ఇరాక్‌లో చిక్కుకున్న 700 తెలంగాణ కుటుంబాలు | 700 telangana familes struck in iraq | Sakshi
Sakshi News home page

ఇరాక్‌లో చిక్కుకున్న 700 తెలంగాణ కుటుంబాలు

Jun 19 2014 1:15 AM | Updated on Sep 2 2017 9:00 AM

ఇరాక్‌లో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆరు వందల నుంచి ఏడు వందల కుటుంబాల వరకు ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. అక్కడ జరుగుతున్న భీకరపోరు అంతర్యుద్ధంగా మారడంతో..

* మూడు జిల్లాల నుంచి హెల్ప్‌లైన్‌కు 20 కుటుంబాల ఫోన్లు
* ఇరాక్‌కు ఐఎఫ్‌ఎస్ అధికారి సురేశ్‌రెడ్డి

 
 సాక్షి, హైదరాబాద్: ఇరాక్‌లో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆరు వందల నుంచి ఏడు వందల కుటుంబాల వరకు ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. అక్కడ జరుగుతున్న భీకరపోరు అంతర్యుద్ధంగా మారడంతో.. పని కోసం వెళ్లిన తెలంగాణ ప్రాంతం వారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నట్లు సమాచారం. ఇందులో రాష్ట్రం నుంచి నేరుగా ఇరాక్ వెళ్లకుండా కువైట్ వెళ్లి అటు నుంచి ఇరాక్‌లో పనిచేయడానికి వెళ్లినవారే అధికంగా ఉన్నట్లు ప్రభుత్వానికి అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇరాక్ వెళ్లడానికి భారతదేశం అనుమతించడం లేదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఇరాక్‌లో చిక్కుకున్న వారి వివరాలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో, సెల్ నంబర్లను కూడా ఇచ్చిన విషయం విదితమే. ఈ నంబర్లకు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి 20 ఫోన్‌కాల్స్ వచ్చాయని, వారిచ్చిన వివరాల ప్రకారం 20 కుటుంబాలు అక్కడ చిక్కుకున్నాయని సమాచారం ఇచ్చారు.
 
 అయితే.. మరోవైపు రాష్ట్రం నుంచి ఉపాధి కోసం సిరియా, సౌదీ అరేబియా, ఇరాన్, కువైట్ వెళ్లి అటు నుంచి అనధికారికంగా ఇరాక్‌లోకి పనికి వెళ్తున్నారని తెలిసింది. అక్కడకు నిరుద్యోగులను పంపించే ఏజెన్సీలను సంప్రదిస్తే దాదాపు 700 కుటుంబాలు ఇరాక్‌లో ఉన్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. అయితే వీరంతా.. అనధికారికంగా అక్కడకు వెళ్లిన వారే కావడం గమనార్హం. అలా వెళ్లిన వారి సమాచారం సేకరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ అంశాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకుని వెళ్లింది. విదేశాంగ శాఖ కార్యదర్శి అనిల్ వాద్వాతోనూ, ‘గల్ఫ్’ వ్యవహారాలను పర్యవేక్షించే మృదుల్ కుమాన్‌కు కూడా ఈ సమాచారాన్ని అందించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇరాక్‌లో చిక్కుకున్న కుటుంబాలను సురక్షితంగా బయటకు తీసుకుని రావాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం తరఫున విజ్ఞప్తి చేశారు. కాగా, అనధికారికంగా అక్కడ ఉంటున్న వారి చిరునామా, ఫోన్ నంబర్లు తదితర సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, 1991 ఇండియన్ ఫారెన్ సర్వీసుకు చెందిన సురేశ్‌రెడ్డిని ఇరాక్ పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
 
 ఆయన ప్రస్తుతం సెపరేట్ ఇండియన్ మిషన్ టు ఏఎస్‌ఈఏఎన్ అండ్ ఈస్ట్ ఏిసియా సమ్మిట్ అధికారిగా పనిచేస్తున్నారు. కె. సురేశ్‌రెడ్డి గతంలో ఇరాక్‌లో భారత రాయబారిగా పని చేశారు. మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం 2011లో ప్రత్యేకంగా ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. అప్పటికి ఏడేళ్లపాటు అసలు ఇరాక్‌లో భారత రాయబారే లేకపోవటం విశేషం. 1993లో ఆయన తొలి పోస్టింగ్ కైరోలో కేటాయించారు. ఆ తర్వాత మస్కట్, అబుదాబి, ఇస్లామాబాద్‌లలో పనిచేశారు. అరబిక్ భాషలో కూడా ఆయనకు పట్టుండటంతోపాటు, ఇరాక్ భూగోళిక పరిస్థితిపై సురేశ్‌రెడ్డికి మంచి పట్టుంది. ప్రసుతం ఇరాక్ అంతర్యుద్ధం తారస్థాయికి చేరుకుని అక్కడి భారతీయులకు ప్రమాదం పొంచి ఉండటంతో సురేశ్‌రెడ్డి సేవలు తీసుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement