రైతుబంధుకు నిధుల కేటాయింపు

After the End of the Election code Farmers Funds will be Raised in the Bank Account of the Farmers - Sakshi

ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్థిక శాఖకు సర్కారు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: ఖరీఫ్‌లో రైతుబంధు సొమ్ము కోసం సర్కారు నిధులు కేటాయించింది. ఈ మేరకు ఆర్థికశాఖను ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. రైతు వివరాలు, బ్యాంకు ఖాతాలు, కొత్తవారి నమోదు వివరాలను చేర్చే విషయంలోనూ వ్యవసాయశాఖకు దిశానిర్దేశం చేసినట్లు ఆశాఖ వర్గాలు తెలిపాయి. ఖరీఫ్, రబీల కోసం గత బడ్జెట్లో 2019–20 ఆర్థిక ఏడాదికి రూ.12 వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఖరీఫ్‌లో రూ.6 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ నెలాఖరు నుంచి అంటే ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత రైతుబంధు నిధులు రైతుల బ్యాంకు ఖాతాలో వేయనున్నారు. జూన్‌ మొదటి వారంలోగా రైతులందరి ఖాతాలోనూ వేస్తారు. తొలకరి వర్షాలు కురిసే నాటికి, సాగు మొదలుకు ముందు రైతులందరికీ అందజేయాలని సర్కారు కృతనిశ్చయంతో ఉంది. గతేడాది ప్రభు త్వం ఒక్కో సీజన్‌కు ప్రతీ రైతుకు ఎకరానికి రూ. 4 వేల చొప్పున ఇచ్చింది. ఈసారి దాన్ని రూ.5 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. అంటే ఏడాదికి ఎకరానికి ప్రతీ రైతుకు ఎకరానికి రూ. 10 వేలు ఇస్తారు. దీంతో రైతులకు మరింత వెసులుబాటు ఉంటుంది.  

రబీలో రాని వారికీ అందించే యోచన... 
2018–19 ఆర్థిక సంవత్సరంలో రైతుబంధు పథకం ప్రారంభమైంది. ఖరీఫ్, రబీలకు ఇప్పటివరకు రైతులకు సాయం అందజేశారు. ఖరీఫ్‌లో 51.50 లక్షల మంది రైతులకు రూ. 5,260.94 కోట్లు ఇచ్చారు. అలాగే రబీలో 49.03 లక్షల మంది రైతులకు రూ. 5,244.26 కోట్లు అందజేశారు. మొత్తంగా రూ. 10,505.20 కోట్లు ఇచ్చినట్లయింది. అయితే రబీలో కొందరు రైతులకు ఇంకా పూర్తిస్థాయిలో సొమ్ము అందలేదు. ఆర్థిక, ట్రెజరరీల మధ్య సమన్వయ లోపమో మరో కారణమో తెలియదు కానీ చాలామంది రైతులకు రబీ రైతుబంధు డబ్బులు పడినట్లు వారి మొబైల్‌ ఫోన్లకు మెసేజ్‌లు వెళ్లాయి. కానీ బ్యాంకుల్లో మాత్రం సొమ్ము పడలేదు.

దీంతో వ్యవసాయశాఖకు ఫిర్యాదులు వెళ్లాయి. కొందరి సమస్య పరిష్కారమైనా ఇంకొందరికి డబ్బు చేరలేదు. వారికి త్వరలో డబ్బులు వేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి స్పందిస్తూ అటువంటి వారు కొందరే ఉన్నట్లు తేలింది. ఇంకా డబ్బు అందని వారికి త్వరలోనే వేస్తామని ఆయన మంగళవారం తెలిపారు. గతేడాది ఖరీఫ్‌లో రైతుబంధు సొమ్మును ప్రభుత్వం చెక్కుల రూపేణా అందజేసింది. ప్రతీ గ్రామంలో సభలు పెట్టి చెక్కుల పంపిణీని పండుగలా నిర్వహించింది. రబీలోనూ అలాగే చేయాలని అనుకున్నారు. ఆ మేరకు చెక్కులనూ ముద్రించారు.

అయితే ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లడం, కోడ్‌ ప్రభావంతో చెక్కుల పంపిణీని ఎన్నికల కమిషన్‌ తిరస్కరించింది. రైతుల ఖాతాలోనే డబ్బులు జమ చేయాలని సూచించింది. ఆ మేరకు రైతుల బ్యాంకు ఖాతాలను వ్యవసాయశాఖ సేకరించి రైతులకు సొమ్ము బదిలీ చేసింది. వచ్చే ఖరీఫ్‌లోనూ రైతుబంధు సొమ్మును రైతుల ఖాతాలోనే నేరుగా వేయాలని సర్కారు నిర్ణయించింది. చెక్కుల పంపిణీ పెద్ద తతంగంలా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంది.+

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top