ఎంతసేపు పిలిచినా రాదే..!

108 And 104 Not Responding While Trying Phone Call Hyderabad - Sakshi

‘కరోనా’ లక్షణాలున్నయువతిని తరలించేందుకు 108, 104 కు ఫోన్‌

సుమారు 45 నిమిషాలు పాటు ట్రై చేసినా ఫలితం శూన్యం

విసుగెత్తి పోలీసు వాహనంలో తరలించిన వైనం

హిమాయత్‌నగర్‌: ఓ పక్క ‘కరోనా’ లక్షణాలు ఉన్న యువతి అందరి మధ్యలో తిరుగుతుందనే అనుమానాలు. మరో పక్క ఆ యువతిని హాస్పిటల్‌కు తరలించేందుకు ఎంతసేపు ప్రయత్నించినా రాని 108, 104లు. ఇదీ.. బుధవారం హైదర్‌గూడలోని ఓల్డ్‌ సీడీఆర్‌ పక్కన ఉన్న ఆర్కేఎస్‌ అపార్ట్‌మెంట్‌లో జరిగిన తంతు. తురకిస్థాన్‌ యువతిని ఫీవర్‌ హాస్పిటల్‌కు ప్రైవేటు హాస్పిటల్‌ వారు రెఫర్‌ చేయడంతో..మెడికల్‌ స్టాఫ్‌ మంగమ్మ 108కి సమాచారం ఇచ్చారు. తొలుత పది నిమిషాల పాటు ఎంగేజ్‌ రాగా లైన్‌ కలవగానే విషయం చెప్పారు. మాకు కాదు 104 వాళ్లకు సమాచారం ఇవ్వడంటూ 108 వాళ్లు చెప్పారు. సరేనంటూ 104కు సమాచారం ఇవ్వగా..వారు కూడా వివరాలన్నీ సేకరించి 108కి చెప్పమన్నారు. ఇలా ఇద్దరికీ చెప్పి సుమారు 45 నిమిషాల పాటు వేచి చూసినా ఫలితం శూన్యమైంది. పైగా 108, 104 వాళ్లు విరివిగా కాల్‌ చేసిన మంగమ్మను హోల్డ్‌లో పెట్టారు. ఇదిలా ఉండగా..అపార్ట్‌మెంట్‌ వాళ్లంతా ఆందోళన చేస్తుండడటంతో విసిగెత్తి నారాయణగూడ ఎస్సై నవీన్‌కుమార్‌ పోలీసు వాహనంలో యువతిని కోరంటి ఫీవర్‌ హాస్పిటల్‌కు తరలించారు. 

అతవ్యవసర పరిస్థితుల్లో స్పందించకుంటే ఎలా?
108 అంటేనే అత్యవసర వాహనం. అటువంటి వాహనం అత్యవసర సమయంలో స్పందించకుంటే ఎలా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మా ఎదుటే స్వయాన మెడికల్‌ స్టాఫ్‌ కాల్‌ చేసినా 108, 104 రాకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమావేశాల్లో 108, 104లు అందుబాటులో ఉంటాయని చెప్పినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అవి సమయానికి రాకపోవడం పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఒకవేళ అదే తురకిస్థాన్‌ యువతికి కరోనా ఉండి ఉంటే..అంబులెన్స్‌ రాకపోతే పరిస్థితి ఏంటంటూ అధికారులను స్థానికులు నిలదీస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top