breaking news
-
TS: లోక్‌సభ ఎన్నికలపై కసరత్తు.. సోనియా పోటీ?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్‌లో ఉంది. ఎన్నికల్లో ప్రజల నుంచి పూర్తి మద్దతు కనిపించడంతో ఇక లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించింది. మరోవైపు.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ అంశాన్ని హైకమాండ్ పరిశీలిస్తోంది. దీంతో, ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే సస్పెన్స్ నెలకొంది. అయితే, లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. తెలంగాణలో మెజార్టీ ఎలా సాధించాలన్న అంశంపై రేవంత్ టీమ్ దృష్టి సారించింది. ఈ క్రమంలో గెలుపు గుర్రాలు ఎవరు అనే అంశాలను పరిశీలిస్తోంది. 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం దృష్టిసారించింది. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని వారి పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక, ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా పరిగణనలోకి తీసుకుని కసరత్తు చేస్తున్నారు. కాగా, సంక్రాంతికి అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం ఉంది. మల్కాజ్గిరి నుంచి సోనియా పోటీ.. ఇదిలా ఉండగా.. లోక్‌సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలులోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు.. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి అగ్రనేతలు బరిలో దిగనున్నారు. సీనియర్లు బరిలోకి దిగే ఛాన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఖమ్మం, నల్లగొండ, భువనగిరి, మహబూబ్‌నగర్ స్థానాలు కీలకంగా మారాయి. అయితే, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. సోనియాను మాల్కాజ్‌గిరి నుంచి పోటీ చేయించే ఆలోచనలో తెలంగాణ నేతలు ఉన్నట్టు సమాచారం. కాగా, సీఎం రేవంత్ మాల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే. ఈ కారణంతోనే సోనియాను ఇక్కడి నుంచే పోటీ చేయించే అవకాశముంది. ఏపీ కాంగ్రెస్‌పై ఫోకస్.. మరోవైపు.. ఏపీలో టీడీపీని చేర్చుకుందామా? అనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు సమాచారం. ఇండియా కూటమిలో చేరేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు తహతహలాడుతున్నట్టు విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషిస్తున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే చంద్రబాబుతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక, ఈనెల 27వ తేదీన ఏఐసీసీ కీలక సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, పీసీసీ చీఫ్ రుద్రరాజు, కొత్త ఇన్ఛార్జ్ ఠాగూర్ సహా ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ఈ సందర్బంగా ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వ్యూహాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. -
కాళేశ్వరంపై కాంగ్రెస్ ఫోకస్.. మేడిగడ్డ పరిశీలనకు మంత్రులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవకతవకలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ను టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 29వ తేదీన మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు వెళ్లనున్నారు. ఈ సందర్బంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పవన్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. వివరాల ప్రకారం.. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో నెల 29వ తేదీన మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ సందర్శించనున్నారు. 29వ తేదీన మంత్రులు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దకు చేరుకుంటారు. అనంతరం, మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. ప్రాణిహిత, కాళేశ్వరం ప్రాజెక్ట్ వివరాలు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల జరిగిన లాభ, నష్టాలను వివరించనున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం మంత్రులు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయం.. కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు వివరాలను వెల్లడించనున్నారు. ప్రాజెక్ట్ నిర్వహణకు అవసరమైన విద్యుత్‌పై ప్రభుత్వం స్పష్టతనివ్వనుంది. అలాగే, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్‌ల సమస్యలు, వాటి పరిష్కారాలు, తదితర అంశాలపై ప్రభుత్వం సమీక్ష చేయనుంది. ఈ పర్యటనకు సంబంధించి నిర్మాణ సంస్థలకు సబ్ కాంట్రాక్టర్లలకు, ఈ నిర్మాణంలో సంబంధం ఉన్న వారికి అందరికి సమాచారం ఇచ్చి సమావేశంలో పాల్గొనేలా చర్యలు తీసుకోగలరని మంత్రులు ఈఎన్సీని ఆదేశించారు. ఇది కూడా చదవండి: రూ. 500 గ్యాస్ సిలిండర్.. ఈ కేవైసీ అవసరం లేదు..! -
శ్వేతపత్రం అబద్ధాల పుట్ట
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పుల పేరుతో బీఆర్ఎస్ పాలనపై అభాండాలు వేసిందని.. శ్వేతపత్రం పేరిట అంకెల గారడీ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మండిపడ్డారు. శ్వేతపత్రం అంతా తప్పుల తడక అని, అబద్ధాల పుట్ట అని విమర్శించారు. తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు రూ.50 లక్షల కోట్ల ఆస్తులు సాధించి పెట్టిందని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి, రాష్ట్రాన్ని పలు అంశాల్లో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపిందని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో తగ్గిన పేదరికాన్ని చూపించకుండా, అప్పులను రెండింతలు పెంచి చూపిస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు. ఇటీవల శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలను ఖండిస్తూ.. బీఆర్ఎస్ రూపొందించిన ‘స్వేద పత్రం’ను ఆదివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎత్తిచూపేందుకు, వాస్తవాలను ప్రజల ముందు పెట్టేందుకే ‘స్వేద పత్రం’ను విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘అధికార కాంగ్రెస్ శ్వేతపత్రంలో చెప్పిన ప్రకారం ఎఫ్ఆర్బీఎం పరిమితి లోబడి మా ప్రభుత్వ హయంలోని అప్పులు రూ.3,89,673 కోట్లే. అంతకుముందే ఉన్న అప్పులు రూ.72,658 కోట్లుపోగా.. మా ప్రభుత్వం తెచ్చిన అప్పులు రూ.3,17,015 కోట్లే. కానీ వాళ్లు దీనిని రూ.6,71,757 కోట్లుగా చూపారు. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన ‘స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ)ల’అప్పులు రూ.1,27,208 కోట్లుకాగా, ఎస్పీవీల సొంత రుణాలు రూ.1,18,557 కోట్లు. ప్రభుత్వ హామీ లేని రుణాలు మరో రూ.59,414 కోట్లు. ఈ రూ.3,05,179 కోట్లు సొంత పరపతితో ఆయా సంస్థలు తెచ్చుకున్నవే. అవి ప్రభుత్వ అప్పులు కావు. కానీ మేం తెచ్చిన రూ.3.17 లక్షల కోట్ల అప్పులకు వీటిని కూడా కలిపేసి.. మొత్తం రూ.6,71,757 కోట్ల అప్పుగా చూపారు. పేదరికం బాగా తగ్గింది ఎన్ఎఫ్హెచ్ఎస్ డాటా ప్రకారం తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో పేదరికం 21.92 శాతం. అది 2023 నాటికి 5.8 శాతానికి తగ్గిపోయింది. దేశంలోని ఇంత వేగంగా పేదరికం తగ్గిన రాష్ట్రం మరొకటి లేదు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. కానీ కేంద్రం ఇవ్వలేదు. పౌరసరఫరాల సంస్థకు రూ.56వేల కోట్ల అప్పు అవాస్తవం ప్రభుత్వం శ్వేతపత్రంలో చూపిన లెక్కలు తప్పుల తడక అనడానికి పౌరసరఫరాల సంస్థ అప్పులే ఉదాహరణ. ప్రస్తుతం ఆ సంస్థ ఆ«దీనంలో ఉన్న ధాన్యాన్ని అమ్మితే రూ.30 వేల కోట్లు వస్తాయి. ఇప్పటికే అమ్మిన ధాన్యానికి ఎఫ్‌సీఐ నుంచి రావాల్సిన మొత్తం రూ.16 వేల కోట్లు. వీటిని లెక్కలోకి తీసుకోకుండా పౌరసరఫరాల సంస్థ అప్పులు రూ.56 వేల కోట్లు అని ప్రభుత్వం చెప్పింది. పౌర సరఫరాల సంస్థ వెబ్‌సైట్‌లోని తాజా లెక్క ప్రకారం ఆ సంస్థ అప్పులు రూ.24,600 కోట్లు మాత్రమే. అలాగే ఆర్టీసీకి వేల కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఆర్టీసీ తన ఆస్తులను తనఖా పెట్టుకొని అప్పు తెచ్చుకుంటే దాన్ని కూడా ప్రభుత్వ అప్పుగా చూపించారు. రూ.4.98 లక్షల కోట్లు వెచ్చిస్తే ఉద్యమం ఎందుకొచ్చింది? ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్లలో తెలంగాణ కోసం రూ.4.98 లక్షల కోట్లు ఖర్చు చేసినట్టు శ్వేతపత్రంలో పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఖర్చును జనాభా ఆధారంగా తెలంగాణ వాటా కింద చూపి తప్పుడు లెక్కలు వేశారు. నిజంగా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కోసం అంత ఖర్చు చేస్తే.. 1969లో, 2001లో తొలి, మలి తెలంగాణ ఉద్యమాలు ఎందుకు వచ్చాయి? ఏ ప్రాంతంలో వచ్చిన ఆదాయాన్ని అక్కడే ఖర్చు చేయాలనే 1956 ఒప్పందానికి భిన్నంగా నాటి పాలకులు తెలంగాణలో వచ్చిన ఆదాయాన్ని ఇతర ప్రాంతాల్లో ఖర్చు చేశారు. అందుకే ప్రజలు తిరగబడ్డారు. తెలంగాణవాదుల ఆరోపణల్లో నిజానిజాలు తేల్చడానికి నాటి కేంద్ర ప్రభుత్వం పలు కమిటీలు వేసింది. ప్రభుత్వం నియమించిన జస్టిస్ లలిత్‌కుమార్ కమిటీ, జస్టిస్ వశిష్ట భార్గవ కమిటీ రెండూ కూడా తెలంగాణ ఆదాయాన్ని ఆంధ్రాలో వినియోగించారన్న సంగతి నిజమేనని తేల్చాయి. కాబట్టి తెలంగాణలో రూ.4.98 లక్షల కోట్లు ఖర్చు చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుండటం శుద్ధ అబద్ధం. వాళ్ల లెక్కలే చూసినా.. గత తొమ్మిదిన్నరేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.13,72,930 కోట్లు. అంటే వాళ్లు 60 ఏళ్లలో చేసిన ఖర్చుకు దాదాపు మూడింతల మేర బీఆర్ఎస్ సర్కారు పదేళ్లలోనే ఖర్చు చేసింది..’’అని కేటీఆర్ వెల్లడించారు. అస్తిత్వమే కాదు.. ఆస్తులు సృష్టించాం తెలంగాణ సిద్ధించిన తర్వాత నాటి పరిస్థితులన్నీ బేరీజు వేసుకొని ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ, ప్రణాళికాబద్ధంగా పాలన సాగించాం. ఎఫ్ఆర్బీఎం పరిమితి మేరకు అప్పులు తెచ్చి అన్ని రంగాలను అభివృద్ధి చేయడంతోపాటు వేల కోట్ల ఆస్తులు సృష్టించాం. ► విద్యుత్ రంగంలో పెట్టిన ఖర్చు రూ.1.37 లక్షల కోట్లు అయితే.. సృష్టించిన ఆస్తుల విలువ రూ.6.87 లక్షల కోట్లు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యేదాకా ఆమె సొంత గ్రామంలో విద్యుత్ లేదు. కానీ తెలంగాణలో కరెంటు లేని పల్లె, గూడెం లేవు. వచ్చే ఏడాది నాటికి రాష్ట్రం 26 వేల మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యానికి చేరుకుంటుంది. ► సాగునీటి రంగంలో రూ.1.76 లక్షల కోట్లు ఖర్చు చేశాం. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు చేశాం. 204 టీఎంసీల రిజర్వాయర్లు నిర్మించాం. కొత్తగా 50 లక్షల ఎకరాలకు సాగునీటితో ఆయకట్టును స్థిరీకరించాం. భూగర్భజలాలు పెరగడం వల్లే పదేళ్లలో బోర్లు కూడా పెరిగాయి. ► కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం. ఒక దగ్గర బ్యారేజీ కుంగితే మొత్తం ప్రాజెక్టునే బద్నాం చేసే ప్రయత్నం చేయొద్దు. పాలమూరు పథకానికి రూ.26,738 కోట్లు వెచ్చించాం. ► తాగునీటిని అందించేందుకు మిషన్ భగీరథకు రూ.37 వేల కోట్లు ఖర్చు చేశాం. వ్యవసాయ రంగంలో 24 గంటల ఉచిత విద్యుత్ కోసం రూ.36,899 కోట్లు, రుణమాఫీ కోసం రూ.30 వేల కోట్లు, రైతుబంధుకు రూ.75 వేల కోట్లు, రైతుబీమా ప్రీమియం కోసం రూ.6,861 కోట్లు వెచ్చించాం. ► సంక్షేమానికి రూ.2.86 లక్షల కోట్లు, పట్టణ ప్రగతికి రూ.1.21 లక్షల కోట్లు, పల్లెప్రగతికి రూ.70వేల కోట్లు, వైద్యరంగానికి రూ.61,650 కోట్లు, ఆధ్యాతి్మక రంగానికి రూ.2,800 కోట్లు ఖర్చు చేశాం. – గత తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణలో చేసిన అభివృద్ధితో రూ.50 లక్షల కోట్లపైనే సంపద సృష్టించాం. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాం ఇవాళ కొందరు నిర్బంధం, నియంతృత్వం అని మాట్లాడుతున్నారు. కానీ ఉద్యమ సమయంలోనే నిర్బంధం ఎదుర్కొన్నాం. నియంత పాలన అంటే సమైక్య పాలకులది. తెలంగాణ ఇస్తే అంధకారమే అని కట్టెలు పట్టుకొని కట్టుకథలు చెప్పినవారు, పెద్దపెద్ద మాటలు మాట్లాడినవారు, వారికి తొత్తులుగా పనిచేసినవారు ఇవాళ శ్వేతపత్రాల పేరుతో తెలంగాణను విఫల ప్రయోగంగా, విఫల రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పోరాడి తెచ్చిన తెలంగాణకు ఎవరి చేతుల్లో న్యాయం జరుగుతుందని ప్రజలు భావించారో ఆ కేసీఆర్ చేతుల్లోనే పెట్టారు. కేసీఆర్ సీఎంగా బాధ్యలు చేపట్టిననాడు ఎన్నో రకాల ఆర్థిక చిక్కులు, రాజకీయ కుట్రలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు ఒక విఫల ప్రయోగం, ఇదో విఫల రాష్ట్రమని నిరూపించే కుట్రలు జరిగాయి. విద్యుత్, తాగు, సాగునీటి సమస్యలు ముసురుకుని ఉన్నాయి. కొందరు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలు జరిగాయి. కానీ అన్నింటినీ తట్టుకుని తెలంగాణ పునరి్నర్మాణ యజ్ఞం జరిగింది. పటిష్ట ఆర్థిక క్రమశిక్షణతో ప్రణాళికలు రూపొందించుకొన్నాం. బిహార్‌లో ఉండే తెలంగాణ బిడ్డ జీఆర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా, కోలిండియా సీఎండీగా ఉన్న నర్సింగరావును సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రెటరీగా పెట్టుకొన్నాం. క్రమశిక్షణతో పరిపాలన సంస్కరణలకు పెద్దపీట వేస్తూ ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లాం. రాష్ట్ర తలసరి ఆదాయంలో, జీఎస్డీపీలో అనూహ్య ప్రగతి సాధించాం. అప్పులు కాదు.. వెలకట్టలేని ఆస్తులు సాధించాం. -
