‘ఆసరా’కు అడుగులు 

Aasara Pension Benefits Increase In Nalgonda - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో ఆసరా పెన్షన్‌దారుల సంఖ్య పెరగనుంది. టీఆర్‌ఎస్‌ను తిరిగి గెలిపిస్తే ఆసరాలోని వృద్ధాప్య పెన్షన్లకు అర్హత 65 ఏళ్ల వయస్సు నుంచి 57 ఏళ్లకు కుదిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల సభల్లో ప్రజలకు వాగ్దానం చేశారు. అన్నమాట ప్రకారం పెన్షన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ వడివడిగా సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రారంభమైంది. పెన్షన్‌ దారుల వయోపరిమితి తగ్గిస్తూ ఓటర్ల జాబితా, కుటుంబ సర్వేల ఆధారంగా లబ్ధిదారులను గుర్తించాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలందాయి.

కలెక్టర్లు కూడా ఇప్పటికే జిల్లాస్థాయిలో అర్హులను గుర్తించారు. గ్రామసభల ద్వారా అర్హులను ఎంపిక చేయాలని ఎంపీడీఓలకు ఆయా పోలింగ్‌స్టేషన్ల వారీగా జాబితాలు పంపించారు. జిల్లాలో ప్రస్తుతం 67,343 ఆసరా పెన్షన్లు 65 ఏళ్లు పైబడినవారికి అందుతున్నాయి. ప్రతి లబ్ధిదారుడికి రూ.వెయ్యి చొప్పున అందుతున్న విషయం తెలిసిందే.  వయో పరిమితిని కుదిం చడంతోపాటు రూ.వెయ్యి నుంచి రూ.2016కు పెంచుతామని ఎన్నికల్లో కేసీఆర్‌ హామీ ఇచ్చారు. దీంతో జిల్లాలో ఎంపిక కార్యక్రమం మొదలైంది. ఓటర్ల జాబితా ఆధారంగా జిల్లాలో 85,103 మంది 57 ఏళ్లు దాటిన వారు ఉన్నారు.

అర్హుల ఎంపిక 
జిల్లాస్థాయిలో ఓటర్ల జాబితా ఆధారంగా 57 ఏళ్ల పైబడిన వారిని ఆయా పోలింగ్‌స్టేషన్ల వారీగా గుర్తించారు. ఆయా జాబితాలను ఎంపీడీఓలకు అందించారు. వీటి ఆధారంగా గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఆ ప్రక్రియ ప్రారంభం కానుంది.

అర్హుల ఎంపిక ఇలా...
జిల్లాలో ప్రస్తుతం వృద్ధాప్య పెన్షన్‌ పొందుతున్నవారు 67,347 మంది ఉన్నారు. ప్రస్తుతం ఓటర్ల జాబితా ఆధారంగా 57 ఏళ్లు పైబడినవారు 85,103 మంది ఉన్నారు. అయితే అర్హుల ఎంపిక మాత్రం ప్రారంభం కానుంది. ఇందులో ఉద్యోగులు, ఉద్యోగ విరమణ పొందినవారు, దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నవారు, ఇప్పటికే ఓ ఇంట్లో ఒకరు పెన్షన్‌ పొందితే మిగిలిన వారు ఉన్నారు. ఒక ఇంట్లో ఒకటే పెన్షన్‌ విధానం అమలవుతుంది. దీంతో గ్రామసభల ద్వారా ఈ నిబంధనల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక జరగనుంది.

50వేల వరకు కొత్త పెన్షన్‌దారులు 
జిల్లాలో కొత్తగా 50 వేల వరకు కొత్తగా పెన్షన్‌ పొందేందుకు అర్హత పొందే అవకాశం ఉంది. ఓటర్ల జాబితా ఆధారంగా 85,103 మంది ఉండగా, దాదాపు 30 వేల మంది వరకు నిబంధనల ప్రకారం అనర్హులుగా తేలే అవకాశం ఉంది. అసలైన లబ్ధిదారులు 50 వేల వరకు ఉండవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు.
 
ఏప్రిల్‌ 1 నుంచి కొత్త పెన్షన్‌ అమలు
ప్రభుత్వం నూతనంగా 57 ఏళ్లు నిండిన అర్హులను ఎంపిక చేసి అర్హులను గుర్తించే కార్యక్రమం ప్రారంభించింది. ప్రక్రియ ముగిసిన అనంతరం జాబితాను జిల్లాల వారీగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. అక్కడ ఆమోదం పొందిన తర్వాత ఏప్రిల్‌ 1 నుంచి కొత్తగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు పెరిగిన పెన్షన్‌ రూ.2016ను కూడా అప్పటి నుంచే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అర్హుల్లో ఆనందం
50 వేలకు పైబడి అన్ని అర్హతలు ఉన్నవారిలో ఆనందం నెలకొంది. ప్రభుత్వం వయోపరిమితి తగ్గించడంతో జిల్లాలో 50 వేల మంది వరకు అర్హత సాధించే అవకాశం ఉంది. వారందరికీ ఏప్రిల్‌ 1 నుంచి పెన్షన్‌ను అందించడంతోపాటు పెరిగిన పెన్షన్‌ అమలు చేస్తుండడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. గ్రామాల్లో ఏ దిక్కూ లేనివారు చాలావరకు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయంతో చాలా కుటుం బాలకు ఆర్థిక భరోసాను అందించినట్లవుతుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top