
ఏసీబీ వలలో కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్
నల్లగొండ-మహబూబ్‌నగర్ డివిజన్ వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ నల్ల సాయికిశోర్ నివాసంపై గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
* రూ. కోటికి పైగా ఆస్తుల గుర్తింపు
* కిలో బంగారం,పది కిలోల వెండి స్వాధీనం
నల్లగొండ క్రైం/ హైదరాబాద్: నల్లగొండ-మహబూబ్‌నగర్ డివిజన్ వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ నల్ల సాయికిశోర్ నివాసంపై గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమాస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో నల్లగొండ, హైదరాబాద్‌లోని ఆయన నివాసాల్లో ఏకకాలంగా సోదాలు నిర్వహించారు. మొత్తం ఏడు బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి.
హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ బృందాలు తెల్లవారుజామున నల్లగొండలోని సాయికిశోర్ నివాసానికి చేరుకున్నా యి. ఉదయం 6:30 గంటల వరకు సోదాలు పూర్తి చేసిన అధికారులు విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయన కార్యాలయంలో కూడా తనిఖీలు నిర్వహించి రూ. 60 వేల నగదు, తగిన ఆధారాలను సేకరించారు. సాయికిశోర్‌ను హైదరాబాద్ తీసుకెళ్లారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్ ఎస్‌వీఎస్‌ఎస్ సంకల్ప అపార్ట్‌మెంట్‌లో ప్లాట్ నంబర్ 409లో అధికారులు సోదాలు నిర్వహించారు.
ఇక్కడ ఒక కిలో బంగారం, 10 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు సంకల్ప అపార్ట్‌మెంట్‌లో ఒక ఫ్లాట్, గచ్చిబౌలిలో నిర్మాణంలో ఉన్న ఒక ఇండిపెండెంట్‌హౌస్, కృష్ణాజిల్లా విసన్నపేటలో ఆరు ఎకరాల వ్యవసాయ భూమి, కారు, మోటారు సైకిళ్లు ఉన్నట్లు గుర్తించారు. సుమారు కోటి రూపాయల విలువ చేసే ఆస్తులను గుర్తించామని, ఇంకా సోదాలు చేస్తున్నట్లు డీఎస్‌పీ కోటేశ్వర్‌రావు తెలిపారు. ఏసీబీ జాయింట్ డెరైక్టర్ సత్యనారాయణ పర్యవేక్షణలో జరిగిన ఈ దాడులకు నల్లగొండ జిల్లా డీసీపీ కోటేశ్వర్‌రావు అధికారిగా వ్యవహరిస్తున్నారు.