
టీడీపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విశాఖ, ఏలూరు ఎంపీలు భరత్, పుట్టా మహేష్‌తో వెంకటేశ్ నాయుడు (ఫైల్)
ఏసీబీ కోర్టులో అడ్డంగా దొరికిపోయిన సిట్
ఎదురు దెబ్బ తగిలేసరికి తెరపైకి ఇంకో కట్టుకథ
ఇందులో భాగంగా ఓ వీడియో లీక్
దానిపై ఎల్లో మీడియా ద్వారా విపరీత ప్రచారం
ఎన్నికల్లో పంచిన నోట్లతో వెంకటేశ్ నాయుడంటూ ట్రోలింగ్
2023 నవంబర్ నాటి దృశ్యాలంటూ అచ్చేసిన వైనం
ఆ వీడియోలో రూ.2 వేల నోట్లతో కనిపిస్తున్న వెంకటేశ్ నాయుడు
దేశంలో రూ.2 వేల నోట్ల చలామణి పూర్తిగా ఆగిపోయిందని 2023 మే 19న ప్రకటించిన ఆర్బీఐ
అలాగైతే టీడీపీ నేతలతోనూ ఇదే వెంకటేశ్ నాయుడికి సంబంధాలు
రామ్మోహన్, భరత్, పుట్టా, పెమ్మసానిలతో ఫొటోలు
మరి ఈ డబ్బు వారందరిదీ అంటే..
సాక్షి, అమరావతి: నయా బేతాళ కుట్రలో చంద్రబాబు, సిట్, ఎల్లో మీడియా కలసికట్టుగా మరో అంకాన్ని సృష్టించారు. రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫాంహౌస్‌లో సిట్ జప్తు చేసిన రూ.11 కోట్లు రాజ్ కేసిరెడ్డికి చెందినవేనంటూ నమ్మించడానికి చేసిన యత్నం ఏసీబీ కోర్టు సాక్షిగా శనివారం బెడిసి కొట్టడంతో అప్పటికప్పుడు మరో నాటకానికి తెర లేపారు. బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ.11 కోట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో పంచనామా నిర్వహించాలని, ప్రతీ నోటుపై ఉన్న సీరియల్ నంబర్‌ను రికార్డ్ చేయాలని సిట్ దర్యాప్తు అధికారిని ఏసీబీ కోర్టు ఆదేశించింది.
డిపాజిట్ చేశామని చెబుతున్నందున అందుకు సంబంధించిన రిసీప్ట్ (కౌంటర్ ఫైల్) చూపాలని కోరగా, తమ బండారం బయట పడుతుందని దర్యాప్తు అధికారి పత్తా లేకుండా పోయిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ పెద్దలు, సిట్‌కు దిమ్మతిరిగిపోయింది. వెంటనే ఏదో ఒకటి చేసి.. ఈ విషయంపై నుంచి ప్రజల దృష్టి మళ్లించకపోతే ఇది పూర్తిగా తప్పుడు కేసేనని తెలిసిపోతుందని అప్పటికప్పుడు ఓ వీడియోను ఎల్లో మీడియాకు లీక్ చేశారు.
తద్వారా ఆ వీడియోకు విపరీత ప్రచారం కల్పించారు. ఆ వీడియోలో వెంకటేశ్ నాయుడు కరెన్సీ నోట్ల పక్కన ఉన్న ఫొటోను ఎల్లో మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ వైరల్ చేశారు. వీళ్లు చెప్పినట్లు వినేవారిని ముందు పెట్టి సరికొత్త నాటకానికి తెరతీశారు.
చెల్లని నోట్లతో కట్టుకథ
చెవిరెడ్డి అనుచరుడు వెంకటేశ్ నాయుడు పంపిణీ చేస్తున్న డబ్బుగా దానిని చిత్రీకరించారు. ఆ ఫొటోలు, వీడియోల్లో రూ.2 వేల నోట్లు కనిపిస్తున్నాయి. అయితే దేశంలో రూ.2 వేల నోట్ల చలామణి పూర్తిగా ఆగిపోయిందని 2023 మే 19న ఆర్బీఐ చివరి సారిగా ప్రకటించింది. కానీ 2024 ఎన్నికల సమయంలో మద్యం సొమ్ము అక్రమంగా తరలించారని చెవిరెడ్డిని అరెస్టు చేశారు.
దీనిని బట్టి అర్థం కావడం లేదూ ఇదంతా కట్టుకథ అని. ఇదే వెంకటేశ్ నాయుడికి టీడీపీ నేతలతోనే సంబంధాలున్నాయని సోషల్ మీడియా సాక్షిగా బైటపడింది. కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని, ఎంపీలు భరత్, పుట్టా మహేష్‌లతో వెంకటేశ్ నాయుడు ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ లెక్కన ఈ డబ్బు వారందరిదీ అని కూడా అనుకోవచ్చు కదా. వెంకటేశ్ నాయుడు నోట్ల కట్టలతో ఉన్న ఫొటో పక్కన వీరి ఫొటోలు కూడా పెట్టి.. ఇది వీరి డబ్బే అని చెప్పగలరా? తాము చెప్పినట్టు వినేవాళ్లను రంగంలోకి దించి కట్టుకథ అల్లుతున్నారనేందుకు ఇదే ప్రబల నిదర్శనం.
ఇదేవిషయం గతంలోనూ వెల్లడయ్యింది ఇపుడూ నిరూపితమయింది. ఇదంతా ప్రభుత్వ పెద్దలు, సిట్, ఎల్లో మీడియా కూడబలుక్కుని సమష్టిగా ఆడుతున్న నాటకం అని ఇట్టే తెలిసిపోతోంది. ఎలాగైనా సరే మద్యం అక్రమ కేసును సక్రమం అని నిరూపించడమే లక్ష్యంగా సిట్ బరితెగించి వ్యవహరిస్తోంది. శనివారం నాటి ఎపిసోడ్‌లో పరువు పోగొట్టుకున్న సిట్.. మరో సరికొత్త ఎపిసోడ్ ద్వారా బేతాళ కథను రక్తి కట్టించడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తోంది.