ఠాక్రేకు టీపీసీసీ వీడ్కోలు త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్న మున్షీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి బాధ్యతల నుంచి అధిష్టానం తప్పించిన నేపథ్యంలో మాణిక్ రావ్ ఠాక్రే తన సొంత రాష్ట్రా నికి వెళ్లిపోయారు. గోవా ఇన్ చార్జిగా నియమితులైన ఆయన కు ఆదివారం ఎమ్మెల్యే క్వార్ట ర్స్‌లో పలువురు టీపీసీసీ నేత లు కలిసి అభినందనలు తెలి పారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసి డెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఉపాధ్యక్షులు హర్కర వేణు గోపాల్, అంజన్‌కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, ఏఐసీసీ సభ్యుడు ఎం.ఎ.ఫహీం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు భూపతిరెడ్డి నర్సారెడ్డి, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఆయనను కలిసి వీడ్కోలు పలికారు. ఠాక్రేకు టీపీసీసీ పక్షాన జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలోనే మహారాష్ట్ర కు వెళ్లినట్టు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది. కొత్త ఇన్చార్జిగా నియమితులైన దీపాదాస్ మున్షీ త్వర లో బాధ్యతలు స్వీకరించనున్నట్టు సమాచారం. -
TS: ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రుల నియామకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ.. రాజకీయంగా పలు కీలక మార్పులు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా హైకమాండ్ నిర్ణయం మేరకు ఉమ్మడి పది జిల్లాకు ఇన్చార్జ్ మంత్రులను సీఎం రేవంత్‌రెడ్డి నియమించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఇన్చార్జ్ మంత్రుల జాబితాను ప్రకటించింది. ► కరీంగనర్ జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా ఉత్తమ్ కుమర్‌రెడ్డి ► మహబూబ్‌నగర్ జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా దామోదరం రాజనర్సింహ ► ఖమ్మం జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా కోమటిరెడ్డి వెంటకరెడ్డి ► వరంగల్ జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ► హైదరాబాద్ జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా పొన్నం ప్రభాకర్ ► మెదక్ జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా కొండా సురేఖ ► ఆదిలాబాద్ జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా ధనసరి అనసూయ (సీతక్క) ► నల్గొండ జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా తుమ్మల నాగేశ్వర రావు ► నిజామాబాద్ జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా జూపల్లి కృష్ణారావు ► రంగారెడ్డి జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా శ్రీధర్‌బాబును నియమించారు. చదవండి: ఖమ్మం ఎంపీ సీటు.. కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ ! -
ఐఏఎస్, ఐపీఎస్‌లకు సీఎం రేవంత్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం ముగిసింది. కాగా, ఈ సమావేశంలో భాగంగా సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం చాలా ఓపెన్ మైండ్‌తో ఉంది. అధికారులు ఇచ్చే సలహాలు, సూచనలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే, ప్రతీ ఒక్కరూ పని చేయాల్సిందే. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తప్పుకోవచ్చు.. పని విషయంలో ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇదే క్రమంలో అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్చను ఇస్తున్నట్టు తెలిపారు. అయితే, సమీక్ష సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే ప్రజా ప్రతినిధులు, అధికారులు జోడెద్దులుగా పనిచేయాలి. ప్రజా ప్రతినిధులు, అధికారులకు సమన్వయం లేకపోతే టార్గెట్ రీచ్ కాలేం. సచివాలయంలో ఏ నిర్ణయం తీసుకున్నా క్షేత్ర స్థాయిలో అమలు చేసే బాధ్యత ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లదే. ప్రజాపాలన పేరుతో గ్రామసభను నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక చేయాలి. నిస్సహాయులకు సహాయం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. అభివృద్ధి అంటే అద్ధాల మేడలు, రంగుల గోడలు కాదు. చివరి వరుసలో ఉన్న పేదవాడికి సంక్షేమం అందించే బాధ్యత అధికారులదే. గ్రామసభల్లో ప్రభుత్వ సందేశాన్ని ప్రజలకు అర్థం అయ్యేలాగా వినిపించాలి. అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమం అందించడమే మా లక్ష్యం. పోలీసులకు ఫ్రీడమ్.. అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్చ ఇస్తున్నాం. భూకబ్జాదారులపై కఠినంగా వ్యవహరించాలి. భూకబ్జా అనే పదం రాష్ట్రంలో వినిపించకూడదు. బుక్ మై షో, సన్‌బర్న్ నిర్వహణపైన పోలీసులు నిఘా పెట్టి అసలు విషయాలు తేల్చాలి. సన్‌బర్న్ ఈవెంట్‌ను మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు నిషేధించాలి. వీటి వెనకాల ఎవరున్నా వదిలిపెట్టకండి. గంజాయిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. గంజాయి విస్తరణ కాలేజీలకు చేరింది.. పోలీసులు వీటిపై నిఘా పెట్టాలి. నకిలీ విత్తనాల సరఫరాపై నిఘా పెట్టాలి. నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా చర్యలు తీసుకోవాలి. ప్రతీ ఒక్కరికీ బాధ్యత అవసరం.. జిల్లాలకు మంత్రులు, ప్రతీ సెగ్మెంట్‌కు స్పెషల్ ఆఫీసర్ నియామకం. గ్రామ సభల్లో ప్రభుత్వ సందేశాన్ని ప్రజలకు అర్థం అయ్యే విధంగా వినిపించాలి. అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమం అందించడమే మా లక్ష్యం. మాతో పనిచేయడానికి అధికారులు ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వెంటనే సీఎస్, డీజీపీకి చెప్పి తమ బాధ్యతల నుంచి తప్పుకోవచ్చు. బాధ్యత తీసుకున్న ప్రతీ అధికారి వారి బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వర్తించాల్సిందే. రోజుకు 18 గంటలు పని చేయండి అని సూచించారు. ఫ్రెండ్లీ ప్రభుత్వమే కానీ.. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి గ్రామ సభలపై సమీక్షలు ఉంటాయి. ప్రభుత్వం చాలా ఓపెన్ మైండ్‌తో ఉంది. అధికారులు ఇచ్చే సలహాలు, సూచనలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎస్ఆర్ శంకర్‌ను ఆదర్శంగా తీసుకుని ప్రతీ ఒక్క అధికారి విధులను నిర్వర్తించాలి. మాది ఫ్రెండ్లీ గవర్నమెంట్ ప్రజల చేత ఫ్రెండ్లీగా ఉన్నంతవరకే ఫ్రెండ్లీ గవర్నమెంట్. అధికారులు సంక్షేమం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అధికారులు ప్రజల మనసును గెలిచి మంచి పేరు తెచ్చుకోవాలి. అధికారులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎక్కడైనా పని చేయగలను అన్న ఆలోచనలో ఉండాలి. అధికారులకు మానవీయ కోణం అనేది ఉండాలి. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతోమంది అమరులయ్యారు. తెలంగాణ ప్రజల డీఎన్ఏ స్వేచ్ఛను హరిస్తే సహించదు. ప్రజల స్వేచ్ఛను హరిస్తే ఎంతటి వారైనా ఇంటికి పోవాల్సిందే. ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం కలిగేలా మనందరం కలిసి పని చేద్దాం అని సూచించారు. -
Khammam: ఎంపీ సీటుకు కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ !
సాక్షి, ఖమ్మం : అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత కాంగ్రెస్ నాయకులు లోక్‌సభ ఎన్నికలకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం ఎంపీ సీటుకు పోటీ తీవ్రంగా ఉంది. గత మూడు అసెంబ్లీ ఎన్నికల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీకి ఒక్కో ఎమ్మెల్యే సీటే దక్కుతోంది. ఒక్కటి మినహా మిగిలిన అసెంబ్లీ సీట్లన్నీ కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. దీంతో ఖమ్మం ఎంపీ సీటు కోసం డిమాండ్ బాగా పెరిగింది. మరి కాంగ్రెస్ గ్యారెంటీగా గెలుస్తామంటున్న ఖమ్మం సీటు కోసం పోటీ పడుతున్న నేతలెవరు? అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా లో పది స్థానాల్లో సీపీఐ పోత్తుల్లో భాగంగా తొమ్మిది సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. రేవంత్‌రెడ్డి కేబినెట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే అత్యధికంగా ముగ్గురు మంత్రులయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో మెజార్టీ స్థానాలు రావడంలో కీలకంగా వ్యవహరించారు. కాంగ్రెస్ నెక్స్ట్ టార్గెట్ లోకసభ ఎన్నికలే..తెలంగాణలో 12 నుంచి 14 ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం ఒక ఎత్తైయితే కీలకమైన లోకసభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించడం కూడా అంతే కీలకం. దీంతో అభ్యర్థుల వేటలో కూడికలు తీసివేతలు ప్రారంభించారు కాంగ్రెస్ నాయకులు. ఖమ్మం జిల్లాలో ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్‌లో అప్పుడే పోరు మొదలైంది. జిల్లాలోనే కీలక నేతగా ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి టికెట్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. ప్రసాద్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా పనిచేశారు. పాలేరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి భారీ మోజార్టీ రావడం వెనుక ప్రసాద్ రెడ్డి పాత్ర కీలకమనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా పనిచేసినందున లోక్ సభ ఎన్నికల్లో సీటు కోసం ప్రసాద్‌రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. జిల్లాలోని మంత్రులు, ఇతర ఎమ్మెల్యేల మద్దతు కూడా ప్రసాద్‌రెడ్డికి ఉందని అంటున్నారు. పైగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని పాలేరు, ఖమ్మం, మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో మంచి పట్టు సాధించారనే టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే మాజీ కేంద్రమంత్రి, గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఖమ్మం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన రేణుకా చౌదరి సైతం ఎంపీ టికెట్ కోసం పట్టుపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఎంపీ టికెట్ తనకే ఇస్తామని అధిష్టానం భరోసా ఇచ్చిందని ఆమె చెప్పుకుంటున్నారట. ఇప్పటికే తన టిక్కెట్ విషయంపై రేణుకా చౌదరి చెప్పాల్సిన వారికి చెప్పుకున్నారట. వీరిద్దరితో పాటు మరో ఇద్దరు నేతలు సైతం ఎంపీ టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. ఇదిలా ఉంటే లోకసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య రసవత్తరమైన పోటీ ఉండే అవకాశం ఉంది. అయితే ఖమ్మంలో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే పోటీ ఉండనుంది..అధికార పార్టీ అవడంతో కాంగ్రెస్‌లో టిక్కెట్ కోసం పోటీ తీవ్రంగానే ఉంది. మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎవరికి అవకాశం ఇస్తుందో చూడాలి. ఇదీచదవండి..బీర్లు, లిక్కర్ విక్రయాల్లో పరకాల టాప్ -
TS: ‘స్వేద’పత్రం.. కేటీఆర్ కీలక ప్రజెంటేషన్
సాక్షి,హైదరాబాద్: అసెంబ్లీలో ఉద్దేశ్యపూర్వకంగా తమపై బురద జల్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అయినా మాజీ మంత్రులు జగదీష్‌రెడ్డి, హరీశ్‌రావు తాను ధీటుగా ఎదుర్కొన్నామని చెప్పారు. ప్రభుత్వ శ్వేతపత్రాలకు కౌంటర్‌గా ఆదివారం ఉదయం తెలంగాణ భవన్లో స్వేద పత్రం విడుదల చేసే సందర్భంగా కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.50 లక్షల కోట్ల సంపద సృష్టించినట్లు చెప్పారు. ‘అసెంబ్లీలో పూర్తిస్థాయిలో మాకు మాట్లాడే అవకాశమివ్వకపోయినా మేం ఇచ్చిన సమాధానాలకు ప్రభుత్వం పారిపోయింది. బీఆర్ఎస్ పాలనలో మూడు లక్షల కోట్లు మాత్రమే అప్పు చేస్తే దానిని 6 లక్షల 71 వేల కోట్లుగా ప్రభుత్వం చూపించింది. ప్రభుత్వ శ్వేతపత్రాలన్నీ తప్పుల తడకలు. తొమ్మిదేళ్లలో రక్తాన్ని రంగరించి రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడిపాం. విధ్వంసం నుంచి వికాసం వైపు సంక్షోభం నుంచి సంక్షేమం వైపు తీసుకెళ్లాం’ అని కేటీఆర్ తెలిపారు. 60 ఏళ్ల గోస 10 ఏళ్లలో మాయం చేసి చూపించాం. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం చేసిన కాంగ్రెస్ నాయకులు మరొకసారి శ్వేతపత్రాల పేరుతో మోసం చేయాలని చూస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో సంక్షేమం, కరెంటు,వ్యవసాయం, చెరువులు, పల్లె,పట్టణ ప్రగతి లాంటి అంశాలను ప్రాధాన్య క్రమంలో తీసుకుని పనిచేశాం.రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణం ప్రారంభించాం. దీని ఫలితంగానే తొమ్మిదేళ్లలో తెలంగాణ తలసరి ఆదాయం డబుల్ అయిందని’అని కేటీఆర్ వివరించారు. విద్యుత్, సాగునీరు,తాగునీరు రంగాల్లో బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో పెట్టిన పెట్టుబడులు, చెమటోడ్చి సృష్టించిన ఆస్తులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వడ్డించిన విస్తరి. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతం. కాలువలు కడితే 200 టీఎంసీల నీళ్లు పొలాల్లో పారేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాళేశ్వరంలోని చిన్న మేడిగడ్డ బ్యారేజ్‌లో ఏదో తప్పు జరిగిందని నిందిస్తున్నారు. ఎలాంటి విచారణకైనా సిద్ధం’అని కేటీఆర్ అన్నారు. ఇదీచదవండి..లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్! -
TS: కలెక్టర్లతో భేటీ.. సీఎం కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి తొలిసారి కలెక్టర్లతో సమావేశమయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ పధాన కార్యదర్శి శాంతికుమారి, తదితర ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు ఎస్పీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి ప్రారంభోపన్యాసం చేశారు. కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘ఈనెల 28 నుంచి 6 వ తేదీ వరకు రాష్ట్రంలో ప్రజాపాలన నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులలో గ్రామ సభలు నిర్వహిస్తాం. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం.2 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభలు నిర్వహిస్తాం’అని తెలిపారు. ప్రజా పాలనను అందించడంపైనే ఈ సమావేశంలో ప్రధానంగా సీఎం కలెక్టర్లతో చర్చిస్తున్నారు. జనవరి నెలాఖరు వరకు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున ఆరు గ్యారెంటీలను వీలైనంత త్వరగా అమలు చేసే విషయంలో సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదీచదవండి..ఆసక్తి రేపుతున్న బీఆర్ఎస్ ‘స్వేద పత్రం’.. కాసేపట్లో రిలీజ్ -
TS: బీఆర్ఎస్ ‘స్వేద పత్రం’లో ఏముంది?
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ రిలీజ్ చేయనున్న స్వేద పత్రం ఆసక్తి రేపుతోంది. తమ తొమ్మిదేళ్ల తమ పాలనలో తెలంగాణలో అభివృద్ధి చేసిన ఆస్తులు, అప్పులపై గులాబీ పార్టీ కాసేపట్లో స్వేదపత్రం పేరిట వైట్‌పేపర్ రిలీజ్ చేయనుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషేన్ ద్వారా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస్తులు, అప్పులను వివరించనున్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలకు కౌంటర్‌గా బీఆర్ఎస్ ఈ స్వేద పత్రం విడుదల చేయనుంది. తొమ్మిదేళ్లలో ప్రభుత్వంలో తాము,తెలంగాణప్రజలు కలిసి చెమటోడ్చి ఆస్తులు సృష్టించుకున్నందునే వైట్‌పేపర్‌కు స్వేదపత్రం అని పేరు పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆస్తుల సృష్టికే అప్పులు చేశామని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకే ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. నిజానికి శనివారమే స్వేదపత్రం రిలీజ్ చేస్తామని ప్రకటించినప్పటికీ కేటీఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా కార్యక్రమానికి నేటికి వాయిదా వేశారు. స్వేదపత్రం రిలీజ్ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలు పలువురు హాజరవనున్నారు. ఇదీచదవండి..లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్! -
లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్!
