ఆర్థిక మూలాలపైనే దృష్టి! | ACB send notice to Vem Narendar Reddy's son | Sakshi
Sakshi News home page

ఆర్థిక మూలాలపైనే దృష్టి!

Jul 16 2015 1:53 AM | Updated on Aug 17 2018 12:56 PM

బుధవారం ఏసీబీ విచారణ అనంతరం తిరిగివెళ్తున్న  వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణకీర్తన్ - Sakshi

బుధవారం ఏసీబీ విచారణ అనంతరం తిరిగివెళ్తున్న వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణకీర్తన్

దాదాపు రూ.150 కోట్ల ‘ఓటుకు కోట్లు’ కుంభకోణంలో ఇప్పటికే సూత్రధారి, పాత్రధారులు ఎవరనేదానిపై ఒక నిర్ధారణకు వచ్చిన ఏసీబీ..

సాక్షి, హైదరాబాద్: దాదాపు రూ.150 కోట్ల ‘ఓటుకు కోట్లు’ కుంభకోణంలో ఇప్పటికే సూత్రధారి, పాత్రధారులు ఎవరనేదానిపై ఒక నిర్ధారణకు వచ్చిన ఏసీబీ.. ఇప్పుడు మిగతా కీలకాంశాలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌రెడ్డి ఇవ్వజూపిన రూ.50 లక్షలు, ఇస్తానని హామీ ఇచ్చిన మిగతా రూ.4.5 కోట్లకు సంబంధించిన ఆర్థిక మూలాలపై లోతుగా ఆరా తీస్తోంది. కేసు దర్యాప్తులో ఇది కీలక కోణమని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి బుధవారం టీడీపీ నేత వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణకీర్తన్‌ను ఏసీబీ సుదీర్ఘంగా విచారించింది.

సీఆర్‌పీసీ సెక్షన్ 160 ప్రకారం నోటీసులు జారీ చేయడంతో బుధవారం ఉదయం 10 గంటలకు కృష్ణకీర్తన్ ఏసీబీ కార్యాలయానికి వచ్చారు.దాదాపు ఎనిమిదిన్నర గంటల పాటు వివిధ కోణాల్లో ఆయన్ను ప్రశ్నించినట్లు తెలిసింది. సుదీర్ఘ విచారణలో కృష్ణకీర్తన్ కాస్త ఆందోళనకు గురైనట్లు సమాచారం. సాయంత్రం 5 గంటల తర్వాత కూడా విచారణ ముగియకపోవడంతో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. ఆందోళన చెందిన కుటుంబీకులు ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే చివరకు కీర్తన్ ఏసీబీ కార్యాలయం నుంచి సాయంత్రం 6.40 గంటల సమయంలో బయటకు వచ్చారు.
 
అంతా నాన్నగారే చూస్తారు!
‘‘రాజకీయాలకు నేను దూరంగా ఉంటాను. నాన్నగారు ఎప్పుడూ కూడా మాతో రాజకీయ విషయాలు చర్చించరు. వాటిపట్ల నాకు ఆసక్తి ఉండదు. అంతా నాన్నగారే చూసుకుంటారు..’’ అని కృష్ణకీర్తన్ ఏసీబీ విచారణలో అన్నట్లు సమాచారం. అయితే ఏసీబీ కూడా ఆయన నుంచి సమాచారం రాబట్టేందుకు పలు రకాల ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. కృష్ణకీర్తన్ ఫోన్ నుంచి పలుసార్లు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్‌లకు కాల్స్ వెళ్లడంపై ప్రధానంగా ప్రశ్నించినట్లు సమాచారం. ‘నా ఫోన్ నుంచి మా తండ్రి వేం నరేందర్‌రెడ్డి మాట్లాడారు’ అని కీర్తన్ చెప్పినట్లు తెలుస్తోంది.

మే 31న స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇవ్వడానికి వెళ్లే ముందు రేవంత్‌తోపాటు ఉదయసింహ ఇద్దరూ వేం నరేందర్‌రెడ్డితో సంప్రదింపులు జరిపినప్పుడు కృష్ణకీర్తన్ కూడా అక్కడే ఉన్నట్లు ఏసీబీ ప్రాథమికంగా భావిస్తోంది. ఈ దిశగా డబ్బులకు సంబంధించి కృష్ణకు ఏసీబీ కీలక ప్రశ్నలు సంధించినప్పటికీ ఆయన్నుంచి సరైన సమాధానం రాలేదని తెలిసింది. కొందరు టీడీపీ నాయకులు తమ ఇంటికి వచ్చినప్పుడు చూడటమే తప్ప, వారితో ప్రత్యేకించి మాట్లాడిన సందర్భాలు లేవని చెప్పినట్లు సమాచారం.
 
వేంను మళ్లీ పిలిచే అవకాశం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వేం నరేందర్‌రెడ్డిని ఏసీబీ మరోసారి విచారణకు పిలవాలని భావిస్తోంది. కృష్ణకీర్తన్ విచారణ తర్వాత ‘ఆర్థికాంశాల’పై ఏసీబీకి ఓ స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. వేం నరేందర్‌రెడ్డిని మరోసారి పిలిచి పూర్తిస్థాయి విచారణ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో వేం నరేందర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఈసారి ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి విచారణకు సహకరించకపోతే చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement