breaking news
-
కేటీఆర్, సిద్ధరామయ్యల ట్వీట్ వార్
సాక్షి,హైదరాబాద్: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మధ్య మంగళవారం ఎక్స్(ట్విటర్)లో మాటల యుద్ధం జరిగింది. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీల అమలుపై ఇద్దరి మధ్య ట్వీట్ వార్ నడిచింది. ‘ఎన్నికల్లో ఓట్ల కోసం ఏదో గ్యారెంటీలని చెప్పాం. అంత మాత్రానా అన్నీ ఫ్రీగా ఇస్తామా. అయినా మాకూ ఇవ్వాలనే ఉంది. అయితే డబ్బులు లేవు’ అని కర్ణాటక అసెంబ్లీలో సిద్ధారమయ్య మాట్లాడినట్లుగా ఒక హ్యాండిల్లో పోస్ట్ అయిన వీడియోపై కేటీఆర్ స్పందించారు. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి రానుందని, కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని కేటీఆర్ కామెంట్ చేశారు. అయినా ఎన్నికల హామీలిచ్చేటపుడు ఆర్థిక పరిస్థితిపై కనీస అవగాహన ఉండాలిగా అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ట్వీట్‌కు సిద్ధరామయ్య అంతే ఘాటుగా స్పందించారు. ‘కేటీఆర్ మీరు తెలంగాణ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో తెలుసా..కనీసం మీకు నిజమేంటో..నకిలీ, ఎడిటెడ్ ట్వీట్ ఏంటో తెలియదు అందుకే ఓడిపోయారు.ఇలాంటి ఫేక్, ఎడిటెడ్ వీడియోలను బీజేపీ సృష్టిస్తుంది. బీఆర్ఎస్ సర్క్యులేట్ చేస్తుంది’అని కేటీఆర్‌కు సిద్ధరామయ్య చురకంటించారు. No money to deliver poll promises/guarantees says Karnataka CM ! Is this the future template for Telangana too after successfully hoodwinking the people in elections ? Aren’t you supposed to do basic research and planning before making outlandish statements? https://t.co/JOcc4NLsiq — KTR (@KTRBRS) December 19, 2023 Mr. @KTRBRS, Do you know why your party lost in the Telangana Elections? Because you don't even know how to verify what is fake and edited, and what is truth. @BJP4India creates fake edited videos, and your party circulates them. Yours is a perfect B Team of BJP. If you are… https://t.co/Ey5y9K3fLd — Siddaramaiah (@siddaramaiah) December 19, 2023 ఇదీచదవండి..బస్ భవన్ ముట్టడికి ఆటో కార్మికుల యత్నం -
ఢిల్లీ బయల్దేరిన సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు(మంగళవారం) ఢిల్లీకి బయల్దేరారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి ఢిల్లీ వెళ్లుతున్నారు సీఎం రేవంత్. నేడు సీఎం రేవంత్.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను మర్యాద పూర్వకంగా కలవనున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీని పోటీ చేయాలని స్వయంగా సీఎం రేవంత్ కోరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిన్న (సోమవారం) రాజకీయ వ్యవహార కమిటీ (పీఏసీ) చేసిన తీర్మానం కాపీని మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీలకు సీఎం రేవంత్ అందిస్తారు. అనంతరం ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ కానున్నారు. పార్టీ వ్యవహారాలపై కేసీ వేణుగోపాల్‌తో చర్చించనున్నారు. మంగళవారం రాత్రికి సీఎం రేవంత్ హైదరాబాద్‌కు తిరిగి పయనం కానున్నారు. చదవండి: హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. ఈ రూట్లో ఇవాళ ఉదయం ట్రాఫిక్ ఆంక్షలు -
ఎక్కడా తగ్గొద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, విద్యుత్, నీటిపారుదల తదితర రంగాలపై అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుందనే వార్తల నేపథ్యంలో భారత్ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పార్టీ కీలక నేతలకు దిశా నిర్దేశం చేశారు. తుంటి ఎముక శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న కేసీఆర్‌తో బంజారాహిల్స్ నందినగర్ నివాసంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పార్టీ ముఖ్య నేతలు కొందరు సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ఉభయ సభల్లో బీఆర్ఎస్ వ్యవహరించిన తీరు, నేతల ప్రసంగాలు, ప్రభుత్వ స్పందన తదితరాలు సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. ఈ నెల 20 నుంచి రెండు రోజులపాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు అవకాశమున్న అంశాలపై లోతుగా చర్చ జరిగినట్లు సమాచారం. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రజెంటేషన్లు, చేపట్టే చర్చలపై ఎక్కడా వెనక్కి తగ్గొద్దంటూ కేసీఆర్ స్పష్టం చేశారు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలి ‘అర్ధసత్యాలు, అసత్యాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు, రాబోయే రోజుల్లో ఎదురయ్యే వైఫల్యాలకు బీఆర్ఎస్ను బాధ్యులను చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సీఎం ఇచ్చిన సమాధానం అదే తరహాలో ఉంది. కాబట్టి సభ వేదికగానే అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు అన్ని రంగాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో వెళ్లండి. ఎన్ని గంటలైనా చర్చకు సిద్ధంగా ఉంటూ సమన్వయంతో ముందుకు వెళ్లండి. రంగాల వారీగా మనం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేందుకు ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి..’అని కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. అసెంబ్లీ భేటీ తర్వాత లోక్‌సభపై దృష్టి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే లోక్‌సభ ఎన్నికలపై దృష్టి పెట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కేసీఆర్ సూచించారు. ఇప్పటికే లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు సాధించిన ఓట్లు, ఇతర పార్టీల పరిస్థితిపై నివేదికలు రూపొందించిన నేపథ్యంలో.. నియోజకవర్గాల వారీగా సమీక్ష, సన్నాహక సమావేశాలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ను రూపొందించాలని ఆదేశించారు. గెలుపోటములతో సంబంధం లేకుండా తాజా, మాజీ ఎమ్మెల్యేలు అందరూ క్షేత్ర స్థాయిలో కేడర్‌తో సమావేశమయ్యేలా కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. త్వరలోనే తెలంగాణ భవన్లో పార్టీ కార్యవర్గం, ప్రజా ప్రతినిధులతో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది. బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీసుకు హరీశ్ అధినేత ఆదేశాల నేపథ్యంలో హరీశ్‌రావు సోమవారం అ సెంబ్లీ ఆవరణలోని బీఆర్ఎస్ శాసనసభాపక్షం కార్యాలయానికి వచ్చి పలు రంగాలకు సంబంధించిన నివేదికలను సేకరించారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో జరిగిన కార్యకలాపాలు, బడ్జెట్ లెక్కలకు సంబంధించిన వివరాలను తీసుకున్నారు. ఆర్థిక, వైద్యా రోగ్య, నీటిపారుదల, మార్కెటింగ్ వంటి కీలక శాఖల మంత్రిగా పనిచేసిన హరీశ్ బుధవారం అసెంబ్లీలో ప్రభుత్వం లేవనెత్తే అంశాలపై బీఆర్ఎస్ పక్షాన చర్చలో పాల్గొనే అవకాశం ఉంది. -
28న మరో రెండు గ్యారంటీల అమలు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు అమలవుతున్నాయని, ఈనెల 28న మరో రెండు, వచ్చే సంక్రాంతిలోగా మిగిలిన రెండు గ్యారంటీలు అమలు చేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఖమ్మం కలెక్టరేట్లో సోమవారం పాలేరు నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలపై కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు వారియర్ సహా అధికారులతో మంత్రి సమీ క్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమది ప్రజా ప్రభు త్వమని తెలిపారు. రైతులకు ఇబ్బంది కలగకుండా, నష్టం లేకుండా ధరణిని ప్రక్షాళన చేయడంతోపాటు గత ప్రభుత్వం సామాన్యుల నుంచి లాక్కున్న ఆస్తులు తిరిగి ఇస్తామని చెప్పారు. వీఆర్ఓల సమస్యలను కూడా పరిష్కరిస్తామన్నారు. త్వరలో రెవెన్యూలో విప్లవాత్మక మార్పులు తీసు కొస్తామని.. ఇందులో అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఉండవని పొంగులేటి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులు దోచుకున్న, ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టిన విషయంపై సమీక్షిస్తామని, ఖమ్మం, వరంగల్, హైదరాబాదే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ ప్రభుత్వ భూముల ఆక్రమణ జరిగినా వదలబోమని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా కొల్లగొట్టిందని, ఈనెల 20న అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రాన్ని ప్రజల ముందు పెడతామని వెల్లడించారు. విడతల వారీగా ఇళ్లు.. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టానని, రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో ఎవరికీ ఇల్లు లేదని అనకుండా విడతల వారీగా నిర్మాణం చేస్తామని పొంగులేటి తెలిపారు. నీటి పా రుదల శాఖలో జరిగిన అవినీతి, కాళేశ్వరం ప్రాజె క్టుపై సిట్టింగ్ జడ్జితో ప్రభుత్వం విచారణ చేయించేందుకు పూనుకుందన్నారు. డ్రగ్స్, గంజాయిపై రాష్ట్రంలో ఉక్కుపాదం మోపేలా ఇప్పటికే సీఎం కఠిన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. -
అర్హత లేకున్నా మిడ్ మానేరు పరిహారం
సాక్షి, హైదరాబాద్: మిడ్ మానేరు ప్రాజెక్టు ముంపు పరిహారం చెల్లింపు విషయంలో అర్హత లేకపోయినా రాజ్యసభ సభ్యుడు జె. సంతోష్ రావు, ఆయన కుటుంబ సభ్యులతోపాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువులకు సైతం ప్యాకేజీ కింద పరిహారం చెల్లించారని కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఆ మేరకు ఆయన సోమవారం లేఖ రాశారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న మిడ్‌మానేరు బాధితుల సమస్యలను పరిష్కరించాలని, రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అసలు మిడ్ మానేరు సమస్య ఏమిటంటే.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు రేవంత్‌కు అభినందనలు తెలియజేసిన సంజయ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎన్నో ఏళ్ల తరబడి అపరి ష్కృతంగా ఉన్న మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యలను, ప్రభుత్వం ఇచ్చిన హామీ లను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 17 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభు త్వం ప్రారంభించిన ప్రాజెక్టు మిడ్ మానేరు. లక్ష లాది ఎకరాలకు సాగు నీటితోపాటు తాగునీటి అవ సరాలను తీరుస్తుందనే భావనతో ప్రాజెక్టు ముంపు పరిధిలోని 12 గ్రామాల ప్రజలు ఇళ్లు, భూములు త్యాగం చేశారు. ‘ప్రభుత్వ లెక్కల ప్రకారం 12,500 మంది బాధితులున్నారు. వీరికి సహాయ పునరావాస ప్యాకేజీ కింద 2005–06లో నాటి ప్రభుత్వం జీవో నెం.69 ప్రకారం ఐఏవై కింద ఇళ్లు మంజూరు చేసింది. ముంపు పరిహారం చెల్లిస్తామని పేర్కొంది. వీటి అమలులో తీవ్రమైన జాప్యం జరిగింది. 2018 జూన్ 15న నాటి సీఎం కేసీఆర్ ఈ ప్రాంతానికి వచ్చి మిడ్ మానేరు బాధితులకు ఐఏవై ఇళ్లకు బదులుగా డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తామని, అందులో భాగంగా ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల 4 వేలు చెల్లిస్తానని హమీ ఇచ్చారు. పన్నెండు గ్రామాల రైతులంతా సాగు భూమిని కోల్పోయిన నేపథ్యంలో నీలోజిపల్లి నుండి నందిగామ, అగ్రహారం వరకు ఇండస్ట్రియల్ కారిడార్‌ను, స్కిల్ డెవలెప్మెంట్ కాలేజీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తద్వారా వారిలో నైపుణ్యత పెంచి స్వయం ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. అలాగే 2009 కొత్త గెజిట్ ప్రకారం తేది 01–01–2015 నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ముంపు పరిహారం, పట్టా ఇస్తామన్నారు. కానీ నేటికి ఒక్క అడుగు ముందుకు పడలేదు’ అని సంజయ్ ఆ లేఖలో వివరించారు. వెంటనే సంబంధిత మంత్రి, స్థానిక శాసనసభ్యుడు, ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్ హామీ ఇచ్చారని గుర్తు చేసిన సంజయ్ ‘రెండేళ్ల క్రితం మిడ్ మానేరు ముంపు బాధితుల కోసం కొదురుపాకలో నిర్వహించిన అఖిలపక్ష ‘మహాధర్నా’లో మీరు, నేను హాజరై ముంపు బాధితులకు సంఘీభావం తెలిపాం. నాటి ధర్నాలో మిడ్‌మానేరు బాధితుల సమస్యలను పరిష్కరించేదాకా వారి పక్షాన పోరాటం చేస్తామని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామని మీరు హామీ ఇచ్చారు’ అని సంజయ్ గుర్తుచేశారు. -
పదేళ్లు ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘గత పదేళ్లు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం..’ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంత్రి అయ్యాక మొదటి సారి ఆయన సోమవారం నల్లగొండ జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. అంతకుముందు ఆయన ఆంథోల్ మైసమ్మగుడి వద్ద, నల్లగొండలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. మూడేళ్లలోనే ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేస్తామని, ఆరు నెలల్లో బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నా రు. నల్లగొండ జిల్లాను సుభిక్షంగా మారుస్తామని పేర్కొన్నారు. అక్రమ ఇసుక దందా, బెల్టు షాపుల ఆట కట్టిస్తామన్నారు. గత పాలకుల్లాగా అధికారు లను తాము ఇబ్బంది పెట్టబోమని, అంతా కలిసి పనిచేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. కలెక్టరేట్లో కలెక్టర్ కర్ణన్ అధ్యక్షతన మిషన్ భగీరథ, నీటిపారుదల, రోడ్డు భవనాలు, ఇతర శాఖల ఈఎన్సీలతో సమీక్షించారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిషన్ భగీరథ చేపట్టినా ఇంకా చాలా గ్రామాలకు నీరందడం లేదని, సంబంధిత ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించి ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు విద్యుత్ సర ఫరాలో అంతరాయం లేకుండా అవసరమైన సబ్ స్టేషన్లు, ఇతర విస్తరణ పనులు చేయించాలని, దీనిపై నివేదికలు ఇస్తే ప్రభుత్వంతో నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో విద్యు త్ ప్రమాదాల్లో 32 మంది చనిపోయినా వారికి గత ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకపోవడం బాధాకర మని చెప్పారు. వెంటనే వారికి న్యాయం చేయాల న్నారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యేలు అనిల్‌రెడ్డి, బాలు నాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, జైవీర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కమలం ‘లోక్‌సభ’ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో అత్యధిక స్ధానాల్లో గెలుపు లక్ష్యంగా కార్యాచరణను వేగవంతం చేసింది. 17 నియోజకవర్గాలకు విస్తారక్ (ఫుల్ టైమర్ (పూర్తి సమయం వెచ్చించే నేత)లను నియమించేందుకు చర్యలు చేపడుతోంది. పార్టీకి పట్టు ఉన్న, గెలిచే అవకాశాలున్న సీట్లపై మరింతగా దృష్టి కేంద్రీకరించనుంది. ఇలాంటి సీట్లలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఒకటీ రెండు లేదా మూడు నాలుగింటికి ఒకరు చొప్పున మరికొంత మంది విస్తారక్‌లను నియమించాలని నిర్ణయించింది. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయా అంశాలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ సమీక్ష నిర్వహించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో పనిచేసిన వివిధ స్ధాయి నాయకులు, కమిటీల పనితీరును ఈ సందర్భంగా పరిశీలించినట్టు సమాచారం. అలాగే గతంలో 17 లోక్‌సభ స్థానాలకు నియమితులైన ఫుల్ టైమర్స్లో ఎవరెవరు చురుకుగా పని చేస్తున్నారో ఆరా తీసినట్లు తెలిసింది. కాగా గత కొంతకాలంగా వారు నిర్వహించిన బాధ్యతలు, పూర్తిచేసిన కర్తవ్యాలను పరిగణనలోకి తీసుకుని వారి పునర్ నియామకంపై నిర్ణయం తీసుకో నున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఇన్చార్జులు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఇన్చార్జులను నియమించే చర్యలు కూడా చేపడుతున్నారు. అసెంబ్లీ స్థానా ల్లో బాగా పనిచేశారని పేరు తెచ్చుకున్న వారిని లోక్‌సభ ఎన్నికలకు ఫుల్టైమర్లుగా, పార్లమెంట్ ఇన్చార్జులుగా నియమించే అవకాశాలున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయా నేతల పనితీరు పై నివేదికలు సమర్పించాలని రాష్ట్ర నాయకత్వాన్ని బన్సల్ ఆదేశించినట్టు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో..కేంద్రం చేపట్టిన వివిధ పథకాలు, అభి వృద్ధి కార్యక్రమాల ప్రచారానికి ఉద్దేశించిన వికసిత్ భారత్, విశ్వకర్మ యోజనలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై, పోలింగ్ బూత్ కమిటీలపై ప్రత్యే క దృష్టిపెట్టాలని సూచించినట్టు పార్టీ వర్గాలు తెలి పాయి. ఈ నెలాఖరులోగా పార్టీ జాతీయ అధ్యక్షు డు జేపీ నడ్డా రాష్ట్ర పార్టీకి దిశానిర్దేశం చేస్తారని, ఆ తర్వాత పార్టీ యంత్రాంగం పూర్తిస్థాయిలో ఎన్నికల సన్నా హాల్లో నిమగ్నం అవుతుందని సమాచారం. -
తెలంగాణ నుంచి సోనియా పోటీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సోనియాగాందీని తెలంగాణలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ తీర్మానంతో కూడిన లేఖలను వ్యక్తిగతంగా సోనియగాంధీకి, అలాగే పార్టీ అధిష్టానానికి పంపింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే అధ్యక్షతన దాదాపు రెండు గంటలకు పైగా పీఏసీ సమావేశం జరిగింది. సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు తదితరులు హాజరయ్యారు. పార్టీ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న తీరు, పార్లమెంటు ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలు, ఆరు గ్యారంటీల అమలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరిగిన ఈ సమావేశంలో సోనియా రాష్ట్రం నుంచి పోటీ చేయడంతో పాటు ప్రచారానికి వచ్చిన ఏఐసీసీ నేతలు, ఎన్నికల్లో పనిచేసిన పార్టీ కేడర్, నాయకత్వం, అలాగే ఓట్లేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ మొత్తం 3 తీర్మానాలను ఆమోదించారు. రేపట్నుంచి శ్వేతపత్రాలు కాంగ్రెస్ 10 రోజుల పాలనపై సమావేశంలో చర్చ జరిగింది. రేవంత్ ప్రభుత్వ పనితీరును పలువురు సభ్యులు అభినందించారు. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేలా పారదర్శక పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ చెప్పారు. ఇటీవల జరిగిన అధికారుల నియామకాలు, బదిలీల్లో కూడా ఈ విషయం వెల్లడైందని అన్నారు. రాష్ట్ర ఆర్థి క పరిస్థితిని, విద్యుత్ శాఖ, నీటిపారుదల శాఖల్లో వాస్తవిక పరిస్థితులను ప్రజల ముందు పెట్టేందుకు బుధవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రాలు విడుదల చేస్తామని తెలిపారు. లోక్‌సభ టార్గెట్ 15 వచ్చే ఏప్రిల్‌లో జరుగుతాయని భావిస్తున్న పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధతపైనా సమావేశంలో చర్చించారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 15 లోక్‌సభ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని పీఏసీ సభ్యులు కోరారు. కాగా లోక్‌సభ టికెట్లు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారాలను అధిష్టానం చూసుకుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. సంక్రాంతి లోపే పదవులు పార్లమెంటు ఎన్నికలు వస్తున్నందున నామినేటెడ్ పదవులు ఇస్తే పార్టీ నాయకులు మరింత ఉత్సాహంతో పనిచేస్తారని పీఏసీ సభ్యులు సూచించారు. వీలున్నంత త్వరగా భర్తీ చేయడం ద్వారా రెండేళ్ల కాలపరిమితికి అనుగుణంగా మరో రెండుసార్లు ఈ పోస్టులకు పార్టీ నేతలను ఎంపిక చేయవచ్చని, దాదాపుగా 1,000 మందికి అవకాశం కల్పించవచ్చని చెప్పారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు పూర్తి కాగానే, సంక్రాంతి పండుగ లోపే నామినేటెడ్ పదవులపై పూర్తిస్థాయిలో కసరత్తు జరుగుతుందని, అధిష్టానం పెద్దలతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా పోస్టుల భర్తీ చేపడతానని సీఎం హామీ ఇచ్చినట్టు సమాచారం. ప్రతిష్టాత్మకంగా ఆరు గ్యారంటీల అమలు ఆరు గ్యారంటీల అమలును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని, ఈ పథకాల అమలు పార్టీ కేడర్ ద్వారా సక్రమంగా జరిగేలా చూడాలని రేవంత్ కోరారు. పథకాల అమలుతో పాటు లబ్ధిదారుల ఎంపికలో పార్టీ నేతలు, కేడర్ చురుకుగా ఉండి అర్హులందరికీ లబ్ధి కలిగేలా చూడాలని, వారి సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు. బూత్ స్థాయి నుంచి జాగ్రత్తగా ఉండాలి ఓటర్ల జాబితా సవరణలపై చర్చ జరగ్గా.. ఈ సందర్భంగా పార్టీ పక్షాన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ జి.నిరంజన్ వివరించారు. ఫిబ్రవరి 8న ప్రకటించే తుది జాబితా ప్రాతిపదికనే లోక్‌సభకు ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. ఈ జాబితాలో మార్పులు, చేర్పులు, సవరణల కోసం బూత్ స్థాయిలో కార్యకర్తలను అలర్ట్ చేయాలని, ప్రతి ఇంటి నుంచి ఓటర్లను చేర్పించే చర్యలు తీసుకోవాలని చెప్పారు. మాజీ మంత్రులు జానారెడ్డి, టి.జీవన్‌రెడ్డి, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, గీతారెడ్డి, వి.హనుమంతరావు, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్‌చౌదరి, విష్ణునాథ్, పీఏసీ సభ్యులు జగ్గారెడ్డి, వంశీచందర్‌రెడ్డి, సంపత్‌కుమార్, మధుయాష్కీ గౌడ్, బలరాం నాయక్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు వేం నరేందర్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు తదితరులు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల ఇన్చార్జులు ఖరారు పార్లమెంటు ఎన్నికల కోసం కాంగ్రెస్ నియోజకవర్గాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. ముఖ్యమంత్రి రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలకు రెండేసి చొప్పున నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించగా, మంత్రి పదవుల్లో లేని సీనియర్ నేతలు జీవన్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డిలకు కూడా ఇన్చార్జి బాధ్యతలిచ్చారు. మిగిలిన 9 మంది మంత్రులకు 9 నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. వీరంతా మంగళవారం నుంచే లోక్‌సభ ఎన్నికల పనిలో ఉంటారని గాందీభవన్ వర్గాలు వెల్లడించాయి. టికెట్ల కేటాయింపు ప్రక్రియ మొదలు ఎన్నికలు పూర్తయ్యేంతవరకు కేటాయించిన నియోజకవర్గాల్లో మంత్రులదే బాధ్యతని తెలిపాయి. ఇన్చార్జులు వీరే: చేవెళ్ల, మహబూబ్‌నగర్ – రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్, హైదరాబాద్– భట్టి విక్రమార్క మెదక్ – దామోదర రాజనర్సింహ ఆదిలాబాద్ – సీతక్క నల్లగొండ – ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భువనగిరి – కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వరంగల్ – కొండా సురేఖ ఖమ్మం, మహబూబాబాద్ – పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పెద్దపల్లి – శ్రీధర్‌బాబు కరీంనగర్ – పొన్నం ప్రభాకర్ నిజామాబాద్ – టి.జీవన్‌రెడ్డి జహీరాబాద్ – పి.సుదర్శన్‌రెడ్డి మల్కాజిగిరి – తుమ్మల నాగేశ్వరరావు నాగర్‌కర్నూల్ – జూపల్లి కృష్ణారావు ఆరు గ్యారంటీలకు 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఈనెల 28న పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఆరు గ్యారంటీల అమలు కోసం దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఈ ప్రక్రియకు సంబంధించిన అన్ని మార్గదర్శకాలను ప్రభుత్వం వెల్లడిస్తుందని పీఏసీ కన్వినర్ షబ్బీర్ అలీ వెల్లడించారు. గాం«దీభవన్‌లో జరిగిన పీఏసీ సమావేశం అనంతరం ఏఐసీసీ కార్యదర్శి ఎస్.సంపత్‌కుమార్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2,500 నగదు, రూ.500కే గ్యాస్ సిలిండర్ లాంటి పథకాల కోసం లబ్ధిదారుల ఎంపిక విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని చెప్పారు. గ్రామసభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేసే సాంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రారంభిస్తుందని తెలిపారు. 28 నుంచి 15 రోజుల పాటు నిర్దేశిత ఫార్మాట్లో దరఖాస్తులు ప్రభుత్వం స్వీకరిస్తుందని చెప్పారు. ఎలాంటి వివక్ష లేకుండా సంతృప్త స్థాయిలో పథకాలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందన్నారు. 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగ్‌పూర్‌లో జరిగే సభకు తెలంగాణ నుంచి 50 వేల మందిని తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
సీపీఐతో పొత్తు వల్లే కాంగ్రెస్ గెలిచింది: నారాయణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తమ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఇదే సమయంలో మిగతా రాష్ట్రాల్లో కూడా తమతో పొత్తు పెట్టుకుంటే గెలిచేవారని నారాయణ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమ పార్టీతో పొత్తు లేకపోవడంతో మిగతా మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోడిందని అన్నారు. కాగా, సీపీఐ నారాయణ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో తమ పార్టీకి 90-100 నియోజకవర్గాల్లో దాదాపు 1000 నుంచి 10,000 ఓట్ల వరకు ఉంటాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి తమ ఓట్లు ఎంతో కలిసి వచ్చాయని తెలిపారు. మిగితా రాష్ట్రాలో పొత్తు పెట్టుకోకపోవడం వల్లనే ఆ పార్టీ ఓడిపోయిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్, ఛత్తీస్‌ఢ్‌లో అధికారంలో ఉందని మరి అక్కడ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. అలాగే మధ్యప్రదేశ్‌లో కూడా గతంలో వచ్చిన సీటలును ఆ పార్టీ కోల్పోయిందని అన్నారు. ఈ విషయం ఆ పార్టీ అధిష్టానం గుణపాఠంగా తీసుకోవాలని అన్నారు. ఏఐసీసీ ముఖ్యంగా దీనిని గమనించాలని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో కూడా సీపీఐతో పొత్తు పెట్టుకొని ఉంటే తమ పార్టీ ఓట్లు కూడా పడేవని, ఇవి ఎంతగానో కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చేవని కామెంట్స్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ గెలుపునకు కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు. కాంగ్రెస్ గెలిచినా.. ఓడినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. బీజేపీ ఓటమే తమకు ముఖ్యమన్నారు. ఇండియా భాగస్వామ్య కూటమిలోని పార్టీలను కలుపుకుపోవడం కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యమని నారాయణ చెప్పుకొచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ పోటీ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో నాలుగు, తమిళనాడులో రెండు, పశ్చిమ బెంగాల్లో మూడు, ఛత్తీస్‌గఢ్‌లో బస్తర్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఒక్కో లోక్‌సభ స్థానంలో సీపీఐ పోటీ చేయనున్నట్టు నారాయణ వెల్లడించారు. ఎన్నికల అవగాహనలో భాగంగా మధ్యప్రదేశ్‌లో ఒక్క స్థానంలో సీపీఐకి అఖిలేష్ యాదవ్ మద్దతునిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌తో మద్దతు కుదిరితే వారితో కలిసి పోటీ చేస్తామన్నారు. -
సీఎం రేవంత్‌కు బండి సంజయ్ లేఖ.. కేసీఆర్‌పై చర్యలు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎంగా రేవంత్ బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలిపారు. ఇదే సమయంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యలను పరిష్కరించాలని లేఖలో పేర్కొన్నారు బండి సంజయ్. కాగా, సీఎం రేవంత్‌కు రాసిన లేఖలో బండి సంజయ్..‘ఉమ్మడి రాష్ట్రంలో 17 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం మిడ్ మానేరు ప్రాజెక్టును ప్రారంభించింది. లక్షలాది ఎకరాలకు సాగు నీటితోపాటు తాగునీటి అవసరాలను తీరుస్తుందనే భావనతో ప్రాజెక్టు ముంపు పరిధిలోని 12 గ్రామాల ప్రజలు ఇండ్లు, భూములు త్యాగం చేశారు. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 12 వేల 500 మంది బాధితులున్నారు. వీరికి సహాయ పునరావాస ప్యాకేజీ కింద 2005-06లో నాటి ప్రభుత్వం చేపట్టిన జీవో నెం.69 ప్రకారం ఐఏవై కింద ఇండ్లు మంజూరు చేసింది. ముంపు పరిహారం చెల్లిస్తామని పేర్కొంది. అయితే వీటి అమలులో మాత్రం తీవ్రమైన జాప్యం జరిగింది. 2018 జూన్ 15న నాటి సీఎం కేసీఆర్(మాజీ ముఖ్యమంత్రి) ఈ ప్రాంతానికి వచ్చి మిడ్ మానేరు బాధితులకు ఐఏవై ఇండ్లకు బదులుగా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తామని, అందులో భాగంగా ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల 4 వేలు చెల్లిస్తానని హమీ ఇచ్చారు. 12 గ్రామాల రైతులంతా సాగు భూమిని కోల్పోయిన నేపథ్యంలో వారికి నైపుణ్యత పెంచి స్వయం ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. అలాగే 2009 కొత్త గెజిట్ ప్రకారం 2015 జనవరి నాటికి 18 ఏండ్లు నిండిన యువతీ యువకులకు ముంపు పరిహారం, పట్టా ఇస్తామని చెప్పారు. కానీ నేటికి ఒక్క అడుగు ముందుకు పడలేదు. రెండేళ్ల క్రితం మిడ్ మానేరు ముంపు బాధితుల కోసం కొదురుపాకలో నిర్వహించిన అఖిలపక్ష ‘మహాధర్నా’లో మీరు (రేవంత్ రెడ్డి), నేను (బండి సంజయ్) హాజరై ముంపు బాధితులకు సంఘీభావం తెలిపాం. నాటి ధర్నాలో మిడ్ మానేరు బాధితుల సమస్యలను పరిష్కరించేదాకా వారి పక్షాన పోరాటం చేస్తామని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామని మీరు హామీ ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి మీరు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కాబట్టి మీరు తక్షణమే పెంచిన ఇండ్ల నిర్మాణ పరిహారాన్ని చెల్లించాలని కోరుతున్నాం. అదే విధంగా 2015 నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు సైతం ప్యాకేజీని వర్తింపజేయాలి. అదే సమయంలో ముంపు పరిహారం చెల్లింపు విషయంలో అర్హత లేకపోయినా రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు మాజీ సీఎం కేసీఆర్ బంధువులకు సైతం ప్యాకేజీ కింద పరిహారం చెల్లించారని, అధికారంలోకి వచ్చాక వీరిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి అని పేర్కొన్నారు. -