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో ఎదురైన ప్రతికూల ఫలితాలను అన్ని కోణాల్లో పోస్ట్‌మార్టం చేస్తున్న భారత రాష్ట్ర సమితి త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల ప్రణాళికపై దృష్టి సారించింది. శస్త్రచికిత్స అనంతరం హైదరాబాద్‌లోని తన నివాసంలో కోలుకుంటున్న పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడం ద్వారా రెండు జాతీయ పార్టీలపై పైచేయి సాధించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వైపు ఎన్ని కల సన్నద్ధతను వేగవంతం చేస్తూనే, మరోవైపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపైనా దృష్టి సారించారు. సిట్టింగ్‌లలో కొందరికే టికెట్లు ప్రస్తుతం లోక్‌సభలో బీఆర్ఎస్కు తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు. అందులో దుబ్బాక ఎమ్మెల్యేగా ఎన్నికైన కొత్త ప్రభాకర్‌రెడ్డి తన మెదక్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. మిగతా ఎనిమిది మందిలో తిరిగి ఎందరికి టికెట్ దక్కుతుందనే అంశంపై పార్టీలో చర్చ జరుగుతోంది. సిట్టింగ్ ఎంపీల్లో రంజిత్‌రెడ్డి (చేవెళ్ల), నామా నాగేశ్వర్రావు (ఖమ్మం) మినహా మిగతా ఆరుగురు.. పి.రాములు (నాగర్‌కర్నూల్), ఎం.శ్రీనివాస్‌రెడ్డి (మహబూబ్‌నగర్), దయాకర్ (వరంగల్), కవిత మాలోత్ (మహబూబాబాద్), బీబీ పాటిల్ (జహీరాబాద్), వెంకటేశ్ నేత (పెద్దపల్లి)లలో ఎవరికి టికెట్ కచ్చితంగా దక్కుతుందని కచ్చితంగా చెప్పలేమని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. వారిని మార్చే క్రమంలో కొత్తగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే కోణంలో కసరత్తు జరుగుతోందని అంటున్నాయి. గత ఎన్నికల్లో ఓడిన సీట్లపై పరిశీలన గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలైన కల్వకుంట్ల కవిత (నిజామాబాద్), బోయినపల్లి వినోద్‌కుమార్ (కరీంనగర్), గోడెం నగేశ్ (ఆదిలాబాద్)లకు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. కవిత, వినోద్‌కుమార్ ఇప్పటికే ఎన్నికల కోసం సన్నద్ధతను ప్రారంభించారు. గత ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలైన బూర నర్సయ్యగౌడ్ (భువనగిరి) బీజేపీలో చేరడంతో.. అక్కడ జిట్టా బాలకృష్ణారెడ్డి, దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి గతంలో పోటీచేసి ఓటమి పాలైన మర్రి రాజశేఖర్‌రెడ్డి ఇటీవల మల్కాజిగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థిగా బీఆర్ఎస్ ఎవరికి చాన్స్ ఇస్తుందన్నది ఆసక్తిగా మారింది. సికింద్రాబాద్ సీటు నుంచి గత ఎన్నికల్లో పోటీచేసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్‌కు మళ్లీ అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. నల్గొండ నుంచి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఆయన కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఒక్కసారీ గెలవని స్థానాలపై నజర్ బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు నల్గొండ, మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్‌సభ స్థానాల్లో ఒక్కసారి కూడా గెలవలేదు. హైదరాబాద్‌లో మిత్రపక్షమైన ఎంఐఎంతో స్నేహపూర్వక పోటీచేస్తూనే మిగతా చోట్ల గెలుపు అవకాశాలను బీఆర్ఎస్ బేరీజు వేసుకుంటోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు సెగ్మెంట్లలోనూ బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోనూ నాంపల్లి మినహా మిగతా ఆరు చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు చోట్ల బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. జాతీయ పార్టీల నేతలు పోటీ చేస్తే? రాష్ట్రం నుంచి ప్రధాని మోదీని పోటీ చేయాల్సిందిగా బీజేపీ.. సోనియాను పోటీ చేయాల్సిందిగా కాంగ్రెస్ కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీల అగ్రనేతలు రాష్ట్రం నుంచి బరిలోకి దిగితే ఎదురయ్యే పరిణామాలు, ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహంపై బీఆర్ఎస్ పరిశీలన జరుపుతోందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు పార్టీ ఎంపీలతో విడివిడిగా భేటీ అవుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో పోటీకి ఎవరెవరు ఎంతమేర సన్నద్ధంగా ఉన్నారనే వివరాలు సేకరిస్తున్నారని అంటున్నాయి. -
ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలి
సాక్షి, హైదరాబాద్ / న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధమై తెలంగాణ నుంచి అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకునే దిశగా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలని రాష్ట్ర పార్టీకి బీజేపీ జాతీయనాయకత్వం దిశానిర్దేశం చేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమీక్ష సందర్భంగా...కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లను బీజేపీ కైవసం చేసుకోవడం, పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌ను నిలబెట్టుకోవడం జాతీయ రాజకీయాల్లో శుభ పరిణామమని పేర్కొంది. కేంద్రంలో మోదీ పదేళ్ల పాలనపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సానుకూల పవనాలు వీచే అవకాశాలున్నందున, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి విజయకేతనం ఎగరవేసి వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని బీజేపీ సొంతం చేసుకుంటుందనే ధీమా వ్యక్తం చేసింది. లోక్‌సభ ఎన్నికల కల్లా తెలంగాణలోనూ అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు రాకపోయినా ఓటింగ్ శాతం పెరగడంతో.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముందు నుంచి పార్టీ ఆశించిన స్థాయిలో కాకపోయినా 8 సీట్లలో గెలిచి 30 లక్షలకు పైగా ఓట్లతో 14 శాతం ఓటింగ్ సాధించడం సానుకూల పరిణామం అనే అభిప్రాయాన్ని ఢిల్లీ నాయకత్వం వ్యక్తం చేసినట్టు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో ఈ 14 శాతం ఓటింగ్‌ను గణనీయంగా పెంచుకుని, తొమ్మిది లేదా పది ఎంపీ సీట్లు గెలుచుకునే దిశలో పకడ్బందీ వ్యూహాలతో ముందుకెళ్లాలని జాతీయనాయకత్వం సూచించినట్టు తెలుస్తోంది. శుక్ర, శనివారాల్లో ఢిల్లీలో జరిగిన జాతీయ పదాధికారుల సమావేశంలో ఆయా అంశాలు చర్చకు వచ్చినట్టు పార్టీ వర్గాల సమాచారం లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామన్న కిషన్‌రెడ్డి ఈ భేటీలో తెలంగాణ నుంచి కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, జాతీయ కార్యవర్గసభ్యుడు, తమిళనాడు సహ ఇన్చార్జి పొంగులేటి సుధాకరరెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసి.. పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేసే దిశగా జరిగిన చర్చా కార్యక్రమంలో కిషన్‌రెడ్డి ప్రసంగించారు. వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం అన్ని విధాలుగా సమాయత్తమవుతున్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం కోసం చర్యలు కొనసాగిస్తున్నామని, అవసరమైన చోట్ల సమీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా జాతీయనాయకత్వానికి కిషన్‌రెడ్డి ఓ నివేదిక సమరి్పంచినట్టు పార్టీవర్గాల సమాచారం బీసీ నినాదం ఫలించకపోవడంపై విశ్లేషణ జరగాలంటూ.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ తీసుకున్న బీసీ నినాదం, అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎం చేస్తామనడం, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు జాతీయనాయకత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం మద్దతు తెలిపినా పార్టీకి ఓట్లు, సీట్ల పరంగా ప్రయోజనం చేకూరకపోవడంపై లోతైన విశ్లేషణ జరగాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీ బలంగా ఉందని భావించిన గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, తదితర చోట్ల ఊహించని విధంగా బీజేపీకి ఎదురుదెబ్బ తగలడం వల్లనే 8 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చిందని పేర్కొన్నట్టు తెలిసింది. 28న రాష్ట్రానికి అమిత్ షా! లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రపార్టీని పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసి దిశానిర్దేశం చేసేందుకు ఈ నెల 28న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాష్ట్రానికి రానున్నట్టు పార్టీవర్గాల సమాచారం. రాష్ట్రంలోని పార్టీ మండల శాఖ అధ్యక్షులు మొదలు రాష్ట్రస్ధాయి నేతల వరకు హాజరయ్యే కీలక సమావేశానికి ఆయన రానున్నట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమీక్షతో పాటు, వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలి, ఏయే అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి, ఎలాంటి వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళికలతో ముందుకెళ్లాలనే దానిపై రాష్ట్ర పార్టీ నేతలకు అమిత్‌షా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. -
