రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వివిధ విభాగాలలో పనిచేస్తున్న పోలీసులకు ప్రభుత్వం ఉత్తమ సేవా పతకాలను ప్రకటించింది.
ఇద్దరు అధికారులకు ముఖ్యమంత్రి సర్వోన్నత సేవా పతకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వివిధ విభాగాలలో పనిచేస్తున్న పోలీసులకు ప్రభుత్వం ఉత్తమ సేవా పతకాలను ప్రకటించింది. విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలకు గాను దాదాపు 245 మందికి అవార్డులు ప్రకటిస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీసు పతకం, శౌర్య పతకం, మహోన్నత సేవా పతకం, ఉత్తమ సేవా పతకం, కఠిన సేవా పతకం, సేవా పతకం విభాగాల కింద ఈ అవార్డులు ప్రకటించింది.
శౌర్య పతకానికి ఎంపికైనవారికి రూ.10వేల ప్రోత్సాహకంతో పాటు ప్రతీ నెలా రూ.150 అందజేయనున్నారు. మహోన్నత సేవా పతకం కింద రూ.6 వేల ప్రోత్సాహకంతో పాటు ప్రతీ నెలా రూ.125 అందజేయనున్నారు. ఉత్తమ సేవా పతకం కింద రూ.5వేల ప్రోత్సాహకంతో పాటు ప్రతీ నెలా రూ.100 అందజేయనున్నారు. సేవా పతకం కింద రూ.4 వేలు, ప్రతీ నెలా రూ.75 అందజేయనున్నారు. ముఖ్యమంత్రి సర్వోన్నత సేవా పురస్కారానికి ఇద్దరు పోలీసు అధికారులను ఎంపిక చేశారు. వీరికి రూ.5 లక్షల చొప్పున నగదు పురస్కారాన్ని అందజేస్తారు. ఇంటెలిజెన్స్‌లో పనిచేస్తున్న డీఎస్పీ ఎం.రామకృష్ణ, టాస్క్‌ఫోర్స్ హెడ్‌కానిస్టేబుల్ పి.వెంకటస్వామిలకు ఈ పురస్కారం లభించింది. అదే విధంగా శౌర్యపతకం కింద గ్రేహౌండ్స్, ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాలకు చెందిన 26 మందికి పురస్కారాలు ప్రకటించారు. మహోన్నత సేవా పతకం కింద ఇద్దరిని ఎంపిక చేశారు. ఉత్తమ సేవా పతకం కింద 36 మంది, కఠిన సేవా పతకం కింద 21 మంది, సేవా పతకం కింద 158 మందిని ఎంపిక చేశారు.