Telangana: ఎంపీ అభ్యర్థుల ప్రకటనపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికలు నెల రోజుల మందే రావచ్చని రేవంత్ అన్నారు. అలాగే, సంక్రాంతి తర్వాత కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డి పీఏసీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఎమ్మెల్సీ సీట్ల అంశం అధిష్టానం చూసుకుంటుంది. నామినేటెడ్ పదవుల ఎంపిక బాధ్యత ఇంఛార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులదే. నెల రోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుంది. మన పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడా లేదా అని కాకుండా, మన కోసం పనిచేసిన అందరికీ సంక్షేమ పథకాలు అందాల్సిందే. సంక్షేమ పథకాల అమలు బాధ్యత జిల్లా ఇంఛార్జ్‌లదే. మన కార్యకర్తలు సంతృప్తి చెందేలా పనిచేద్దాం. మనం బీఫార్మ్ ఇచ్చిన నాయకుడి ద్వారానే పథకాలు అందాలి. గ్రామసభల్లోనే లబ్ధిదారుల ఎంపిక జరగాలి అని కామెంట్స్ చేశారు. ఇక అంతకుముందు.. గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి ముఖ్య నేతలంతా హాజరయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని తీర్మానించారు. తెలంగాణలో ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారెంటీల్లో రెండింటిని అమలు చేశాం. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాల అసెంబ్లీ వేదికగా వివరిస్తాం. సభలో మంత్రి భట్టి విక్రమార్క.. గత ప్రభుత్వ అప్పులపై ప్రజెంటేషన్ ఇస్తారు. త్వరలోనే గ్రామసభలు నిర్వహించి అర్హులైన వారికి రేషన్‌కార్డులు పంపిణీ చేస్తామన్నారు. -
తెలంగాణ నుంచి సోనియా పోటీ.. కాంగ్రెస్ పీఏసీ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ముగిసింది. ఐదు అంశాలే ఎజెండాగా సమావేశం కొనసాగింది. పార్లమెంట్ ఎన్నికల వ్యూహంపై పీఏసీలో చర్చించారు. అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు పీఏసీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్బంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని తీర్మానించారు. కాగా, పీఏసీ సమావేశం అనంతరం పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణలో ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారెంటీల్లో రెండింటిని అమలు చేశాం. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాల అసెంబ్లీ వేదికగా వివరిస్తాం. సభలో మంత్రి భట్టి విక్రమార్క.. గత ప్రభుత్వ అప్పులపై ప్రజెంటేషన్ ఇస్తారు. ఇక, తెలంగాణ చేపట్టిన ప్రాజెక్ట్‌ల అవకతవకలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష చేపట్టారు. ప్రాజెక్ట్‌ల్లో ఏం జరిగిందో ఆయన వివరిస్తారు. త్వరలోనే గ్రామసభలు నిర్వహించి అర్హులైన వారికి రేషన్‌కార్డులు పంపిణీ చేస్తాం. సోనియా గాంధీ తెలంగాణ నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని తీర్మానం చేశాం. గతంలో ఇందిరా గాంధీ కూడా మెదక్ నుంచి పోటీ చేశారు. ఇక, త్వరలోనే రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్టీ. అలాగే, ప్రతీ పార్లమెంట్ సెగ్మెంట్‌కు ఒక్కో మంత్రికి ఇంఛార్జి భాధ్యతలు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన ఉంటుంది’ అని స్పష్టం చేశారు. పార్లమెంట్ స్థానాల వారీగా బాధ్యతలు అప్పగింత.. సీఎం రేవంత్ రెడ్డి: చేవెళ్ల, మహబూబ్‌నగర్ భట్టి విక్రమార్క: ఆదిలాబాద్ పొంగులేటి: ఖమ్మం ఉత్తమ్ కుమార్ రెడ్డి: నల్లగొండ పొన్నం ప్రభాకర్: కరీంనగర్ -
మేడిగడ్డపై అంత నిర్లక్ష్యమా.. మంత్రి ఉత్తమ్ సీరియస్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి మేడిగడ్డ పనులపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అయితే, మేడిగట్ట బ్యారేజ్ పనులు చేసిన ఎల్ అండ్ టీ గ్రూప్ డైరెక్టర్ ఎస్వీ దేశాయ్, ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్ సమావేశమయ్యారు. ఈ క్రమంలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, సమీక్షలో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్..‘అంత పెద్ద ప్రాజెక్ట్‌లో ఎలా నాసిరకం పనులు చేసారు. ఇంత నాణ్యత లేకుండా ఎలా చేసారని నిలదీశారు. ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి మా ప్రమేయం లేదు అని తప్పించుకోవాలంటే ఊరుకోమని హెచ్చరించారు. ప్రజా ధనాన్ని వృథా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఎవ్వరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. పూర్తి స్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టు ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడాలని, తప్పు చేసిన వారు తపించుకోవాలని చూస్తే న్యాయ పరంగా, చట్ట పరంగా చర్యలు తప్పవని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. -
కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ కీలక సమావేశం
సాక్షి, హైదరాబాద్: కాసేపట్లో గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ(PAC) సమావేశం జరగనుంది. ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక జరుగుతున్న తొలి సమావేశం కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు, కమిటీ సభ్యులు ఈ భేటీలో పాల్గొంటారు. ప్రభుత్వం- పార్టీ మధ్య అనుసంధానం అనే ప్రధానాంశంతో పీఏసీ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. పార్లమెంట్ ఎన్నికలపై, నామినేటెడ్ పదవుల భర్తీ పై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇక.. ఈ నెల 28న కాంగ్రెస్ వ్యవస్థాపక దినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలపై పీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు, అలాగే.. బోయినపల్లి లోని గాంధీ నాలెడ్జ్ సెంటర్ నిర్మాణం వేగవంతం కోసం ఆ బాధ్యతను వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పచెప్పే ప్రకటనలు పీఏసీలోనే చేస్తారని తెలుస్తోంది. మరోవైపు.. త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. మలి విస్తరణలో తమకు అవకాశం వస్తుందని పలువురు నేతలు ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు(19న) ఢిల్లీ వెళ్లి పార్టీ అగ్ర నేతలతో సమావేశం కానున్నారు. ఇదీ చదవండి: సీఎం రేవంత్ ఆఫర్.. సున్నితంగా తిరస్కరణ -
TS:ఐపీఎస్ అధికారుల బదిలీ..ఎవరు ఎక్కడికంటే..?
సాక్షి,హైదరాబాద్: సివిల్ సర్వీసు అధికారుల బదిలీపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆదివారం మధ్యాహ్నమే 12 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం రాత్రి 8 గంటలకు 9 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.10 మంది ఐపీఎస్‌లు, ఐదుగురు నాన్ క్యాడర్ ఐపీఎస్‌లను బదిలీ చేసింది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా బాలాదేవిని ప్రభుత్వం నియమించింది. వరంగల్ కమిషనర్‌గా ఉన్న రంగనాథ్‌ను హైదరాబాద్ జాయింట్ సీపీగా బదిలీ చేశారు. మాదాపూర్ డీసీపీ సందీప్‌పై వేటు వేశారు. రైల్వే అడ్మిన్ ఎస్పీగా సందీప్ రావును నియమించారు. వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డెవీస్ ఎస్బీ హైదరాబాద్ డీసీపీగా బదిలీ అయ్యారు. నార్త్ జోన్ డీసీపీగా రోహిణి ప్రియదర్శినిని నియమించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ జాయింట్ సీపీగా విశ్వప్రసాద్, సిట్, క్రైమ్స్ జాయింట్ సీపీగా ఏవీ రంగనాథ్, పశ్చిమ మండల డీసీపీగా విజయ్‌కుమార్, ఉత్తర మండల డీసీపీగా రోహిణి ప్రియదర్శిని, సీసీఎస్ డీసీపీగా ఎన్.శ్వేత, హైదరాబాద్ ట్రాఫిక్-1 డీసీపీగా ఎస్ సుబ్బారాయుడిని బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదీచదవండి..నిజమైన బాధితుడికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్: సీపీ శ్రీనివాస్‌రెడ్డి -
కిషన్ రెడ్డి అలా.. పురంధేశ్వరి ఇలా..
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసినన్ని రాజకీయ విన్యాసాలు ఇంకెవరూ చేసినట్లు సమకాలీన రాజకీయాల్లో చేసి ఉండరు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పాలసీ.. ఒక్కో పార్టీతో ఒక్కో మాదిరి పొత్తులు.. ఇక్కడున్న విధానం ఆ రాష్ట్రంలో ఉండదు. అక్కడున్నట్లు ఈ రాష్ట్రంలో ఉండదు.. మొన్న తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో ఉన్న ఆయన ఆంధ్రాలో టీడీపీతో కలిసి సాగుతున్నారు. చంద్రబాబును సీఎం చేయడమే లక్ష్యంగా సాగుతున్నారు. ఇక ఇదే చంద్రబాబు తెలంగాణలో కాంగ్రెస్‌తో అంటగాకి బీజేపీని దెబ్బతీసేందుకు కృషి చేసింది. ఇక తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. అక్కడ బీజేపీతో కలిసి ఎనిమిది సీట్లలో పోటీ చేసిన పవన్ ఘోరంగా దెబ్బతిన్నారు. అన్నిచోట్లా డిపాజిట్లు కోల్పోయి తీవ్ర పరాభవంతో తలదించుకున్నారు. దీంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సైతం పవన్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. తెలంగాణలో పవన్‌తో పొత్తుకారణంగా తమకు నష్టం వాటిల్లిందని, లేకుంటే తాము ఇప్పుడు గెలిచినా ఎనిమిది సీట్లకు మించి ఇంకో రెండుమూడు సీట్లు ఎక్కువ గెలిచేవాళ్లమని అన్నట్లుగా మెసేజీలు వచ్చాయి. అయితే వాటిని అయన తరువాత ఖండించారు. అయన అలా అన్నారో లేదో తెలియలేదు కానీ.. ఖండన అయితే వచ్చింది.. ఇక ఇటు ఆంధ్రాలో తాము జనసేనతో పొత్తులో ఉన్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు. ఆంధ్ర అభివృద్ధికి కేంద్రం ఎంతగానో సహకరించింది అని చెబుతూ.. ఏలూరు మెడికల్ కాలేజీకి రూ.525 కోట్లు ఇచ్చాం. భోగాపురం విమానాశ్రయానికి సైతం నిధులు ఇచ్చామని, ఇంకా పలు జాతీయరహదారులు నిర్మిస్తున్నామని చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అమరావతి నిర్మాణానికి రూ.1500 కోట్లు ఇచ్చినట్లు వివరించారు. అంతేకాకుండా రానున్న సాధారణ ఎన్నికలకు తాము జనసేనతో పొత్తుపెట్టుకుంటామని అన్నారు. అంటే అటు పవన్ మాత్రం తాను టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని అన్నారు. మరి ఆ టీడీపీ జనసేన పొత్తులో బీజేపీ కూడా ఉంటుందా లేదా అన్నది ఇంకా తెలియడం లేదు. కానీ పవన్ మాత్రం బీజేపీని టీడీపీని దగ్గర చేర్చాలని చూస్తున్నారు. తెలంగాణాలో వ్యతిరేకంగా పోటీ చేసిన టీడీపీ బీజేపీ.. ఇప్పుడు ఆంధ్రాలో కలిసి ఉంటాయా లేదా చూడాలి. చదవండి: ఓడినా ఆనందిస్తున్న బండి.. ఎందుకంటే..? -
TS:మాజీ మంత్రికి పెద్దపల్లి ఎంపీ టికెట్!