ఠాక్రే ట్రాన్స్ఫర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న మాణిక్‌రావ్ ఠాక్రేను ఆ బాధ్యతల నుంచి పార్టీ అధిష్టానం తప్పించింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం, ప్రభుత్వ ఏర్పాటుతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఇది కలకలం రేపింది. పార్టీ బాధ్యతల మార్పు అంశం మామూలే అయినా.. ఏడాది పాటు శ్రమించి తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషిచేసిన ఠాక్రేను.. అధికారం దక్కిన తర్వాత 20 రోజులకే తప్పించడం, వేరే రాష్ట్రానికి పంపడంపై టీపీసీసీ నేతల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు రాష్ట్ర ఇన్చార్జిని మార్చడంతో.. పార్టీకి సంబంధించి కీలక సమావేశాలన్నీ వాయిదాపడ్డాయి. టార్గెట్ పూర్తయిందనే..! ఠాక్రే మార్పు వెనుక ప్రత్యేక కారణమేమీ లేదని గాందీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఆయనను తెలంగాణకు పంపిన టార్గెట్ అయిపోయిందని, అందుకే ఇప్పుడు మరో రాష్ట్రానికి పంపారని.. అది కూడా ఆయన సొంత రాష్ట్రమైన మహారాష్ట్రకు దగ్గరగా ఉండే గోవాకు పంపారని అంటున్నాయి. అయితే ఠాక్రే మాత్రం ఆవేదనతో గాం«దీభవన్ నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. శనివారం సాయంత్రం అధిష్టానం ఈ నిర్ణయం ప్రకటించిన సమయంలో ఠాక్రే గాందీభవన్‌లోనే ఉన్నారు. డిసెంబర్ 28న పార్టీ వ్యవస్థాపక దినోత్సవం నేపథ్యంలో నాగ్‌పూర్‌లో జరిగే సభకు జనసమీకరణపై మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ నేతలతో చర్చిస్తున్నారు. ఇన్చార్జి మార్పు విషయం తెలియడంతో ఉన్నట్టుండి సమావేశం నుంచి వెళ్లిపోయారని.. దీంతో నేతలు ఆందోళనకు గురయ్యారని తెలిసింది. కీలక సమయంలో మార్పు ఏమిటి? ఠాక్రే స్థానంలో దీపాదాస్‌మున్షీకి బాధ్యతలు అప్పగించారు. ఆమెను కేరళ, లక్షద్వీప్‌లకు పూర్తిస్థాయి ఇన్చార్జిగా నియమించగా.. అదనంగా తెలంగాణ బాధ్యతలు ఇస్తున్నట్టు ఏఐసీసీ ప్రకటించింది. దీనిపై టీపీసీసీ నేతల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ‘‘రాష్ట్రంలో ఇటీవలే అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పార్టీ నేతల మధ్య సమన్వయం చేయాల్సిన, అధిష్టానానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యతలు రాష్ట్ర ఇన్చార్జికి ఉంటాయి. ఇలాంటి కీలక సమయంలో ఇన్చార్జి బాధ్యతలను అదనంగా వేరే రాష్ట్ర ఇన్చార్జులకు అప్పగించడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది అంతుపట్టడం లేదు..’’అని వారు పేర్కొంటున్నారు. అయితే త్వరలోనే రాష్ట్రానికి కొత్త రెగ్యులర్ ఇన్చార్జిని నియమిస్తారని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. ఏడాది కూడా కాకుండానే.. కాంగ్రెస్ అధిష్టానం పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జిగా మాణిక్‌రావ్ ఠాక్రేను ఈ ఏడాది జనవరి 4న నియమించింది. వెంటనే రంగంలోకి దిగిన ఠాక్రే అలుపెరగకుండా పనిచేశారు. పూర్తిగా హైదరాబాద్‌లోనే మకాం వేసిన ఆయన.. తన సహ కార్యదర్శులతో కలసి టీపీసీసీ నాయకత్వాన్ని సమన్వయం చేసుకుంటూ, అధిష్టానంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ముందుకెళ్లారు. ఎన్నికల ఎపిసోడ్‌ను విజయవంతంగా ముగించారు. తాను ఇన్చార్జిగా ఉన్న రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో హుషారుగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ బాధ్యతల నుంచి తప్పించడంతో ఆయన అసంతృప్తికి గురైనట్టు తెలిసింది. గతంలో రాష్ట్ర ఇన్చార్జిగా ఉన్న మాణిక్యం ఠాగూర్‌ను అధిష్టానం గోవాకు ఇన్చార్జిగా పంపింది. ఇప్పుడు ఠాక్రేను కూడా గోవా ఇన్చార్జిగానే నియమించడం గమనార్హం. గోవా ఇన్చార్జిగా ఉన్న ఠాగూర్‌కు ఆంధ్రప్రదేశ్ బాధ్యతలను అప్పగించారు. కీలక సమావేశాలు వాయిదా! పార్టీ ఇన్చార్జి మార్పు నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ కీలక సమావేశాలు వాయిదాపడ్డాయి. నిజానికి శనివారమే పార్టీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. వాటికి హాజరుకావాల్సిన నేతలకు సమాచారం ఇచ్చింది. కానీ వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ఆదివారం ఉదయం రెండు సమావేశాలు జరుగుతాయని.. వాటికి సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా హాజరవుతారని టీపీసీసీ నుంచి నేతలకు సమాచారం వెళ్లింది.కానీ కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్ నేపథ్యంలో సమయం మార్చారు. ఆదివారం సాయంత్రం 3.30 గంటలకు గాంధీభవన్‌లోని ప్రకాశం హాల్లో మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల సమావేశం జరుగుతుందని.. డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల కార్యవర్గాలు, అధికార ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకావాలని సూచించారు. ఇక సాయంత్రం 4:30 గంటలకు ఇందిరా భవన్లో టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశం ఉంటుందని.. రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ), ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సభ్యులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర మంత్రులు, ఎన్ఎస్యూఐ, యూత్, మహిళా, ఎస్సీ సెల్ అధ్యక్షులు హాజరుకావాలని కోరారు. కానీ ఠాక్రే మార్పు నేపథ్యంలో ఈ సమావేశాలు వాయిదా పడ్డాయి. జనవరి మొదటి వారంలో వీటిని నిర్వహిస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడించారు. -
పీవీని ‘భారత రత్న’తో గౌరవించాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నేడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ నేతలు పీవీ ఘాట్ వద్ద ఆయనకు నివాళులు అర్పించారు. ఈ క్రమంలో దేశానికి పీవీ చేసిన సేవలను ప్రశంసించారు. ఇక, పీవీ ఘాట్ వద్ద మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..‘తెలుగు వారికి, తెలంగాణకు, భారత దేశానికి వన్నె తెచ్చిన నేత పీవీ నర్సింహారావు. ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌తో కలిసి అప్పుల్లో కూరుకుపోయిన భారత్‌ను గాడిలో పెట్టి తన వంతుగా దేశానికి సేవలు అందించారు. ఆయన ఆదర్శాలకు అనుగుణంగా పనిచేయాలి. ఢిల్లీలో పీవీ ఘాట్‌ను నిర్మించాలి. భారతరత్న ఇచ్చి పీవీని గౌరవించాలి. పీవీ విషయంలో కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని సరిదిద్దాలని కేంద్రాన్ని కోరుతున్నాం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం డిమాండ్ చేశామో ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాం’ అని వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా పీవీ ఘాట్‌లో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ..‘దేశం ఆర్థికంగా కుంగిపోయిన సమయంలో ఆయన సంస్కరణలు దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టాయి. పీవీని కాంగ్రెస్ పార్టీ మరిచిపోయింది. పీవీకి సముచిత స్థానం ఇవ్వలేదన్న కేసీఆర్.. ఆయన వర్థంతి సభకు బీఆర్ఎస్ రాకపోవడం బాధాకరం’ అని విమర్శించారు. -
