21వరంగల్‌ స్మార్ట్‌ సిటీ ర్యాంకు

21 Warangal Smart City Rank - Sakshi

58.5 పాయింట్లు సాధించిన ఓరుగల్లు

259.96 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచిన నాగ్‌పూర్‌

ప్రాజెక్టుల నత్తనడకతో నగరం వెనుకంజ

ర్యాంకింగ్‌లో వెనుకబడిందంటున్న పలువురు

సంతృప్తి వ్యక్తం చేస్తున్న జీడబ్ల్యూఎంసీ పాలక, అధికార వర్గాలు

వరంగల్‌ అర్బన్‌:  ఆకర్షణీయ నగరాల(స్మార్‌సిటీ) ర్యాంకింగ్‌లో వరంగల్‌ నగరం 21వ స్థానంలో నిలిచింది. 56.95 పాయింట్లతో ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 98 స్మార్ట్‌సిటీలలో ప్రాజెక్టుల పురోగతిపై పాయింట్ల ఆధారంగా కేంద్ర అర్బన్‌ అండ్‌ హౌసింగ్, అఫైర్స్‌ మంత్రిత్వ శాఖ ఈ ర్యాంకులను వెల్లడించింది. దేశవ్యాప్తంగా 259.96 పాయింట్లతో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ నగరం ప్రథమస్థానంలో నిలి చింది.

ఇక పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం 88.28 పాయింట్లతో 13వ స్థానంలో.. కాకినాడ 58.7 పాయింట్లతో 20 స్థానాన్ని దక్కించుకున్నాయి. ఆధునికత, ఆకర్షణల కలబోతగా ప్రపంచస్థాయి సౌకర్యాలతో పట్టణాలు, నగరాల సర్వతోముఖాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు నడుం బిగించిన విషయం తెలిసిందే.

ఇందుకోసం 2015 జూన్‌ రెండో వారంలో స్మార్ట్‌సిటీ, అమృత్, హృదయ్‌ పథకాలను ప్రవేశపెట్టి్టంది. ఈమేరకు దేశంలోని 98 స్మార్ట్‌సిటీలను ఎంపిక చేసింది. అయితే మొదటి దశ కోసం పోటీలు నిర్వహించగా.. వరంగల్‌ నగరానికి త్రుటిలో అవకాశం జారిపోయింది. సప్లిమెంటరీలో 2016 జూన్‌ నెలాఖరులో స్మార్ట్‌సిటీ పథకానికి వరంగల్‌ ఎంపికైంది. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుల కోసం ప్రణాళికలు, అంచనాలు, నిధుల విడుదల, నిర్వహణ, నిర్ణయాల కోసం స్పెషల్‌ పర్సస్‌ వెహికిల్‌(ఎస్‌పీవీ) ఏర్పాటైంది.

స్మార్ట్‌సిటీ పనుల నిర్వహణకు గ్రేటర్‌ వరంగల్‌ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (జీడబ్ల్యూఎస్‌సీసీఎల్‌) ద్వారా ముందుకు సాగుతోంది. ఇప్పటికే రూ.39 కోట్లతో నాలుగు స్మార్ట్‌రోడ్ల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కాకతీయ మ్యూజికల్‌ గార్డెన్, పబ్లిక్‌ గార్డెన్, ఏకశిల పార్కుల పునరుద్ధరణకు రూ.53 కోట్లు, హన్మకొండ జూ పార్కు, కేఎంజీ పార్కులో మురుగునీరు నీటి శుద్ధీకరణ ప్లాంట్లకు రూ.36.8 కోట్లతో సీవరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు.

భద్రకాళి బండ్‌పై రూప్‌వే నిర్మాణానికి రూ.35 కోట్లు,  భద్రకాళి బండ్‌ అభివృద్ధికి రూ.10.5కోట్లు వెచ్చిస్తున్నారు. రూ.16.8కోట్లతో హన్మకొండ అశోక థియేటర్‌ ఎదుట మల్టీలెవల్‌ కాంప్లెక్స్, కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మించనున్నారు. గ్రేటర్‌ పరిధిలో కాకతీయ కెనాల్‌ వెంట లేదా ప్రభుత్వ భవనాలపై  సోలార్‌ పవర్‌ జనరేషన్‌ తదతర ప్రాజెక్టులకు రూపకల్పన చేపట్టారు.

దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని స్మార్ట్‌సిటీలలో ప్రాజెక్టులు.. వాటి పురోగతి ఆధారంగా పాయింట్లు కేటాయించి ర్యాంకింగ్‌ను ప్రకటించారు. సప్లిమెంటరీలో స్థానం దక్కించుకున్న వరంగల్‌ వెనుకబడి పోయిందని కొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేయగా, గ్రేటర్‌ పాలక, అధికార వర్గాలు మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top