26 మందిపై వేటు?

Activities on trade tax scam - Sakshi

వాణిజ్య పన్నుల కుంభకోణంపై చర్యలు 

ఫైలుపై సంతకం చేసిన సీఎం కేసీఆర్‌?

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: బోధన్‌ వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో బాధ్యులపై సర్కారు ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించింది. కుంభకోణం సూత్రధారి, ట్యాక్స్‌ కన్సల్టెంట్‌ శివరాజ్‌తో చేతులు కలిపి సర్కారు కు రూ.వందల కోట్ల పన్ను ఎగవేతకు సహకరించిన ఆ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బందిపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది. మొత్తం 26 మం దిపై సస్పెన్షన్, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది. అదనపు కమిషనర్ల నుంచి, జూనియర్‌ అసిస్టెంట్‌ వరకు వివిధ స్థాయి అధికారులు ఈ జాబితాలో ఉన్నారు. క్రమశిక్షణ చర్యలకు సంబంధించి న ఫైలుపై ఈ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూడా సంతకం చేసినట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో ఈ మేరకు సస్పెన్షన్లు, చార్జిమెమోలకు సంబంధించిన ఆదేశాలు జారీ కానున్నట్లు సమాచారం. 

కొనసాగిన శాఖాపరమైన విచారణ
ఈ కుంభకోణంపై ఆ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం శాఖా పరమైన విచారణ చేపట్టింది. ప్రత్యేక కమిషనర్‌ ఎం.సత్యనారాయణ రెడ్డి నేతృత్వంలోని బృందం విచారణ జరిపింది. ఈ కుంభకోణంతో సంబంధమున్న అధికారులు, సిబ్బంది పాత్రపై విచారణ చేపట్టింది. కార్యాలయంలోని కంప్యూటర్లు, భారీ సంఖ్యలో రికార్డులను స్వాధీనం చేసుకుని సుమారు నాలుగు నెలల పాటు విచారణ జరిపింది. ఈ మేరకు సెప్టెంబర్‌ మొదటివారంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించింది.

అదనపు కమిషనర్లపై సైతం..
ప్రభుత్వం తీసుకోనున్న చర్యల జాబితాలో ఇద్దరు అదనపు కమిషనర్లు ఉన్నారు. అలాగే, ముగ్గురు జాయింట్‌ కమిషనర్లు ఉన్నారు. వీరితో పాటు కుంభకోణం జరిగిన బోధన్‌ సీటీవో కార్యాలయం పరిధిలోకి వచ్చే నిజామాబాద్‌ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన ఇద్దరిపై కూడా చర్యలు చేపట్టనున్నారు. అదేవిధంగా ఈ కార్యాలయంలో పనిచేసిన ఆరుగురు అసిస్టెంట్‌ కమిషనర్లపైనా సస్పెన్షన్‌ వేటు పడనుంది. కుంభకోణం జరిగిన కాలంలో బోధన్‌ సీటీవో కార్యాలయంలో పనిచేసిన నలుగురు సీటీవోలపై, తొమ్మిది మంది ఏసీటీవోలపై చర్యలు ఉండే అవకాశాలున్నాయి. 2005 నుంచి కుంభకోణం వెలుగుచూసే వరకు ఇక్కడ పనిచేసిన దాదాపు అందరు అధికారులపై చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే ఈ కేసులో ఓ జాయింట్‌ కమిషనర్‌ డి.శ్రీనివాస్‌రావుపై సస్పెన్షన్‌ వేటు పడగా, మరో డిప్యూటీ కమిషనర్‌ ఇంకా పరారీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బోధన్‌లో సీటీవోగా పనిచేసిన రిటైర్డు అధికారిని అరెస్టు చేశారు. వీరంతా శివరాజ్‌తో అంటకాగిన వారుగా విచారణలో తేలింది. 

ఆంధ్రాకు వెళ్లిన వారిపైనా..
ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిన వారిలో ఇద్దరు అదనపు కమిషనర్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్నారు. శివరాజ్‌తో చేతులు కలిపిన ఈ ఉన్నతాధికారులిద్దరూ రూ.లక్షలు దండుకుని రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రాకు ఆప్షన్‌ పెట్టుకుని వెళ్లిపోయారు. వీరిపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top