breaking news
increase in the pension
-
‘ఆసరా’కు అడుగులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో ఆసరా పెన్షన్‌దారుల సంఖ్య పెరగనుంది. టీఆర్ఎస్ను తిరిగి గెలిపిస్తే ఆసరాలోని వృద్ధాప్య పెన్షన్లకు అర్హత 65 ఏళ్ల వయస్సు నుంచి 57 ఏళ్లకు కుదిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సభల్లో ప్రజలకు వాగ్దానం చేశారు. అన్నమాట ప్రకారం పెన్షన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ వడివడిగా సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రారంభమైంది. పెన్షన్ దారుల వయోపరిమితి తగ్గిస్తూ ఓటర్ల జాబితా, కుటుంబ సర్వేల ఆధారంగా లబ్ధిదారులను గుర్తించాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలందాయి. కలెక్టర్లు కూడా ఇప్పటికే జిల్లాస్థాయిలో అర్హులను గుర్తించారు. గ్రామసభల ద్వారా అర్హులను ఎంపిక చేయాలని ఎంపీడీఓలకు ఆయా పోలింగ్స్టేషన్ల వారీగా జాబితాలు పంపించారు. జిల్లాలో ప్రస్తుతం 67,343 ఆసరా పెన్షన్లు 65 ఏళ్లు పైబడినవారికి అందుతున్నాయి. ప్రతి లబ్ధిదారుడికి రూ.వెయ్యి చొప్పున అందుతున్న విషయం తెలిసిందే. వయో పరిమితిని కుదిం చడంతోపాటు రూ.వెయ్యి నుంచి రూ.2016కు పెంచుతామని ఎన్నికల్లో కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో జిల్లాలో ఎంపిక కార్యక్రమం మొదలైంది. ఓటర్ల జాబితా ఆధారంగా జిల్లాలో 85,103 మంది 57 ఏళ్లు దాటిన వారు ఉన్నారు. అర్హుల ఎంపిక జిల్లాస్థాయిలో ఓటర్ల జాబితా ఆధారంగా 57 ఏళ్ల పైబడిన వారిని ఆయా పోలింగ్స్టేషన్ల వారీగా గుర్తించారు. ఆయా జాబితాలను ఎంపీడీఓలకు అందించారు. వీటి ఆధారంగా గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఆ ప్రక్రియ ప్రారంభం కానుంది. అర్హుల ఎంపిక ఇలా... జిల్లాలో ప్రస్తుతం వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నవారు 67,347 మంది ఉన్నారు. ప్రస్తుతం ఓటర్ల జాబితా ఆధారంగా 57 ఏళ్లు పైబడినవారు 85,103 మంది ఉన్నారు. అయితే అర్హుల ఎంపిక మాత్రం ప్రారంభం కానుంది. ఇందులో ఉద్యోగులు, ఉద్యోగ విరమణ పొందినవారు, దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నవారు, ఇప్పటికే ఓ ఇంట్లో ఒకరు పెన్షన్ పొందితే మిగిలిన వారు ఉన్నారు. ఒక ఇంట్లో ఒకటే పెన్షన్ విధానం అమలవుతుంది. దీంతో గ్రామసభల ద్వారా ఈ నిబంధనల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. 50వేల వరకు కొత్త పెన్షన్‌దారులు జిల్లాలో కొత్తగా 50 వేల వరకు కొత్తగా పెన్షన్ పొందేందుకు అర్హత పొందే అవకాశం ఉంది. ఓటర్ల జాబితా ఆధారంగా 85,103 మంది ఉండగా, దాదాపు 30 వేల మంది వరకు నిబంధనల ప్రకారం అనర్హులుగా తేలే అవకాశం ఉంది. అసలైన లబ్ధిదారులు 50 వేల వరకు ఉండవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త పెన్షన్ అమలు ప్రభుత్వం నూతనంగా 57 ఏళ్లు నిండిన అర్హులను ఎంపిక చేసి అర్హులను గుర్తించే కార్యక్రమం ప్రారంభించింది. ప్రక్రియ ముగిసిన అనంతరం జాబితాను జిల్లాల వారీగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. అక్కడ ఆమోదం పొందిన తర్వాత ఏప్రిల్ 1 నుంచి కొత్తగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు పెరిగిన పెన్షన్ రూ.2016ను కూడా అప్పటి నుంచే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హుల్లో ఆనందం 50 వేలకు పైబడి అన్ని అర్హతలు ఉన్నవారిలో ఆనందం నెలకొంది. ప్రభుత్వం వయోపరిమితి తగ్గించడంతో జిల్లాలో 50 వేల మంది వరకు అర్హత సాధించే అవకాశం ఉంది. వారందరికీ ఏప్రిల్ 1 నుంచి పెన్షన్‌ను అందించడంతోపాటు పెరిగిన పెన్షన్ అమలు చేస్తుండడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. గ్రామాల్లో ఏ దిక్కూ లేనివారు చాలావరకు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయంతో చాలా కుటుం బాలకు ఆర్థిక భరోసాను అందించినట్లవుతుంది. -
హెచ్ఆర్ఏ 30 శాతానికి పెంపు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏ(ఇంటి అద్దె భత్యం) 30 శాతానికి పెరగనున్నట్లు సమాచారం. ఆ మేరకు అలవెన్సుల్లో మార్పులు చేర్పుల కోసం ఏర్పాౖటెన అలవెన్సుల కమిటీ తన నివేదికను త్వరలో ఆర్థికమంత్రికి సమర్పించనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు మెట్రో నగరాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల మూలవేతనంపై 30 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని కమిటీ సూచించింది. జస్టిస్ ఏకే మాథూర్ నేతృత్వంలోని ఏడో వేతన సంఘం సిఫార్సుల్లోని మూల వేతనం, పెన్షన్ పెంపునకు కేంద్రం ఆమోదం తెలపగా... అలవెన్సులకు సంబంధించిన సూచనల్ని కమిటీకి అప్పగించింది. కేబినెట్ సూచన మేరకు జులై 2016న కేంద్ర ఆర్థిక కార్యదర్శి నేతృత్వంలో అలవెన్సుల కమిటీని ఏర్పాటుచేశారు. ఏడో వేతన సంఘం 196 అలవెన్సుల్ని పరిశీలించి అందులో 51 రద్దు చేయాలని, అలాగే 37 అలవెన్సుల్ని వేరే వాటిలో కలపాలని సూచించింది. ఉద్యోగులు నివసిస్తున్న ప్రాంతాల వారీగా మూలవేతనంపై 24, 16, 8 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలంటూ ఏడో వేతన సంఘం సూచించింది. ఒకవేళ డీఏ(కరవు భత్యం) 50 శాతం దాటితే హెచ్ఆర్ఏ 27 , 18, 9 శాతాలకు మార్చాలని, డీఏ 100 శాతం దాటిన పక్షంలో హెచ్ఆర్ఏ 30, 20, 10 శాతంగా ఇవ్వాలని సిఫార్సు చేసింది. తాజాగా అలవెన్సుల కమిటీ హెచ్ఆర్ఏ పెంపుతో పాటు మొత్తం 192 అలవెన్సుల్లో 52 రద్దు చేయాలని, 36 అలవెన్సుల్ని ప్రస్తుతమున్న వాటిలో లేదా కొత్త వాటిలో కలపాలంది.