ఏసీబీ వలలో ఎస్‌ఐ


వంగూరు: లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పంచాయతీ కార్యదర్శి చిక్కిన ఉదంతం మరకముందే మరో అధికారి వారి వలలో పడ్డాడు. వంగూరు ఎస్‌ఐ సీహెచ్.రాజు, కానిస్టేబుల్ రాఘవేందర్ గురువారం సాయంత్రం బాధితుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. వివరాలను ఏసీబీ డీఎస్పీ రాందాస్‌తేజ విలేకరులకు వివరించారు. ఉప్పునుంతల మండలం కాంసానిపల్లి గ్రామానికి చెందిన భీమా, జైపాల్ ఈనెల 5న మోటర్‌సైకిల్‌పై 50లీటర్ల సారా తీసుకుని డిండిచింతపల్లి గ్రామంలో విక్రయించేందుకు వస్తుండగా వంగూరు పోలీసులు పట్టుకుని ఇద్దరిపై కేసు నమోదుచేశారు.

 

 వారి నుంచి సారాతోపాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి నిందితులు భీమా, జైపాల్‌లకు స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఎస్‌ఐ సీహెచ్.రాజు రూ.10వేల లంచం డిమాండ్‌చేశారు. అయితే తమకు అంతడబ్బు ఇచ్చే స్థోమత లేదని బతిమాలిడినా వినిపించుకోలేదు. ఈ క్రమంలో భీమా ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

 

  పథకం ప్రకారమే గురువారం ఉదయం నుంచే ఏసీబీ అధికారులు స్టేషన్ పరిసర ప్రాంతాల్లో నిఘాఉంచారు. ఎస్‌ఐ రాజుకు ఇచ్చిన మాటప్రకారం భీమా పదివేల నగదును స్టేషన్ ప్రాంగణంలో కానిస్టేబుల్ రాఘవేందర్‌కు ఇచ్చారు. ఆ వెంటే సదరు కానిస్టేబుల్ ఎస్‌ఐ చేతికి ఇస్తుండగా ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడిచేసి ఇద్దరినీ పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 

కేసుకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు ఏసీబీ డీఎస్పీ రాందాస్‌తేజ తెలిపారు. కాగా, ఈ ఏడాది జనవరి 29న ఎస్‌ఐ రాజు వంగూరు ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టగా, కానిస్టేబుల్ రాఘవేందర్ ఐదేళ్లుగా ఇక్కడే కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. దాడుల్లో ఏసీబీ సీఐ గోవిందరెడ్డి, ముత్తు, హెడ్‌కానిస్టేబుల్ హస్రతోపాటు వరప్రసాద్‌రెడ్డి, నరహరి పాల్గొన్నారు.

 

 వరుసదాడులతో బెంబేలు

 వంగూరు మండలంలో ఏసీబీ దాడుల పరంపర కొనసాగుతుంది. గతనెల 27వ తేదీన ఉమ్మాపూర్ వీఆర్‌ఓ భీమన్న రూ.ఐదువేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. పక్షంరోజులు గడవకముందే ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఏసీబీకి చిక్కడం ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top