బాల్యవివాహాలు, అత్యాచారాలు, వేధింపులకు వ్యతిరేకంగా తల్లిదండ్రుల సహకారంతో పోలీసులను ఆశయిస్తున్న పిల్లలు పరిమితంగానే ఉన్నారని, అవమాన భారంతో బయటకు రాని వాళ్లు ఇంకా వందల సంఖ్యలోనే ఉన్నారని చెప్పారాయన. 

‘నా కూతురు ఏం పాపం చేసింది. అందరిలా బడికెళ్లి చదువుకుంటున్న చిన్నపిల్లని ఆ కామాంధుడు ఇలా చేశాడు. ఇప్పటికీ కోలుకోలేకపోతోంది. చాలా బలహీనంగా ఉంది. వాడు బెయిల్‌పై
బయటకు వచ్చాడు. తిరిగి ఏ క్షణంలో మాపై దాడి చేస్తాడోనని భయంతో బతుకుతున్నాం.ఒకప్పుడు ఎంతో ఆత్మీయంగా మాట్లాడిన ఇరుగుపొరుగు, బంధువులు అందరూ దూరమయ్యారు. మా కుటుంబాన్ని చిన్నచూపు చూస్తున్నారు.’  – ఫరీదా తల్లి ఆవేదన ఇది.   

‘పోక్సో’ అమలు ఇలా..
పోక్సో చట్టం 2012లో అమల్లోకి వచ్చింది. దీని కింద నమోదైన కేసుల ప్రాథమిక దర్యాప్తు నివేదిక (ఎఫ్‌ఐఆర్‌)  ప్రకారం ప్రభుత్వం వెంటనే అత్యవసర సహాయక చర్యలు చేపట్టాలి.  
కేసుల గురించి సంబంధిత స్టేషన్‌ హౌస్‌ అధికారిపైఅధికారులకు సమాచారం అందజేయడంతో పాటు  జిల్లా కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులకు కూడా ఎఫ్‌ఐఆర్‌ కాపీని ఇవ్వాలి.   
ఈ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా కలెక్టర్‌ సహాయక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కానీ స్వచ్ఛంద సంస్థల అంచనాల మేరకు పోలీస్‌ స్టేషన్‌లలో ‘‘పోక్సో’ కింద నమోదైన కేసుల్లో చాలా వరకు కలెక్టర్‌ వరకు చేరడం లేదు. ఒకవేళ చేరినా ఎలాంటి సహాయక చర్యలుతీసుకోవడం లేదు.
పోలీసుల నుంచి అందిన సమాచారం మేరకు కలెక్టర్‌ అత్యవర నిధి నుంచి కేసు నమోదైన 48 గంటల్లో  రూ.50 వేల పరిహారాన్ని బాధిత పిల్లలకుఅందజేయాలి.  
మానసిక వైద్య నిపుణులతో పిల్లలకు కౌన్సెలింగ్‌ ఇప్పించాలి. కోర్టులో కేసు వాదించేందుకు పబ్లిక్‌ప్రాసిక్యూటర్‌ను నియమించాలి.  
కేసు కొనసాగుతున్న మధ్య కాలంలో మరో రూ.25 వేల పరిహారాన్ని అందజేయాలి. పిల్లలు మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు, తిరిగి సాధారణజీవితాన్ని గడిపేందుకు అనువైన పర్యటనల కోసం తగిన సహాయాన్ని అందజేయాలి.
కేసు గెలుపోటములతో నిమిత్తం లేకుండా కేసు తుది దశలో మరో రూ.25 వేల సహాయం అందజేయాలి.  
ఈ ఆర్థికపరిహారం కోసం బాధితులు అధికారుల వద్దకు వెళ్లాల్సిన పనిలేదు. అధికారులే స్వయంగా బాధితుల ఇంటికి వెళ్లి ఇవ్వాలి.   
పిల్లలు తిరిగి స్కూల్‌కు వెళ్లేందుకు, తమ దైనందిన జీవితాన్ని యథావిధిగా కొనసాగించేందుకు అనువైన వాతావరణం ఏర్పడేలా చూడాలి.   
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల్లో ‘పోస్కో’ బాధిత పిల్లలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల లాంటి పథకాలను వర్తింపజేయాలి.  
పిల్లలు భవిష్యత్తులో సొంతంగా బతికేందుకుకావాల్సిన స్థిరాస్తి సదుపాయం కల్పించాలి.
వీటిలో ఏ ఒక్కటీ ప్రస్తుతం అమలుకు నోచుకోవడం లేదు.  

అవగాహన లేనివాళ్ల పరిస్థితి...   
ఓవైపు హింసను ఎదుర్కొంటున్న పిల్లలు, వారి కుటుంబాలు... మరోవైపు పరిహారం కోసం ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంటోంది. ఒంటరి పోరాటం చేస్తున్నారు. అదీ ‘పోక్సో’ అనే చట్టం ఒకటి ఉందనే అవగాహన ఉన్నవాళ్లు మాత్రమే. కానీ ఈ చట్టంపై అవగాహన లేనివాళ్లు.. కలెక్టర్లకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందజేయలేక మౌనంగా ఉండిపోతున్నారు. చాలామంది అవమాన భారంతో కుమిలిపోతున్నారు. ఇలాంటి అంశాల్లో ప్రభుత్వమే సత్వరం స్పందించి చర్యలకు ఉపక్రమించాలి.   – అచ్యుతరావు, బాలల హక్కుల సంఘం 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top