భూమికి ఆధారం..! | Sakshi
Sakshi News home page

భూమికి ఆధారం..!

Published Fri, Mar 9 2018 11:33 AM

Aadhar linked to land - Sakshi

నారాయణపేట: ప్రతిష్టాత్మకంగా భూప్రక్షాళన చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా భూఖాతాలకు ఆధార్‌ నంబర్లు జోడిస్తోంది. తద్వారా తప్పుడు లెక్కలకు, అక్రమాలకు చెక్‌ పడుతుందని భావిస్తున్నారు. ఆధార్‌ నంబర్ల నమోదుతో ఒకే భూమిని ఇద్దరి పేర్లపై రిజిష్ట్రేషన్‌ చేయడం.. తద్వారా అమ్మకాలు, కొనుగోళ్ల సమయంలో గొడవలు జరగడం వంటివి జరగకపోవచ్చు. ఆన్‌లైన్‌లో ఆధార్‌ నంబర్‌ నమోదు చేస్తే చాలు.. రైతుకు సంబంధించిన పూర్తి వివరాలను చూడొచ్చు. ఈ ప్రక్రియ చివరి దశకు చేరుకోగా.. శుక్రవారంతో పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో రెవెన్యూ ఉద్యోగులు భూఖాతాలకు ఆధార్‌ నంబర్లతో పాటు సెల్‌నంబర్ల నమోదుతో బిజీబిజీగా ఉన్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రైతులకు ఈ–పాస్‌ పుస్తకాలను ప్రింట్‌ చేసి పంపిణీ చేయనున్నారు. 




గత ఏడాది సెప్టెంబర్‌ 
భూప్రక్షాళన కార్యక్రమాన్ని గత ఏడాది సెప్టెంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 31 వరకు చేపట్టారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగులు వ్యవసాయ, వ్యవసాయేతర, ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్డ్‌ భూములతో పాటు  దేవాదాయ, ఆటవీ శాఖలకు సంబంధించిన భూములను దస్త్రాల ఆధారంగా క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించారు. మొదటి దశలో వెల్లడైన లోటుపాట్లను సరిచేసి ప్రతీ గ్రామంలోని పంచాయితీ కార్యాలయాల్లో నోటీసు బోర్డులపై భూవివరాలను ప్రదర్శించారు. అలా సందేహాలు, అభ్యంతరాలు స్వీకరించి సరి చేయడంతో రెండో దశ ముగిసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల 11 నుంచి నుంచి కొత్త పాసుపుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌లో పట్టాదారుల ఖాతా నంబర్లకు సర్వే నంబర్ల ఆధారంగా ఆధార్, సెల్‌ నంబర్లు జత చేయాలని ఆదేశించడంతో ఉద్యోగులు రాత్రింబవళ్లు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. అయితే, శుక్రవారంతో ప్రభుత్వం విధించిన గడువు ముగియనుంది. కాగా, కొత్త పాస్‌ పుస్తకాల కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

76 శాతమే.. 
జిల్లాలోని 26 మండలాల్లో 3,70,857 మంది రైతుల పేరిట పట్టాదార్‌ పాసు పుస్తకాలు ఉన్నాయి. ఇందులో 2,87,874 మంది రైతులకు సంబంధించి ఇప్పటికే ఆధార్‌నంబర్లను ఆన్‌లైన్‌లో పొందుపర్చగా 76 శాతం పూర్తయినట్లయింది. ఈనెల 10న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా హైదరాబాద్‌లో ఈ–పాస్‌పుస్తకాల పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రోజు నుంచి అన్ని గ్రామాల్లో ఈ–పాస్‌ పుస్తకాలు పంపిణీ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. 

మొబైల్‌లింక్‌తో సమాచారం 
ఆన్‌లైన్‌లో భూవివరాలతో పాటు ఆధార్‌కార్డు నంబర్, మొబైల్‌ నంబర్లను నమోదు చేస్తున్నారు. దీంతో అక్రమార్కులకు కల్లెం వేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఎవరైనా రైతుల భూమిని సంబంధం లేని వారు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని భావిస్తే.. వెంటనే యాజమాని సెల్‌ నంబర్‌కు మెస్సేజ్‌ వెళ్తుంది. తద్వారా రైతు వెంటనే అప్రమత్తం కావొచ్చు. ఇకపై భూరిజిస్ట్రేషన్ల బాధ్యతలు కూడా తహసీల్దార్లకు అప్పగించనుండడంతో ఎలాంటి అవకతవకలు జరగవని చెబుతున్నారు.

రైతు ఫొటోతో ఈ–పాస్‌ పుస్తకాలు 
ఆధార్‌కార్డులో ఉన్న ఫొటోతోనే రైతులకు ఈ–పాస్‌ పుస్తకాలు అందనున్నాయి. ఆధార్‌ నంబర్‌ జతచేస్తుండడంతో దానికదే ఫొటో పుస్తకం ముద్రితమవుతుంది. పాసుపుస్తకంపై రైతుకు సంబంధించి భూమి ఖాతా, సర్వేనంబర్, విస్తీర్ణం తదితర వివరాలతో పాటు ఆధార్, సెల్‌ నంబర్లు ముద్రించనుండడంతో సమస్త సమాచారం అందులో ఉన్నట్లవుతుంది. 

పూర్తిచేస్తాం 
భూప్రక్షాళనలో భాగంగా వెల్లడైన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాం. ప్రతీ రైతు ఖాతాకు ఆధార్, సెల్‌ నంబర్లను జత చేసే ప్రక్రియ కొనసాగుతోంది. నారాయణపేట మండలం విషయానికొస్తే 80 శాతం పూర్తయింది. జిల్లాలో కూడా చివరి దశకు చేరుకుంది. నిర్దేశించిన లక్ష్యంలోగా మొత్తం పూర్తి చేస్తాం. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే రైతులకు అన్ని వివరాలతో కూడిన ఈ–పాస్‌ పుస్తకాలు అందనున్నాయి.        
               – పార్ధసారథి, తహసీల్దార్, నారాయణపేట  

Advertisement
Advertisement