‘చేయి’ కలుపుదాం..!

adilabad tdp leaders to join congress along with Revanth Reddy - Sakshi

రేవంత్‌ను అనుసరించ నున్న మంచిర్యాల, ఆదిలాబాద్‌ నేతలు

నిర్మల్, కుమురంభీం జిల్లాల అధ్యక్షులు టీడీపీ వెంటే!

బోడ జనార్దన్, సోయం బాపూరావుల చేరిక లాంఛనమే

రేవంత్‌ దెబ్బతో టీడీపీ ఖతం.. కాంగ్రెస్‌కు కొత్త ఊపిరి!

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: తెలుగుదేశం పార్టీలో తాజాగా చిచ్చుపెట్టిన అనుముల రేవంత్‌రెడ్డితో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నాయకులు ‘చేయి’ కలిపారు. ఆయన కాంగ్రెస్‌లో చేరితే ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య నేతలు కూడా ఆ పార్టీ కండువా కప్పుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని భావిస్తున్నప్పటికీ, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జోక్యం చేసు కుంటే పరిణామాల్లో కొంత మార్పు ఉంటుందేమోనని ఆ పార్టీ అభిమానులు భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌లో చేరాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చిన రేవంత్‌ వర్గం మళ్లీ వెనుదిరిగే అవకాశం లేదని సమాచారం.ఇది జరిగితే ఉమ్మడి ఆదిలాబాద్‌లో కూడా టీడీపీకి కోలుకోలేని దెబ్బ. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలసపోయిన నాయకులతో ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ఖాళీ అయిన టీడీపీ జిల్లాలో ఓ జ్ఞాపకంగా మిగిలే పరిస్థితులు ఏర్పడనున్నాయి.

అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకతను సైతం అనుకూలంగా మలుచుకోలేక రోజురోజుకు నీరసిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి రేవంత్‌ గ్రూప్‌ చేరితే కొత్త ఉత్తేజం వచ్చే అవకాశం ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి టిక్కెట్టు కచ్చితంగా వస్తుందని భావిస్తున్న ముఖ్య నాయకులే ప్రస్తుతానికి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధం కాగా, పోటీ చేసే అవకాశం లేని నాయకులు తెలుగుదేశాన్నే అంటిపెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. మంచిర్యాల, ఆదిలాబాద్‌ జిల్లాల టీడీపీ అధ్యక్షులు బోడ జనార్దన్, సోయం బాపూరావు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతుండగా, నిర్మల్, కుమురం భీం జిల్లాల అధ్యక్షులు లోలం శ్యాంసుందర్, జి.ఆనంద్‌ టీడీపీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. జరుగుతున్న పరిణామాలతో కిందిస్థాయిలో తెలుగుదేశం పార్టీ వీరాభిమానులుగా ఉన్న కార్యకర్తలు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

రేవంత్‌కు అండగా మంచిర్యాల, ఆదిలాబాద్‌ నేతలు
తెలుగుదేశం సీనియర్‌ నేత, మాజీ మంత్రి బోడ జనార్దన్‌ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌రెడ్డికి బాహాటంగానే మద్ధతు ప్రకటించారు. గత కొంతకాలంగా కాంగ్రెస్‌లో చేరాలని భావిస్తున్న జనార్ధన్‌కు రేవంత్‌ రూపంలో అండ దొరికినట్లయింది. చెన్నూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జనార్ధన్‌ 2009 ఎన్నికల తరువాత నుంచే పార్టీలు మారుతూ వచ్చారు. వైఎస్‌ఆర్‌సీపీ, కాంగ్రెస్, బీజేపీ గడపలు తొక్కి తిరిగి 2014 ఎన్నికల తరువాత మాతృపార్టీ టీడీపీలోకి వచ్చారు.

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కుమార్‌ టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోవడంతో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయాలని భావించారు. అయితే కాంగ్రెస్‌ పార్టీలో గాడ్‌ఫాదర్‌ ఉంటే తప్ప అవకాశాలు రావని భావిస్తూ, అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆయనకు రేవంత్‌ ‘నీడ’ కలిసొచ్చినట్లయింది. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయానికొచ్చారు. ఈ విషయాన్ని ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ధ్రువీకరించారు. జనార్దన్‌తో పాటు ఇక్కడ టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న దుర్గం నగేష్‌ కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిపారు.

‘బోడ’ బాటలో సోయం బాపూరావు
బోథ్‌ మాజీ శాసనసభ్యుడు సోయం బాపూరావు కూడా తెలుగుదేశం పార్టీని వీడి రేవంత్‌ వెంట కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌ తరుపున 2004లో గెలిచిన ఆయన 2007లో పాస్‌పోర్టుల కుంభకోణంలో అరెస్టయ్యారు. అనంతరం 2009 ఎన్నికల్లో ఆయన టిక్కెట్టు కోల్పోగా, అప్పటి తెలుగుదేశం నేత గోడెం నగేష్‌ టీడీపీ–టీఆర్‌ఎస్‌ పొత్తుతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన ఆయన ప్రస్తుతం ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసినా ఉపయోగం ఉండదని భావిస్తున్న బాపూరావు రేవంత్‌తో పాటు కాంగ్రెస్‌ పార్టీలో చేరి బోథ్‌ అసెంబ్లీ నుంచి గానీ, ఆదిలాబాద్‌ లోక్‌సభ నుంచి గాని పోటీ చేయాలన్న యోచనతో ఉన్నారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డి నుంచి తగిన హామీ పొందినట్లు సమాచారం. బోడ జనార్దన్, సోయం బాపూరావు కాంగ్రెస్‌లో చేరికతో ఈ రెండు జిల్లాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా కాంగ్రెస్‌ గూటికే చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నిర్మల్, కుమురంభీంలో యథాతథం
ఉమ్మడి ఆదిలాబాద్‌లో రెండు జిల్లాల నేతలు రేవంత్‌ వెంట కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతుండగా, నిర్మల్, కుమురంభీం జిల్లాల నుంచి పెద్దగా వలసలు వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. గతంలోనే ఈ జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరగా, ఇటీవల మాజీ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ కుటుంబం కారెక్కింది. ప్రస్తుతం నిర్మల్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా లోలం శ్యాంసుందర్, కుమరంభీం జిల్లా అధ్యక్షుడు జి.ఆనంద్‌ పార్టీలోనే కొనసాగనున్నారు. పార్టీలో సీనియర్‌ నాయకుడు జి.బుచ్చిలింగంకు జి.ఆనంద్‌ సోదరుడు. వీరు కాకుండా నిర్మల్‌ నాయకులు కోరిపల్లి భూషన్‌రెడ్డి, ఓం ప్రకాష్‌ లడ్డా ఎటువైపు వెళతారనేది తేలలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top