సాక్షి, పెద్దపల్లి: ఆ మాజీ మంత్రి ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఏడోసారి ఓడిపోయారు. త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఇక ఇప్పుడు పెద్దపల్లి ఎంపీ సీటుపై కన్నేశారట ఆ మాజీ మంత్రి. మరి గులాబీ బాస్ ఆయనకు క్లియరెన్స్ ఇచ్చేశారా? మాజీ మంత్రికి కాదంటే పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? అసలు అక్కడ నుంచి పోటీ చేయడానికి పోటీ పడుతున్న నేతలెవరు? పెద్దపెల్లి ఎంపీ సీటుకు గులాబీ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరు తెరపైకొస్తోంది. సౌమ్యుడిగా, సీనియర్ నాయకుడిగా పేరున్న ఈశ్వర్ అయితేనే పెద్దపల్లి సీటు కచ్చితంగా గులాబీ పార్టీకి దక్కుతుందని పార్టీ అధినేత ఆలోచిస్తున్నాట్లు చెబుతున్నారు. ధర్మపురి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఓటమిపాలైన ఈశ్వర్ ను ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని అధిష్ఠానం గట్టి పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీగా వెంకటేశ్ నేతకాని ఉండగా.. చెన్నూరు అసెంబ్లీ బరిలో ఓటమిపాలైన బాల్కసుమన్ పేరు కూడా ప్రచారంలో ఉంది. అయితే, వీరిద్దరి కంటే కూడా బెస్ట్ ఛాయిస్ గా గులాబీ బాస్ మాత్రం కొప్పుల ఈశ్వర్ అయితేనే బెటరని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పెద్దపెల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో పెద్దఎత్తున సింగరేణి కార్మికుల ఓట్లుండటం... ఆయా ప్రాంతాలన్నింటా ఈశ్వర్ కు పట్టుండటంతో పాటు.. ధర్మపురి నుంచి ఆరుసార్లు గెలిచి ఏడోసారి ఓటమిపాలైన కొప్పులను రాజకీయంగా ఉపయోగించుకోవాలంటే కచ్చితంగా పెద్దపెల్లి పార్లమెంట్ బరిలో నిలపాల్సిందేనని పార్టీ అగ్ర నాయకులంతా ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. ఈశ్వర్‌ను పెద్దపల్లి లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దింపాలని గులాబీ అధిష్ఠానం యోచిస్తుంటే... యవనేతగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు.. వంశీని బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ యోచిస్తున్నట్టుగా సమాచారం. బీజేపీ నుంచి ఎస్ కుమార్ పేరు వినిపిస్తోంది. అయితే, బీజేపీ నుంచి ఈసారి కొత్త ముఖాన్ని పెద్దపెల్లి పార్లమెంట్ బరిలో దింపే అవకాశాలూ లేకపోలేదని..ఇప్పటికే ఎస్. కుమార్‌ను ధర్మపురి అసెంబ్లీ బరిలో నిలిపినందున ఆయనకు అవకాశం దక్కకపోవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇంకోవైపు కాశిపేట లింగయ్య వంటివారు కూడా ప్రయత్నాలు చేస్తుండగా.. ఆయన్ను కమలం పార్టీ అధిష్ఠానం యాక్సెప్ట్ చేస్తుందో, లేదోనన్న భావన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి ఎవరైనా బలమైన నేత వస్తే తప్ప.. ఇప్పటికైతే ప్రచారం జరుగుతున్నట్టుగా బీఆర్ఎస్ నుంచి అనుభవజ్ఞుడైన కొప్పుల ఈశ్వర్.. కాంగ్రెస్ నుంచి యువకుడైన వంశీ గనుక బరిలోకి దిగితే.. ఈ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ కు తెర లేవనుంది. మొత్తంమీద అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయో లేదో.. అప్పుడే వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. పొల్టీషియన్స్ అంతా ఎవరి ప్లాన్లల్లో వారు పడ్డారు. అలాగే పార్టీలు కూడా ఏ అభ్యర్థైతే బెటర్.. ఎవరైతే ప్లస్.. ఎవరైతే మైనస్ అనే లెక్కలు వేసుకుంటున్నాయి. ఇదీచదవండి..గవర్నర్ ప్రసంగంలో అసలు విషయం ఇదేనా? -
TS: గవర్నర్ ప్రసంగంలో అసలు విషయం ఇదేనా?
తెలంగాణ గవర్నర్ తమిళసై శాసనసభలో చేసిన ప్రసంగం పరిశీలిస్తే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత భయం, భయంగా నడక ప్రారంభించిందన్నది అర్ధం అవుతుంది. తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి గొప్ప అవకాశం వచ్చినప్పటికీ, మున్ముందు ఎదుర్కోబోయే కష్టాలు కూడా అంతర్లీనంగా ఈ ప్రసంగంలో కనిపిస్తాయి. ఆ విషయాలు నేరుగా గవర్నర్ ప్రసంగం ద్వారా చెప్పించకపోయినా, ఉపన్యాస సరళిని గమనిస్తే ఆ భావం కలుగుతుంది. ఇంతకాలంగా అధికారంలో ఉన్న కేసీఆర్ పాలనను నిర్భంధ పాలనగా, నియంతృత్వ పాలనగా సహజంగానే విమర్శిస్తారు. దానికి కొంతమేర కేసీఆర్ అవకాశం ఇచ్చారని చెప్పకతప్పదు. అలాగే ఆయన చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న విషయంలో విచారణ కొనసాగుతుందని గవర్నర్ వెల్లడించారు. ఇది బీఆర్ఎస్కు ఎంబరాస్మెంట్ కలిగించే అంశమే అవుతుంది. కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చడం కష్టం అయినప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కు ఇబ్బందిగా ఉండే విషయాలను తెరపైకి తెచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీలు అలా వ్యవహరించడం సహజమే. ప్రజలు తమ కష్టాలు చెప్పుకోవడానికి వీలుగా ప్రజావాణి కార్యక్రమం ప్రారంభించామని ఈ స్పీచ్‌లో తెలిపారు. ప్రస్తుత వాతావరణం గమనిస్తే వేల సంఖ్యలో ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చి తమ వినతులు అందిస్తున్నారు. వాటన్నిటిని పరిష్కరించడం అంత తేలికకాదు. వాటిలో ఎక్కువగా వ్యక్తిగత సమస్యలే ఉండవచ్చు. వాటిని ఏమి చేయాలన్నదానిపై ఒక విధానం తీసుకోవలసి ఉంటుంది. లేకుంటే ఆ వినతులు ఇచ్చినవారిలో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని హామీ ఇచ్చామని, నిర్భంధాలు, నియంతృత్వ ధోరణులు ఉండవని ప్రభుత్వం భరోసా ఇవ్వడం బాగానే ఉంది. కాకపోతే ఇందిరమ్మ ఎమర్జెన్సీ తెచ్చి దేశాన్ని నియంతగానే పాలించారన్న సంగతి గుర్తుకు వస్తుంటుంది. అయినా ప్రజలకు పూర్థి స్వేచ్ఛ ఇస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించడం ముదావహమని చెప్పాలి.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల గురించి ప్రస్తావిస్తూ ప్రభుత్వం చేపట్టిన 48 గంటలలో రెండు హామీలను నెరవేర్చడం రేవంత్ రెడ్డి చిత్తశుద్దికి నిదర్శనమని తెలిపారు. అంతవరకు ఓకే. అవి రెండు తేలికగా అయ్యేవి కనుక చేశారు. అందులో కూడా ఇబ్బందులు లేకపోలేదు. ఆర్టీసీ బస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని నెరవేర్చింది వాస్తవమే. కాని దీనివల్ల ఆర్టీసీకి కలిగే నష్టాన్ని ఎలా భర్తీ చేసేది కూడా ప్రభుత్వం చెప్పగలిగి ఉంటే బాగుండేది. ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఈ నష్టం మేరకు మొత్తాన్ని ఆర్టిసికి చెల్లిస్తుందా?లేక దానిని మరింత నష్టాలలోకి నెడుతుందా అన్నది చూడాలి. ఈ హామీ అమలు వల్ల వేలాది మంది ఆటోవాలాలు, క్యాబ్ ల వారు ఉపాధి కోల్పోతున్నారన్న విషయం బాగా ప్రచారం అవుతోంది. దీనిని ఎలా పరిష్కరిస్తారో ఆలోచించాలి. మరో హామీ పది లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీని పెంచుతున్నట్లు ప్రకటించారు. దీనివల్ల ఇప్పటికప్పుడు ప్రభుత్వం మీద పడే ఆర్ధిక భారం పెద్దగా ఉండదు. కాని ఎంతో కొంత బడ్జెట్ పెంచవలసి ఉంటుంది. దాని సంగతి ఏమి చేస్తారో తెలియదు.మిగిలిన హామీలు మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా ఇందిరమ్మ ఇళ్లు మొదలైన గ్యారంటీల పేర్లు ప్రస్తావించి వంద రోజుల కార్యాచరణ అన్నారు తప్ప వాటి వివరాల జోలికి వెళ్లినట్లు కనిపించలేదు.