సాహో.. ఆరోగ్య సేతు..!

Aarogya Setu Application Got 5th Place In Google Play Download - Sakshi

గూగుల్‌ ప్లే డౌన్‌లోడ్‌లో 5వ స్థానం

ప్రపంచ ఓవరాల్‌ డౌన్‌లోడ్‌లలో 7వ స్థానం

తొలి స్థానంలో జూమ్, తర్వాత టిక్‌టాక్, ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టా గ్రామ్‌

ఇప్పటికే తొమ్మిది కోట్లు దాటిన వినియోగదారులు

సెన్సర్‌ టవర్‌ సంస్థ నివేదికలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు సాయం చేసే ఆరోగ్య సేతుకు ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభిస్తోంది. ఏప్రిల్‌లో ప్రపంచ వ్యాప్తంగా మొబైల్‌ వినియోగదారులు అత్యధికంగా డౌన్‌లోడ్‌ చేసుకున్న యాప్‌గా ఆరోగ్య సేతుకు అరుదైన గుర్తింపు లభించింది. గూగుల్‌ ప్లే డౌన్‌లోడ్‌లో 5వ స్థానం లభించగా, ప్రపంచవ్యాప్తంగా ఓవరాల్‌ డౌన్‌లోడ్స్‌లో 7వ స్థానం లభించడం విశేషం. కేంద్రం ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సంస్థ ఆరోగ్య సేతు యాప్‌ను అభివృద్ధి చేసింది. జీపీఎస్, బ్లూటూత్‌లో రూపొందిం చిన ఈ కరోనాట్రాకింగ్‌ యాప్‌ని ఆండ్రాయిడ్, ఐఓ ఎస్‌ ఫోన్లకు అనుగుణంగా తీర్చిదిద్దారు. భారతీ యులను కరోనా నుంచి ఆరోగ్యం దిశగా పయ నింపజేసేందుకు ఉద్దేశించిన వారధి ఈ యాప్‌.. అందుకే, దీనికి ఆరోగ్య సేతు అని పేరు పెట్టారు.

ఏం చేస్తుంది?
దేశ, విదేశాల్లోని కరోనా కేసుల సమాచారం, మిమ్మల్ని మీరు కరోనా బారి నుంచి ఎలా కాపాడుకోవాలి? మీ నుంచి కరోనా పాజిటివ్‌ పేషెంట్లు 500 మీటర్ల నుంచి 10 కిలోమీటర్ల దూరం వరకు ఎంతమంది ఉన్నారో గుర్తించి మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది. కేవలం 3.7 ఎంబీ కలిగిన ఈ యాప్‌ను జూమ్, టిక్‌–టాక్, ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్ల తర్వాత ప్రపంచవ్యాప్తంగా అధికంగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారని అంతర్జాతీయంగా యాప్‌ల డౌన్‌ లోడ్స్, వాటి ర్యాంకింగ్‌లను విశ్లేషించే సెన్సర్‌ టవర్‌ సంస్థ తన నివేదికలో వెల్లడించింది.

అనుకూలాంశాలు..
ఈ యాప్‌ని ఏప్రిల్‌ 1వ తేదీన విడుదల చేయగా కేవలం 13 రోజుల్లోనే 50 మిలియన్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఏప్రిల్‌ 28 నాటికి ఈ సంఖ్య 75 మిలియన్లు దాటింది. మే 6 వరకు ఈ సంఖ్య 90 మిలియన్లను అధిగమించింది. అంటే 9 కోట్ల మంది ప్రజలు ఈ యాప్‌ సేవలు పొందుతున్నారు. 12 భాషల్లో అందుబాటులో ఉండటం వల్ల దేశంలోని మెజారిటీ ప్రజలకు ఈ యాప్‌ దగ్గరైంది. ప్రధాని మోదీ కూడా ఈ యాప్‌ని వినియోగించాలని ప్రజల్లో అవగాహన కల్పించారు. ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఏ యాప్‌ కూడా ఇంతవేగంగా ఇన్ని మిలియన్ల డౌన్‌లోడ్‌లను సాధించలేదు. అందులోనూ ఇది ఒక దేశీయ యాప్‌ కావడం గమనార్హం. దీని కంటే ముందున్న యాప్‌లన్నీ కేవలం వినోదం, సమాచార యాప్‌లు కాగా.. ఇదొక్కటే ఆరోగ్యానికి సంబంధించినది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top