
అదనపు కట్నం.. వేధింపులు
సైదాపూర్ రూరల్ : సైదాపూర్ మండలం ఎక్లాస్‌పూర్ గ్రామానికి చెందిన మనీష (22) ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది.
జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల ఇద్దరు వివాహితలు వేధింపులు తాళలేక ఉసురు తీసుకున్నారు. సైదాపూర్ మండలం ఎక్లాస్‌పూర్‌లో వరకట్న దాహానికి మనీష బలికాగా.. జగిత్యాల పట్టణంలో అబార్షన్ చేయించుకోవాలని. అదనంగా కట్నం తీసుకు రావాలని భర్త వేధించడంతో పర్విన్ ఉరివేసుకుని ప్రాణం తీసుకుంది.
సైదాపూర్ రూరల్ :
సైదాపూర్ మండలం ఎక్లాస్‌పూర్ గ్రామానికి చెందిన మనీష (22) ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు.. బంధువుల కథనం.. శంకరపట్నం మండలం తాడికల్ పంచాయతీ పరిధిలోని చింతగట్టు గ్రామానికి చెందిన గంగిపల్లి అంజయ్య కూతురు మనీషను గత ఏడాది మే 23వ తేదీన సైదాపూర్ మండలం ఎక్లాస్‌పూర్ గ్రామానికి చెందిన చిక్కుల కళావతి -కొంర య్య దంపతుల పెద్ద కొడుకు శ్రీనివాస్‌కు ఇచ్చి వివాహం చేశారు.
పెళ్లి సమయంలో మనీష తల్లిదండ్రులు శ్రీనివాస్‌కు రూ. 3 లక్షల కట్నం, ద్విచక్రవాహనం, 6 తులాల బంగారం ఇతర లాంఛనాలన్నీ ఇచ్చారు. చెల్లె పెళ్లి కోసం రూ. లక్ష తీసుకురావాలని శ్రీనివాస్, అత్త కళావతి, ఆడబిడ్డ తిరుమల, మరుదలు మొగిళి, చారీలు వేధించారు. దీంతో మనీష తండ్రి గతన ఆగస్టులో రూ. 50 వేలు ఇచ్చాడు. అయినా మరో రూ. 50 వేలు తీసుకు రావాల్సిందేనని రోజూ వేధింపులకు గురిచేశారు.
ఇంతలో మనీష మంగళవారం ఒంటికి నిప్పంటించుకుని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. బిడ్డను అత్తింటివరే నిప్పంటించి హత్యచేశారని మృతురాలి తండ్రి అంజయ్య ఆరోపించారు. మనీష తండ్రి ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సైదాపూర్ ఎస్సై ఉదయ్‌కుమార్ తెలిపారు. న్యాయం చేసే వరకూ మృతదేమాన్ని కదిలించేది లేదని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేస్తున్నారు.
జగిత్యాలలో సమీనా పర్విన్
జగిత్యాల: భర్త వేధింపులు తాళలేక జగిత్యాల ఖిలాగడ్డకు చెందిన సమీనా పర్విన్ (29) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సీఐ నరేశ్ కుమార్ కథనం... మంచిర్యాలకు చెందిన సమీనా పర్వీన్‌కు నాలుగేళ్ల క్రితం జగిత్యాల ఖిలాగడ్డకు చెందిన మదిన్ అబ్బాస్‌తో వివాహం అయింది. వీరికి ఇద్దరు ఉన్నారు. సమీనా ఇటీవలే మళ్లీ గర్భందాల్చింది. మూడోసారి కూడా అమ్మాయే పుడుతుందని భర్త మదిన్ అబ్బాస్ అబార్షన్ చేంచుకోవాలని భార్యను వేధించేవాడు.
అంతేగాకుండా పెళ్లి అయిన నాటి నుంచి అదనంగా కట్నం తీసుకురావాలని ఒత్తిడి చేసేవాడు. ఈ విషయమై మంగళవారం భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. ఇంతలో భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడంతో సమీనా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి అబ్రార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.