ఇక్కడే వారిలో భయం ఏర్పడిందన్న విషయం అర్ధం అవుతుంది. మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రతి మహిళకు 2500 రూపాయల ఆర్ధిక సాయం, గృహజ్యోతి కింద ఇంటికి 200 యూనిట్ల విద్యుత్ ఉచితం,రైతు భరోసా కింద పదహారువేల సాయం, ఇందిరమ్మ ఇళ్లకు ఐదు లక్షల సహాయం వంటివాటిని అమలు చేయవలసి ఉంది. వీటన్నిటికి అయ్యే వ్యయం అంచనా వేస్తే కనీసం ఏభైవేల కోట్ల వరకైనా ఉండవచ్చన్నది ఒక అబిప్రాయం. కాని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ అంచనా వేసిన ప్రకారం లక్ష కోట్లు అవసరం అవుతాయి. ఆ డబ్బు ఎలా వస్తుందన్నది మున్ముందు రోజుల్లో చెబుతారేమో చూడాలి. ఇవి కాకుండా ఆయా డిక్లరేషన్లు ఉండనే ఉన్నాయి. ఉదాహరణకు దళిత బంధు కింద పన్నెండు లక్షల రూపాయల సాయం ఇస్తామని హామీ ఇచ్చారు. దాని ఊసేమీ ఎత్తలేదు. నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదు. గత ప్రభుత్వం అమలు చేయాలనుకున్న రైతు భరోసా ఆగిపోయినప్పుడు రేవంత్ రెడ్డి ఒక హామీ ఇస్తూ, తాము అధికారంలోకి రాగానే పదిహేనువేల చొప్పున ఇస్తామని చెప్పారు. దాని సంగతి కూడా చెప్పినట్లు లేదు. ఆరు గ్యారంటీలను మొదటి క్యాబినెట్ లోనే ఆమోదిస్తామని అప్పట్లో రాహుల్ గాంధీ చెబుతుండేవారు. ఆ ప్రకారం మంత్రివర్గం ఆమోదించినా, ఆ తర్వాత ప్రక్రియ ఏమిటో ప్రభుత్వం వివరించలేదు. మరో వైపు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, విద్యుత్ సంస్థలు 81 వేల కోట్ల అప్పుల్లో ఉన్నాయని,పౌర సరఫరా సంస్థ 56వేల కోట్ల అప్పుల్లో ఉందని ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం ద్వారా వెల్లడించింది. మంత్రులు కూడా ఈ విషయాలను మీడియాకు చెబుతున్నారు. నిజానికి ఈ పరిస్థితి గురించి ఎన్నికల ముందు కూడా వీరికి తెలుసు. అయినా ఈ వాగ్దానాలు చేశారంటే, పదేళ్లుగా అధికారం లేక అల్లాడుతున్న కాంగ్రెస్ ను ఎలాగైనా పవర్ లోకి తీసుకురావాలన్న ఆకాంక్ష తప్ప మరొకటి కాదు.రెండు లక్షల రుణమాఫీపై కార్యాచరణ చేపడతామని కూడా ఈ స్పీచ్ లో పేర్కొన్నారు. ఇది కూడా అంత తేలిక కాకపోవచ్చు.మెగా డిఎస్సి ద్వారా టీచర్ల పోస్టులను భర్తీ చేస్తామని కూడా గవర్నర్ పేర్కొన్నారు. నిజంగానే ఆరు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయగలిగితే రేవంత్ ప్రభుత్వానికి మంచి క్రెడిట్టే వస్తుంది. ధరణి పోర్టల్ బదులు భూ మాత పోర్టల్ తెస్తామన్న హామీని కూడా ప్రస్తావించారు. మళ్లీ దీనివల్ల రైతులకు కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తపడితే మంచిది.గత ప్రభుత్వం మాదిరే మూసి నది ప్రక్షాళన చేస్తామని ఈ ప్రభుత్వం కూడా వెల్లడించింది. దానికి తోడు మూసి నదీ పరివాహక ప్రాంతాన్ని ఉపాధికల్పన జోన్ చేస్తామని అంటున్నారు. అది ఎలా జరుగుతుందో వేచి చూడాలి.గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలను ప్రచారానికి మాత్రమే వాడుకుందని, తదితర విమర్శలు కూడా ఈ స్పీచ్ లో ఉన్నాయి.రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితులపై శ్వేతపత్రాల విడుదలకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. కాని ప్రజలకు కావల్సింది శ్వేతపత్రాలు కాదుకదా! చేసిన వాగ్దానాలను నెరవేర్చడం కదా! అన్న వ్యాఖ్యలు ప్రతిపక్షం నుంచి వస్తాయి. గత ప్రభుత్వంపై నెపం నెట్టి కాలయాపన చేయడానికి ఇవి పాతరోజులు కాదన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఇది రాచరికం కాదు.. ప్రజాస్వామ్యం అన్న విశ్వాసాన్ని ప్రజలలో కల్పిస్తామని చెప్పడం మంచి విషయమే. తమ ప్రభుత్వం మాటలకన్నా చేతలనే నమ్ముకుందని, మార్పును మీరు చూస్తారని ప్రజలకు ఒక భరోసా ఇవ్వడానికి రేవంత్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఒకరకంగా చూస్తే ఇది ఆశలు కల్పించి,వాటిని నెరవేర్చడానికి యత్నించే ప్రభుత్వంగా కనిపిస్తుంది.మరో రకంగా చూస్తే ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఉన్న ఇబ్బందులను పరోక్షంగా ప్రస్తావిస్తూ భయం,భయంగా సాగే ప్రభుత్వం అన్న అభిప్రాయం కలుగుతుంది. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ఓడినా ఆనందిస్తున్న బండి.. ఎందుకంటే..?
సాక్షి, హైదరాబాద్: కమలం పార్టీ కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందారు. సహజంగా ఓడిపోతే బాధపడతారు. కాని బండి సంజయ్ ఓడినందుకు ఏమాత్రం బాధపడటంలేదన్నది పార్టీలో టాక్. మళ్ళీ ఎంపీ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు బండి. తెలంగాణ బీజేపీలో స్టార్‌గా ఒక వెలుగు వెలిగిన బండి సంజయ్‌కు ఎంపీగా ఉండటమే ఇష్టమంటున్నారు. పార్టీ హైకమాండ్ బలవంతం మీదే ఎమ్మెల్యేగా పోటీ చేశారట. అసలు బండికి ఎంపీ పదవంటే అంత మోజు ఎందుకు? బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నకాలంలో ఆ పార్టీని పరుగులు పెట్టించిన బండి సంజయ్ రాజకీయ జీవితంలో కొన్ని మెరుపులు.. మరికొన్ని మరకలు అలా ఒకదాని వెంట మరొకటి అలా కనిపిస్తూనే ఉంటాయన్నది టాక్. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీలోకి కొత్తగా వచ్చిన ఈటల రాజేందర్ వంటివారితో పొసగకపోవడం.. బయట వినిపించిన కొన్ని ప్రచారాలతో మొత్తానికి అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయారు. పార్టీ పదవి నుంచి తప్పించిన బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి దక్కుతుండవచ్చని అంతా ఊహించారు. బండిలో కూడా ఏదో ఓ మూల ఆ ఆశ ఉండేది. కానీ, బీజేపీ హైకమాండ్ మాత్రం ఆయన్ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అయితే కిషన్ రెడ్డి రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టినా.. చాలాకాలం బండి సంజయ్ ఫీవర్ మాత్రం బీజేపీ క్యాడర్ ను వెంటాడింది. అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ కు హెలిక్యాప్టర్ ఇచ్చి స్టార్ క్యాంపెయినర్ గా పార్టీ ప్రచారం చేయించిందంటేనే.. మాస్ లీడర్‌గా బండి అవసరం ఎంతుందో పార్టీ గమనించిందనే అనుకోవాలి. అయితే అసెంబ్లీ బరిలో నిలబడటానికి ససేమిరా అన్న బండిని.. రెండుసార్లు ఓడిన కరీంనగర్ సీటులోనే మూడోసారి బరిలోకి దింపింది. దీంతో మొదట నారాజ్ గానే ఉన్న బండి సంజయ్ ప్రచారంలో మెరుపులు మెరిపించారు. ఒక దశలో అన్ని సర్వేలు, ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ కూడా బండిదే విజయమని తేల్చాయి. కానీ, ఎప్పుడూ కరీంనగర్ అసెంబ్లీ ఫలితాల్ని ప్రభావితం చేసే ముస్లిం మైనార్టీ ఓట్లే ఈసారి కూడా బీఆర్ఎస్ కే ఎక్కువగా పోలవ్వడంతో పాటుగా..హిందూ ఓట్ పోలరైజేషన్ బండిని గెలిపించే స్థాయిలో టర్న్ కాలేదు. దీంతో బండి సంజయ్ కరీంగనర్ అసెంబ్లీ బరిలో మళ్ళీ దెబ్బతిన్నారు. అయితే బండిపై గెలిచిన గంగుల కమలాకర్‌కు వచ్చిన మెజారిటీ 3 వేల ఓట్ల పైచిలుకే కావడంతో..ఆయనకు చాలా ఊరట కలిగించింది. అసెంబ్లీ ఎన్నికల్లో దగ్గరిదాకా వచ్చి ఓడిపోయానన్న బాధ కొద్ది రోజులు కనిపించినా.. ఈసారి పోలైన ఓట్ల సంఖ్య బాగా పెరగడంతో మరోవైపు ఆనందం కనిపించింది. అదే సమయంలో తాననుకున్నట్లే మళ్లీ ఎంపీ బరిలో నిలిచేందుకు రూట్ క్లియర్ అయిందన్న భావన కనిపిస్తోంది. సాధారణంగా గెలిచిన వారు పార్టీ సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ బండి సంజయ్ తాను ఓటమి పాలైనా.. తన కొరకు కష్టించిన కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు, బంధు మిత్రులందిరినీ పిలిచి ఓ పెద్ద విందే ఏర్పాటు చేశారు. ఇక పార్లమెంట్ ఎన్నికలే తన టార్గెట్ గా బండి ప్రయత్నాలు మొదలెట్టారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ఓవైపు పార్టీలోనే తన అంతర్గత శత్రువుల్లా తయారైన ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ వంటివారికి తన సోషల్ మీడియా టీమ్స్ తో చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బయటి ప్రత్యర్థులతో పోటీకి సిద్ధమయ్యేందుకు బండి తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. మొత్తంగా కార్పోరేటర్ స్థాయి నుంచి ఎదిగిన బండి రాజకీయ జీవితంలో కొన్ని ఓటములు, మరికొన్ని విజయాలు కలిసి.. బాగా రాటుదేల్చాయనే కామెంట్స్ పొల్టికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. ఇదీ చదవండి: దక్షిణ తెలంగాణపై ఫోకస్.. బీజేపీ వ్యూహం ఏంటి? -
రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన.. ఆరుగురు మంత్రులపై క్లారిటీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. మంగళవారం సీఎం రేవంత్.. ఢిల్లీ వెళ్లనున్నట్లు సీఎంవో కార్యాలయం పేర్కొంది. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో మిగితా ఆరుగురు మంత్రుల జాబితాకు సంబంధించి సీఎం రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్‌తో చర్చించన్నుట్లు సమాచారం. దీంతో కొత్త మంత్రుల కేటాయింపు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: సెటైర్లు.. సవాళ్లు.. ప్రతిసవాళ్లు -
దక్షిణ తెలంగాణపై ఫోకస్.. బీజేపీ వ్యూహం ఏంటి?
