పంట రుణంతీర్చలేక ఒకరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మహబూబ్‌నగర్: పంట రుణంతీర్చలేక ఒకరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు...మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు మండలం పోలేపల్లికి చెందిన ఒగ్గు ముత్తయ్య (55) మూడెకరాల పొలంలో పత్తి, వరి సాగు చేశాడు. అంతేకాకుండా మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేశాడు. పెట్టుబడులు, కుటుంబ అవసరాల కోసం రూ.3 లక్షల వరకు అప్పు చేశాడు. నీరు లేక పంటలు ఎండిపోవటంతో ముత్తయ్య కలత చెందాడు. అప్పులు తీర్చేదెలాగని మనస్తాపం చెంది శనివారం రాత్రి పొలంలోనే పురుగు మందు తాగాడు. ఆదివారం ఉదయం కుటుంబసభ్యులు ఆయన కోసం గాలించగా పొలంలో విగతజీవిగా కనిపించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇదిలాఉండగా ముత్తయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక పాలన సాగిస్తోందని మండిపడ్డారు. రైతు కుటుంబాలకు వెంటనే రూ.5 లక్షల సాయం అందించి, ఆదుకోవాలని కోరారు.
(ఆమనగల్లు)