కొత్త ఏడాదికి ప్రశాంతంగా స్వాగతం 

2074 Drunken Drive cases are registered in this Dec 31st - Sakshi

ఫలించిన ‘ముగ్గురు పోలీసుల’ వ్యూహం

నమోదుకాని అవాంఛనీయ ఘటనలు

‘జీరో యాక్సిడెంట్‌ నైట్‌’గా డిసెంబర్‌ 31 2,074 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు  

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ... ఈ ‘ముగ్గురు పోలీసులు’ఏర్పాటు చేసిన బందోబస్తు, విధించిన ఆంక్షలు ఫలితాలనిచ్చాయి. కొత్త సంవత్సర స్వాగత వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జరిగాయి. మొత్తమ్మీద ఒక్క ప్రమాదం కూడా నమోదు కాకుండా జీరో యాక్సిడెంట్‌ నైట్‌గా చేయడంలో అధికారులు సఫలీకృతులయ్యారు. స్థానిక పోలీసులతోపాటు అదనపు బలగాలూ సోమవారం రాత్రంతా విధుల్లోనే ఉన్నాయి. నగరంలోని కీలక ప్రాంతాలతోపాటు ఇన్నర్‌/ఔటర్‌ రింగ్‌ రోడ్‌లోనూ నిరంతరం ప్రత్యేక పెట్రోలింగ్‌ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడపడం, దురుసుగా డ్రైవింగ్‌ చేయడం, మితిమీరిన వేగం తదితర ఉల్లంఘనలపై ట్రాఫిక్‌ విభాగం అధికారులు ప్రత్యేక డ్రైవ్స్‌ నిర్వహించారు. మొత్తమ్మీద మూడు కమిషనరేట్లలోనూ కలిపి 2,074 కేసులు నమోదయ్యాయి. గతంలో జరిగిన ప్రమాదాలు, ఘటనల్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసులు ముందు జాగ్రత్తగా దాదాపు అన్ని ఫ్లైఓవర్లను మూసేశారు.

ప్రత్యామ్నాయ మార్గంలేని కారణంగా బేగంపేట, డబీర్‌పుర వంటి కొన్ని ఫ్లైఓవర్‌లకు మాత్రం మినహాయింపునిచ్చారు. నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్‌ మార్గ్‌లతోపాటు హుస్సేన్‌సాగర్‌ చుట్టుపక్కల వాహనాలు అనుమతించలేదు. పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేలోనూ కొన్ని ఆంక్షలు కొనసాగాయి. కమిషనరేట్లలోని ప్రధాన రహదారుల్లో బారికేడ్లు ఏర్పాటుచేసిన అధికారులు వాహనచోదకుల వేగాన్ని నియంత్రించారు. పోలీసులు, ట్రాఫిక్‌ విభాగం అధికారులు తీసుకున్న చర్యల ఫలితంగా డిసెంబర్‌ 31 ప్రశాంతంగా పూర్తయింది. ఐటీ కారిడార్‌లోనూ ట్రాఫిక్‌ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్‌ పోలీసుస్టేషన్ల పరిధిలో తనిఖీలు చేయగా 263 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయి. మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 89 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలు, 53 కార్లను సీజ్‌ చేశారు. గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 20 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలు, 33 కార్లు సీజ్‌ చేశారు. మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 38 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలు, 20 కార్లు, ఒక డీసీఎంను సీజ్‌ చేశారు. వాహనాలు నడిపిన వారందరిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నారు.  

తాగేశారు... తోలేశారు! 
పోలీసు విభాగం ఎన్ని సూచనలు చేసినా, ఎంతగా హెచ్చరించినా మందుబాబులు మాత్రం మారలేదు. డిసెంబర్‌ 31 నేపథ్యంలో సోమవారం రాత్రి మద్యం తాగి అనేక మంది వాహనాలు నడిపేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది కమిషనరేట్లు, ఓ జిల్లాలో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 2,259 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనే 1,219 మంది చిక్కారు. సిటీ ట్రాఫిక్‌ పోలీసులు మొత్తం 22,543 వాహనాలను తనిఖీ చేశారు. వీరిలో ద్విచక్ర వాహనచోదకులే ఎక్కువ మంది ఉన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు ‘న్యూ ఇయర్‌ డే’ను జీరో యాక్సిడెంట్‌ నైట్‌గా చేయడానికి పటిష్ట ఏర్పాట్లు చేశారు. మొత్తం 2,259 మంది మందుబాబుల నుంచి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరికి కుటుంబ సభ్యులు లేదా సంరక్షకుడి సమక్షంలో మంగళ–బుధవారాల్లో ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఆపై వీరిని న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top