తెలంగాణ కమలం పార్టీ గత ఎన్నికల్లో గెలిచింది హైదరాబాద్‌లోని గోషామహల్ సీటు ఒక్కటే. తాజా ఎన్నికల్లో 8 స్థానాల్లో పాగా వేసింది. ఉత్తర తెలంగాణలోనే 7 సీట్లు గెలిచింది. దక్షిణ తెలంగాణలో ఒక్కటి కూడా దక్కలేదు. మరి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పట్టు పెంచుకోవడానికి కాషాయ సేన ఏంచేయబోతోంది? 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలోని గోషామహల్ నియోజకవర్గం ఒక్కటే బీజేపీ ఖాతాలో పడింది. ఆ తర్వాత జరిగిన రెండు ఉప ఎన్నికల్లో దుబ్బాక, హుజూరాబాద్ సీట్లు కూడా కాషాయ పార్టీ దక్కించుకుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రబాద్‌తో పాటు.. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్నామని కమలం పార్టీ భావించింది. అయితే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడు అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. నిర్మల్‌లో గెలిచిన ఏలేటి మహేశ్వరరెడ్డి మినహా మిగిలినవారంతా కొత్తవారే. మొత్తం మీద అనుకున్నన్ని స్థానాలు రాకపోయినా.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పట్టు తగ్గలేదని కమలం పార్టీ నాయకులు సంతోషంగానే ఉన్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో 48 మంది కార్పొరేటర్లను గెలుచుకుని గులాబీ పార్టీని దెబ్బతీశామని భావించిన బీజేపీకి..అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గతంలో గెలిచిన గోషామహల్ ఒక్కటే మిగిలింది. కార్పొరేటర్లను భారీగా గెలిచిన నియోజకవర్గాల్లో కూడా కమలం పార్టీ జెండా ఎగరేయలేకపోయింది. సికింద్రాబాద్ ఎంపీ సీటు గెలిచిన చోట కూడా అసెంబ్లీ సీట్లు దక్కలేదు. ఇక మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, మెదక్ జిల్లాల్లో కూడా బీజేపీకి ఊహించనంత ఎదురుదెబ్బ తగిలింది. మరో ఐదు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే వెంటనే దక్షిణ తెలంగాణ జిల్లాలు, గ్రేటర్ హైదరాబాద్ మీద గట్టిగా దృష్టి పెట్టాలని కమలనాథులు భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో నలుగురు ఎంపీలు బీజేపీకి ఉన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నాలుగుతో పాటుగా.. కనీసం మరో నాలుగైనా గెలుచుకోవాలని కమలం పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉన్న ఎంపీ సీట్లు కాపాడుకుంటూ.. హైదరాబాద్ సహా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పాగా వేయాలని కమలనాథులు ప్లాన్ వేస్తున్నారు. -
సెటైర్లు.. సవాళ్లు.. ప్రతిసవాళ్లు
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శల పర్వం మొదలైంది. అభ్యంతరాలు, వాదోపవాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, వ్యంగ్య వ్యాఖ్యలతో రోజంతా సభ ఆసక్తికరంగా సాగింది. సభలో ప్రతిపక్షానికి కూడా మాట్లాడే అవకాశం ఇస్తామంటూనే అధికార పక్షం బీఆర్ఎస్పై దాడికి దిగింది. దీనికి ప్రతిగా బీఆర్ఎస్ పక్షాన సీనియర్ సభ్యులు కేటీఆర్, హరీశ్ ఇద్దరూ దూకుడుగా కాంగ్రెస్ సర్కారుపై ఎదురుదాడి చేశారు. దీంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ను కట్టడి చేసేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ తదితరులు ప్రయతి్నంచారు. కుటుంబ పాలన, వరి పంటకు మద్దతు ధర, తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, 50ఏళ్ల కాంగ్రెస్ పాలన అవస్థలు, ఆ పార్టీ సీఎంలను ఎంపిక చేసిన తీరు తదితర అంశాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు పరస్పరం వ్యంగ్య విమర్శలు, వాదోపవాదాలకు దిగారు. మొదట సీఎం దాడి.. సీఎం రేవంత్ తన ప్రసంగం ప్రారంభంలోనే బీఆర్ఎస్పై విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చినా బీఆర్ఎస్లో మార్పు రాలేదంటూ మండిపడ్డారు. ఇక ‘మేనేజ్మెంట్ కోటా’పేరిట జరిగిన చర్చ ఆసక్తికరంగా సాగింది. ‘‘మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వారు కేబినెట్ నిర్ణయాలు, చట్టబద్ధత కల్పించడంపై తేడాను గమనించాలి’’అని రేవంత్ వ్యాఖ్యానించగా.. కేటీఆర్ ప్రతిస్పందిస్తూ..‘‘ఢిల్లీని మేనేజ్ చేసి పీసీసీ అధ్యక్ష పదవి, సీఎం పదవి తెచ్చుకున్న వ్యక్తి మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు’’అని ఎద్దేవా చేశారు. దీంతో.. ‘‘గవర్నర్ ప్రసంగం చూసి సిగ్గుపడుతున్నానని కేటీఆర్ అన్నారు. నిజంగా గత పదేళ్ల పాలనపై ఆయన సిగ్గుపడాల్సిందే..’’అని రేవంత్ సెటైర్ వేయగా.. ‘పంటల బీమాకు, రైతు బీమాకు తేడా తెలియని వ్యక్తి సీఎంగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా’నని కేటీఆర్ విమర్శించారు. దీనికి ప్రతిగా ‘మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వ్యక్తి.. ప్రజల నుంచి వచ్చి సీఎం కుర్చిలో కూర్చున్న వారిపై కుళ్లుకుంటున్నారు’అని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇక 50ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చీకట్లు, రైతుల ఆత్మహత్యలేనని బీఆర్ఎస్ సభ్యులు విమర్శించగా.. గత పాలనలో అన్యాయం జరిగిందనే అందరం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామని, ఇప్పుడు గత పదేళ్ల పాలన గురించి మాట్లాడుకుందామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హరీశ్‌రావుకు మైక్ నిరాకరణపై నిరసన ధన్యవాద తీర్మానంపై సీఎం ఇచ్చిన సమాధానానికి బీఆర్ఎస్ పక్షాన హరీశ్‌రావు వివరణ కోరడం కూడా అధికార, విపక్షాల మధ్య వాగ్వాదానికి దారితీసింది. ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొన్న కేటీఆర్‌కే వివరణ కోరే అవకాశం ఇస్తామని స్పీకర్ పలుమార్లు ప్రకటించారు. అయి నా చివరికి హరీశ్‌రావుకు మైక్ ఇచ్చారు. ‘‘సీఎం పలు అంశాలపై హుందాతనం లేకుండా విమర్శలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినట్లుగా ఇప్పుడు సీఎం అయినా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ బిడ్డ పీవీ చనిపోతే చూసేందుకు కాంగ్రెస్ నేతలెవరూ రాలేదు’’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఉప ముఖ్యమంత్రి భట్టి కల్పించుకుంటూ.. బీఆర్ఎస్ వాల్లు పదేళ్ల నుంచీ అదే చెప్తున్నారని, ఇంకెన్నాళ్లు చాచా నెహ్రూ, పీవీ నర్సింహారావుల గురించి మాట్లాడుతారని ప్రశ్నించారు. ఇదే సమయంలో ధన్యవాద తీర్మానం తీర్మానాన్ని ఆమోదించినట్టు స్పీకర్ ప్రకటిస్తూ, శాసనసభను బుధవారానికి వాయిదా వేశారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు తమకు నిరసన తెలిపే అవకాశం ఇవ్వలేదని నినాదాలు చేస్తూ సభ నుంచి బయటికి వచ్చారు. -
కేసీఆర్‌కు పదవులిచ్చింది కాంగ్రెస్సే..
సాక్షి, హైదరాబాద్: ‘పదే పదే గత కాంగ్రెస్ పాలన గురించి, ప్రభుత్వాల గురించి (కేటీఆర్) మాట్లాడుతున్నారు. గత పాలనలోనే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ తరఫున సింగిల్ విండో డైరెక్టర్‌గా పోటీకి అవకాశమిస్తే ఓడిపోయారు. కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించింది కాంగ్రెస్ పార్టీనే. ఆయనకు నౌకాయాన శాఖ, ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రి పదవులు ఇచ్చింది. కేసీఆర్ కుటుంబ సభ్యుడి (హరీశ్‌రావు)ని ఎమ్మెల్యే కాక ముందే మంత్రిని చేసింది. ఆ తర్వాత ఎమ్మెల్యే కావడానికి సహకరించింది’ అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై శనివారం అసెంబ్లీలో జరిగిన చర్చలో బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ చేసిన విమర్శలకు ముఖ్యమంత్రి గట్టి కౌంటర్ ఇచ్చారు. వారి గౌరవానికి తగదు: ‘కొంతమంది ఎన్నారైలకు ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థం కాదు. ప్రజాస్వామ్యంలో 49కి సున్నా, 51కి వంద శాతం విలువ ఉంటది. 51 శాతం సీట్లు ఉన్న వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తరు. 49 శాతం ఉన్న వారు ప్రతిపక్షంలో కూర్చొని ప్రభుత్వం తీసుకునే పరిపాలన నిర్ణయాలు, శాసనాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు, సూచనలు ఇస్తారు. వారు 64 మంది ఉంటే, మేము 39 మంది ఉన్నం. మేము అచ్చోసిన ఆంబోతుల్లాగా ఉన్నం. మేం పోడియంలోకి వచ్చి కుస్తీలు కొట్లాడుతం అని మాట్లాడటం సరికాదు. ఈ రకమైన భాష వారి గౌరవానికి, ఈ సభను నడిపించుకోవడానికి సహకరించదు’ అని కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. గత కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్కూ భాగస్వామ్యం గతం గురించి మాట్లాడాలని ఉంటే సభలో ఒక రోజంతా జూన్ 2, 2014కి ముందు జరిగిన 55 ఏళ్ల పరిపాలనపై చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని రేవంత్‌రెడ్డి అన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వమే దేశానికి బలమైనదని, బీఆర్ఎస్ నేతలు అందులో మంత్రులుగా పనిచేశారన్నారు. ‘పోతిరెడ్డిపాడు పొక్కపెద్దది చేసినప్పుడు నాయిని నరసింహారెడ్డి కడప జిల్లా ఇన్చార్జి మంత్రి. దానికి వ్యతిరేకంగా ఆనాడు పోరాడింది పి.జనార్దన్ రెడ్డి ఒక్కరే. ఇక్కడ ఉన్నోళ్లు ఎవరూ (బీఆర్ఎస్ సభ్యులు) ప్రాణత్యాగాలు చేస్తామని కొట్లాడలేదు. 2014 జూన్ 2 నుంచి జరిగిన పరిపాలన, విధ్వంసం, నాయకత్వ వ్యవహారశైలి మీదే ప్రస్తుతం చర్చిస్తున్నాం. గత కాంగ్రెస్ పాలనలో చాలామంది బీఆర్ఎస్ సభ్యులకు పాత్ర ఉంది. వారు మంత్రులుగా కూడా చేశారు. దానం నాగేందర్, శ్రీనివాస్ యాదవ్, హరీశ్‌రావు, కడియం, పోచారం, గంగుల కమలాకర్ వంటి వాళ్లందరూ కాంగ్రెస్ పాలనలో పనిచేసిన వారే. ఏవైతే పాపాలు జరిగాయని కేటీఆర్ అంటున్నారో, ఆ పాపాల్లో సంపూర్ణమైన బాధ్యత వాళ్లదే’ అని రేవంత్ చెప్పారు. వరంగల్‌లో జరిగిన ఎన్కౌంటర్లకు కారణం ఎవరని ఆయన ప్రశ్నించారు. తమకు ఐదేళ్ల సమయం ఉందని, గత పదేళ్లలో జరిగిన పాలనపై ఎక్స్‌రే తీసినట్టుగా ఎక్కడ ఏం ఉన్నాయో అన్ని వివరిస్తామని చెప్పారు. గత పదేళ్లలో జరిగిన విధ్వంసం, ఆర్థిక నేరాలపై చర్చకు పెడతామని రేవంత్ పేర్కొన్నారు. చీమలు పెట్టిన పుట్టలో చేరిన పాము.. ‘‘ఇప్పుడు మాట్లాడుతున్న ఆయన (కేటీఆర్) ఎలా ఎమ్మెల్యే అయ్యారు? వారి తండ్రి (కేసీఆర్) గురువు అయిన చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ (టీడీపీ) కండువా కప్పుకున్నారు. కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్లలో (టీఆర్ఎస్) పార్టీని నిర్మించుకుని తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడారు. చీమల పుట్టలో పాములు దూరినట్టు ఎన్ఆర్ఐగా.. అంటే ‘నాన్ రిలయబుల్ ఇండియన్’గా మేనేజ్మెంట్ కోటాలో టికెట్ తీసుకుని సిరిసిల్ల నుంచి కేటీఆర్ పోటీ చేశారు. మహేందర్ రెడ్డికి అన్యాయం చేసి ఈరోజు ఇక్కడికి వచ్చారు’’ అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. -
మా వల్లే కాంగ్రెస్ అధికారంలోకి..
సాక్షి, హైదరాబాద్: 2004లో కాంగ్రెస్‌ని అధికారంలోకి తెచ్చిన ఘనత తమదేనని బీఆర్ఎస్ సభ్యుడు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. నాడు చంద్రబాబు చేతిలో కనీసం ప్రతిపక్ష హోదా దక్కకుండా చిత్తుగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీకి జీవం పోసింది టీఆర్ఎస్, కేసీఆర్ మాత్రమేనని అన్నారు. కేసీఆర్‌కు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్సే అంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ శనివారం ఆయన శాసనసభలో ఈ మేరకు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు తామే భిక్ష పెట్టామన్నారు. యూపీఏ కూటమి కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో తెలంగాణ ఏర్పాటును చేర్చిన తర్వాతే యూపీఏలో కేసీఆర్ చేరినట్టు తెలిపారు. కేసీఆర్‌కు తొలుత షిప్పింగ్ శాఖ ఇవ్వగా, డీఎంకే పార్టీ ఆ శాఖను కోరుకుంటే కేసీఆర్ వదులుకున్నారని గుర్తు చేశారు. మంత్రి పదవుల కోసం కాదు, తెలంగాణ కోసమే కూటమిలో చేరిన విషయాన్ని అప్పట్లో కేసీఆర్ స్పష్టం చేశారన్నారు. రేవంత్‌రెడ్డి ఏబీవీపీలో ప్రా రంభమై టీఆర్ఎస్, టీడీపీల్లో చేరి ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి వచ్చారని, రేపు ఎక్కడ ఉంటారో తెలియదని పేర్కొ న్నారు. తెలంగాణకు ఒక రూపాయి ఇవ్వ నని నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అంటే కేవలం తాము మాత్రమే పోరాడామని చెప్పారు. మంత్రులుగా 14 నెలలే చేశాం... దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో తాము కేవలం 14 నెలలు మాత్రమే మంత్రులుగా పనిచేశామని హరీశ్ తెలిపారు. పోతిరెడ్డిపాడుతో తెలంగాణకు దక్కాల్సిన జలాలను రాయల సీమకు తరలించుకోవడం, తెలంగాణను ముంచి పులిచింతల కట్టి ఆంధ్రకు నీళ్లు మళ్లించడం, 610 జీవో అమలులో నిర్లక్ష్యం, నక్సలైట్లను చర్చల పేరుతో పిలిచి ఎన్ కౌంటర్లు చేయడం వంటి ఆరు కారణాలను పేర్కొంటూ నాడు ఆరు మంది తమ పార్టీ సభ్యులు మంత్రి పదవులకు రాజీనామా చేశారని గుర్తుచేశా రు. పోతిరెడ్డిపాడుపై మా పార్టీ నాయకులే కొట్లాడారని గుర్తు చేశా రు. కాంగ్రెస్ నుంచి కేవలం పీజేఆర్ ఒక్కరే కొట్లాడారన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి సభను తప్పుదోవపట్టించే విధంగా మాట్లాడారని ఆరోపించారు. -
కాళేశ్వరం, మిషన్ భగీరథపై న్యాయవిచారణ జరిపించాలి
సాక్షి, హైదరాబాద్: పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పులకుప్పలా మారిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులను చేపట్టారని, అనవసరమైన ఖర్చులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఆగం చేశారన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో శనివారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని జీవన్‌రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక స్థితిని ప్రస్తావించారు. సాంకేతిక పరిజ్ఞానం అంతంతమాత్రంగా ఉన్న రోజుల్లో నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని, కానీ అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ప్రస్తుత రోజుల్లో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు లోపభూయిష్టంగా మారడం విడ్డూరమే అని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడంతో పాటు అన్నారం బ్యారేజీలో సైతం లీకేజీలు ఏర్పడటం విచారకరమన్నారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణ పనులకు సంబంధించి ఎల్అండ్టీ తొలుత చేపడుతుందని చెప్పినప్పటికీ... ఇప్పుడు చేయనని అంటోందని చెప్పారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణంపై న్యాయ విచారణ చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు కోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రూ.40 వేల కోట్లు ఖర్చు చేసిందని, అప్పటికే చాలా గ్రామాల్లో మంచినీటి సరఫరా వ్యవస్థ ఉన్నప్పటికీ వృథా ఖర్చులతో మళ్లీ మిషన్ భగీరథ పనులు చేపట్టి ప్రజాధనాన్ని నీటిపాలు చేశారని విమర్శించారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే నిరుద్యోగులు హర్షించేవారని, కానీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు మానసికంగా ఆందోళన చెందారన్నారు. జీవో 317 ద్వారా ఉద్యోగులు నష్టపోయారని, వారికి ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రంగా ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలను కలిసే సీఎం రేవంత్: నర్సిరెడ్డి పదేళ్ల కేసీఆర్ పాలనలో సామాన్యుడిని సీఎం కలిసే పరిస్థితే ఉండేది కాదని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి వ్యాఖ్యానించారు. మండలిలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆయన బలపర్చారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ తను ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక దాదాపు 30 సార్లు కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయతి్నంచినా అవకాశం దక్కలేదని, ఒకసారి అవమానానికి సైతం గురయ్యానన్నారు. కానీ రేవంత్‌రెడ్డి సీఎం అయిన మరుసటిరోజే ప్రజాభవన్‌లో కలిశానని చెప్పారు. ప్రజలను కలిసి వారి సమస్యలు వినే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారని, ఈ ఐదేళ్ల కాలంలో ఇదే తరహాలో పాలన సాగాలని ఆయన ఆకాంక్షించారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి లెక్కల్లేవు: ఉత్తమ్ బీఆర్ఎస్ పాలనలో పౌరసరఫరాల విభాగాన్ని అల్లకల్లోలం చేశారని, ఆ శాఖ వద్ద 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి లెక్కల్లేవని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ ధాన్యం ఉందా? లేదా? ఉంటే ఎక్కడుంది? అనే అంశాలకు కాగితాల్లో ఎక్కడా వివరాలు లేకపోవడం గమనార్హమని, దీనిపై సమగ్ర పరిశీలన ప్రారంభించినట్లు మంత్రి వివరించారు. పదేళ్లలో ఈ శాఖ రూ.56 వేల కోట్ల నష్టాల్లో ఉందని చెప్పారు. రేషన్ బియ్యం చాలాచోట్ల లబ్ధిదారులకు చేరడం లేదని, దీనిపై మరింత లోతైన చర్యలు చేపడతామన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై బీఆర్ఎస్ సభ్యులు మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచి్చన ప్రతి హామీని నెరవేర్చాలని, మానవహక్కుల పరిరక్షణపై ప్రభుత్వం ప్రకటన హర్షనీయమని, భావప్రకటన స్వేచ్ఛపై సీఎం చేస్తున్న ప్రకటనలు అమలు జరిగేలా చూడాలని అన్నారు.