కేటీఆర్ ‘స్వేద పత్రం’ వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు శ్వేత పత్రం వర్సెస్ స్వేద పత్రంతో వేడెక్కాయి. శాసనసభ వేదికగా రెండు రోజుల పాటు కాంగ్రెస్ సర్కారు విడుదల చేసిన శ్వేతపత్రాలపై కౌంటర్‌గా బీఆర్ఎస్ తన వాదన వినిపించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు సిద్ధం అవ్వగా.. ఇవాళ్టి ఆ కార్యక్రమం వాయిదా పడింది. శనివారం ఉదయం తెలంగాణ భవన్ వేదికగా కేటీఆర్ గత తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణ సాగించిన ప్రగతి ప్రస్థానం పేరిట పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు సిద్ధమని ప్రకటించారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే.. చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలియదు.. కార్యక్రమం వాయిదా పడింది. ఆదివారం ఆ కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. అయితే వాయిదాకి గల కారణం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. తెలంగాణలో బీఆర్ఎస్ పాలన సువర్ణ అధ్యాయమని.. దానికోసం తమ ప్రభుత్వం చిందించిన చెమటను ప్రజలకు వరించేందుకే ‘స్వేద పత్రం’పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నామని మాజీ మంత్రి కేటీఆర్ చెబుతున్నారు. తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం పగలూ రాత్రి తేడా లేకుండా.. రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన.. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం.. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం.. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే… — KTR (@KTRBRS) December 22, 2023 -
పీవీపై సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: దేశ మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు 19వ వర్థంతి నేడు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు పలువురు రాజకీయ నేతలు నివాళులర్పిస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పీవీ జ్ఞాన భూమి వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిష్ణాతుడైన పండితుడు, రాజనీతిజ్ఞుడు, పరిపాలదక్షకుడు.. తెలంగాణ గడ్డ మీద పుట్టిన గొప్ప బిడ్డ అని పీవీని కొనియాడారామె. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా ఆయన వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు పీవీ జ్ఞాన భూమి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రశ్నార్ధకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. బంగారాన్ని కుదవ పెట్టి అప్పులు తేవడంపై ఆయన ఒకే మాట చెప్పారు. తెలివైన వాడు సగం ఆస్తిని కుదవపెట్టి అయినా సరే మిగతా ఆస్తిని కాపాడుకుంటారని ఆయన అన్నారు. భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి పీవీ. పేదలకు భూములు పంచడానికి పీవీ బలమైన పునాదులు వేశారు. పీవీ మన మధ్య లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయం. పీవీ ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్ లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వీరిద్దరూ తెలంగాణకు లంకె బిందెల్లాంటి వారు. పీవీ కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది’’ అని అన్నారు. ఇక ఢిల్లీ పర్యటలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి.. అక్కడి తెలంగాణ భవన్లో జరిగిన పీవీ వర్ధంతి కార్యక్రమానికి హాజరయ్యారు. మాజీ ప్రధాని పీవీ. నరసింహారావు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ కూడా పాల్గొన్నారు. భారత ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పీవీని అభివర్ణిస్తూ.. దేశానికి ఆయన అందించిన సేవల్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఉంచింది. On his death anniversary, we pay tribute to the former Prime Minister of India, PV Narasimha Rao. Often remembered as the 'Father of Indian Economic Reforms', who revolutionised the Indian economy, we honour him for his exceptional contributions to the nation. pic.twitter.com/sHD7W01XO0 — Congress (@INCIndia) December 23, 2023 As we observed the 19th death anniversary of former Prime Minister Shri.PV Narasimha Rao Garu,paid floral tributes to him at #Hyderabad. A great son of #Telangana Soil, he's an erudite scholar,a statesman & administrator par excellence.#PVNarasimhaRao pic.twitter.com/atAOi8HkSk — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) December 23, 2023 దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 19వ వర్ధంతి సందర్భంగా పీవీ జ్ఞాన భూమి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించిన సీఎం శ్రీ @revanth_anumula గారు మరియు మంత్రులు. pic.twitter.com/b6Z7w1XHHN — Telangana Congress (@INCTelangana) December 23, 2023 -
నేడు బీఆర్ఎస్ ‘స్వేద పత్రం’
సాక్షి, హైదరాబాద్: శాసనసభ వేదికగా రెండు రోజుల పాటు కాంగ్రెస్ సర్కారు విడుదల చేసిన శ్వేతపత్రాలపై తమ వాదన వినిపించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. తమ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణ సాగించిన ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయమని.. దానికోసం తమ ప్రభుత్వం చిందించిన చెమటను ప్రజలకు వివరించేందుకు ‘స్వేద పత్రం’పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. శనివారం ఉదయం 11 గంటలకు పార్టీ కార్యాలయం తెలంగాణభవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి కేటీఆర్ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ‘‘పగలూరాత్రీ తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయతి్నస్తే భరించం. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోం. అందుకే గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించేందుకు.. అప్పులు కాదు, తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు ‘స్వేద పత్రం’విడుదల చేస్తున్నాం’’అని ప్రకటించారు. వాస్తవాలను వివరించేందుకే.. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో స్పందించేందుకు అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పీకర్‌కు లేఖ రాయడం తెలిసిందే. అయితే అధికార కాంగ్రెస్ పక్షం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్కు అవకాశం దక్కలేదు. ఈ క్రమంలో శ్వేతపత్రాలపై అసెంబ్లీలో బుధ, గురువారాల్లో చర్చ సందర్భంగా ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరించి తమపై బురద జల్లేందుకే ప్రయత్నించిందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. తాము వివరణలు కోరినా సమాధానాలు రాలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ వేదికగా ‘స్వేద పత్రం’ పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్తున్నారు. అంశాలన్నింటినీ క్రోడీకరించి.. అసెంబ్లీలో శ్వేతపత్రాలపై చర్చ సమయంలోనే.. ‘పదేళ్లలో సృష్టించిన ఆస్తులు’, ‘ఫ్యాక్ట్ షీట్’పేరిట రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై బీఆర్ఎస్ రెండు నివేదికలను విడుదల చేసింది. ఇప్పుడు వాటిలోని అంశాలను క్రోడీకరించడంతోపాటు రంగాల వారీగా మరిన్ని వివరాలు జోడిస్తూ.. ‘స్వేద పత్రం’ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. -
48 ఎంపీ స్థానాల్లో పోటీ
సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయిలో పార్టీ కార్యకలాపాల విస్తరణ ప్రణాళికలు కొనసాగించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. అందులో భాగంగానే వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. తెలంగాణతోపాటు పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని 48 స్థానాల్లోనూ బరిలో దిగేందుకు సిద్ధమైంది. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉనికి చాటిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల లక్ష్యంగా కార్యకలాపాలు వేగవంతం చేయాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశించారు. తుంటి ఎముక శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న ఆయన త్వరలోనే మహారాష్ట్ర బీఆర్ఎస్ కీలక నేతలతో భేటీ కానున్నారు. మహారాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ కల్వకుంట్ల వంశీధర్‌రావు నిరంతరం అక్కడి నేతలతో సమన్వయం చేస్తూ స్థానికంగా సభలు, సమావేశాలు కొనసాగేలా చూస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఫలితాల తర్వాత లాతూరులో పదివేల మందితో సభ నిర్వహించిన బీఆర్ఎస్, ఈ నెల 30న కొల్హాపూర్‌లోనూ బహిరంగసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తర్వాత షోలాపూర్, ఔ రంగాబాద్, వార్దా, బీడ్లోనూ సభలు ఉంటాయని మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో చురుగ్గా కమిటీలు డిసెంబర్ మొదటివారంలో మహారాష్ట్రలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో 200కు పైగా సర్పంచ్, వార్డు సభ్యుల పదవులను బీఆర్ఎస్ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. నాగపూర్, ఔరంగాబాద్ (శంభాజీనగర్), వార్దా, బీడ్, సతారా, కొల్హాపూర్, సాంగ్లి, షోలాపూర్ తదితర జిల్లాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ ఏడాది జూన్‌లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టగా, మహారాష్ట్ర వ్యాప్తంగా 20లక్షలకు పైగా మంది క్రియాశీల సభ్యులుగా నమోద య్యారు. సంస్థాగతంగా 48 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోనూ పార్టీ ప్రధాన, అనుబంధ కమిటీల ఏర్పాటు పూర్తయ్యింది. ఇప్పటికే నాగపూర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించి కార్యకలాపాలు సాగుతుండగా, త్వరలో పుణే, ఔరంగాబాద్‌లోనూ పార్టీ సొంత కార్యాలయాలు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలంగాణకు సరిహద్దుగా ఉన్న విదర్బ, మరాఠ్వాడా ప్రాంతంలో బీఆర్ఎస్ పట్ల ఆదరణ పెరిగిందని పార్టీ అంచనా వేస్తోంది. తెలంగాణ ఓటమితో సానుభూతి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మహారాష్ట్రలో బీఆర్ఎస్ పట్ల సానుభూతి పెరిగిందని మహారాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు మాణిక్ కదమ్ ‘సాక్షి’కి వెల్లడించారు. ‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతుబంధుతో పాటు కల్యాణలక్ష్మి వంటి పథకాలు అమలు చేసినా పార్టీ ఓడిపోవడంపై చర్చ జరుగుతోంది. ఆచరణ సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ గందరగోళాన్ని సృష్టించి అధి కారంలోకి వచ్చిదనే విషయాన్ని విడమరిచి చెబుతున్నాం. మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యలకు బీఆర్ఎస్ అనుసరించే రైతు అనుకూల విధానాలతోనే పరిష్కారం దొరుకుతుందనే భావన కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నందున బీఆర్ఎస్ సభలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. కేసీఆర్ కోలుకున్న తర్వాత మహారాష్ట్ర పర్యటనకు వచ్చే అవకాశముంది’అని వెల్లడించారు. -
పార్లమెంట్‌ను కాపాడలేని బీజేపీ దేశాన్ని రక్షిస్తుందా?
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్‌పై జరిగిన దాడితో ప్రపంచదేశాల్లో భారతదేశ విలువ ఎంతో దిగజారిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. భారత పార్లమెంట్‌ను రక్షించలేని బీజేపీ పాలకులు ఈ దేశాన్ని ఎలా కాపాడుతారని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ‘ఇండియా’కూటమి ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ ధర్నాకు హాజరైన భట్టి విక్రమా ర్క మాట్లాడుతూ పార్లమెంట్‌పై దాడిని రాజ్యాంగంపై జరిగిన దాడిగా భావించాలన్నారు. దేశ రక్షణను గాలికి వదిలేసిన ప్రధాని మోదీని ప్రశ్నించిన ఇండియాకూటమి ఎంపీలతోపాటు మొత్తంగా 146 మందిని సస్పెండ్ చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి దేవాలయంగా భావించే పార్లమెంట్‌పై జరిగిన దాడిపై సభలో సభ్యులు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు ప్రశ్నించిన సభ్యులను సస్పెండ్ చేయడం సిగ్గుచేటు అని అన్నారు. ఈ దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కా పాడాలనే ఆలోచన బీజేపీకి లేదని విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాందీ, రాహుల్‌గాందీ, ప్రియాంకా గాంధీ సైతం రోడ్లపైకి వచ్చి ఈ దేశం కోసం తామున్నామని, ప్రజలకు బాసటగా నిలుస్తున్న విషయాన్ని గుర్తించాలన్నారు. సమాధానం చెప్పకుండా సస్పెన్షనా? తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ పార్లమెంట్ ఘటనపై సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం విపక్ష సభ్యులను బయటకు పంపించిందని విమర్శించారు. ముఖ్యమైన బిల్లులపై చర్చ జరుగుతుంటే, అందరినీ బయటకు పంపించి బలవంతంగా బిల్లులను ఆమోదింప చేసుకుంటున్నా రని దుయ్యబట్టారు. వెంటనే విపక్ష సభ్యులను సభలోకి అనుమతించాలని డిమాండ్ చేశారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ పార్లమెంట్ మీద దాడి జరగడం అంటే అంబేడ్కర్ గుండెపైన దాడి జరిగినట్టేనని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ మాట్లాడుతూ పార్లమెంట్లో పొగ బాంబులు వేస్తే ఇంతవరకు సమాధానం చెప్పని ప్రధాని మోదీ చరిత్రలో ఎన్నడు లేని విధంగా 146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారని విమర్శించారు. మరో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ పార్లమెంట్‌కు భద్ర త ఇవ్వలేని స్థితిలో ఉన్న ఎన్డీఏ దేశానికి భద్రత ఎలా కలి్పస్తుందని ఎద్దేవా చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కులమతాల పేరుతో బీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తోందన్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్, ఆమ్ ఆద్మీ పార్టీ కోఆర్డినేటర్ దిడ్డి సుధాకర్, ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్, నాగరాజు, విజయ రమణారావు తదితరులు పాల్గొన్నారు. -
పొంగులేటి మార్క్ పాలిటిక్స్.. ఖమ్మంలో ఎంపీ సీటు ఖరారు?
అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత కాంగ్రెస్ నాయకులు లోక్‌సభ ఎన్నికలకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం ఎంపీ సీటుకు పోటీ తీవ్రంగా ఉంది. గత మూడు అసెంబ్లీ ఎన్నికల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఒక్కో ఎమ్మెల్యే సీటే దక్కుతోంది. ఈసారి ఒక్కటి మినహా మిగిలిన అసెంబ్లీ సీట్లన్నీ కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. దీంతో ఖమ్మం ఎంపీ సీటు కోసం డిమాండ్ బాగా పెరిగింది. మరి కాంగ్రెస్ గ్యారెంటీగా గెలుస్తామంటున్న ఖమ్మం సీటు కోసం పోటీ పడుతున్న నేతలెవరు?.. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది స్థానాల్లో సీపీఐ పోత్తుల్లో భాగంగా తొమ్మిది సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే అత్యధికంగా ముగ్గురు మంత్రులయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో మెజార్టీ స్థానాలు రావడంలో కీలకంగా వ్యవహరించారు. కాంగ్రెస్ తరువాతి టార్గెట్ లోకసభ ఎన్నికలే. తెలంగాణలో 12 నుంచి 14 ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం ఒక ఎత్తైయితే కీలకమైన లోకసభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించడం కూడా అంతే కీలకం. దీంతో అభ్యర్థుల వేటలో కూడికలు తీసివేతలు ప్రారంభించారు కాంగ్రెస్ నాయకులు. ఖమ్మం జిల్లాలో ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్‌లో అప్పుడే పోరు మొదలైంది. జిల్లాలోనే కీలక నేతగా ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి టికెట్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. ప్రసాద్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా పనిచేశారు. పాలేరు నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి భారీ మోజార్టీ రావడం వెనుక ప్రసాద్ రెడ్డి పాత్ర కీలకమనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా పనిచేసినందున లోక్‌సభ ఎన్నికల్లో సీటు కోసం ప్రసాద్‌రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. జిల్లాలోని మంత్రులు, ఇతర ఎమ్మెల్యేల మద్దతు కూడా ప్రసాద్ రెడ్డికి ఉందని అంటున్నారు. పైగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని పాలేరు, ఖమ్మం, మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో మంచి పట్టు సాధించారనే టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే మాజీ కేంద్రమంత్రి, గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఖమ్మం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన రేణుకా చౌదరి సైతం ఎంపీ టికెట్ కోసం పట్టుపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఎంపీ టికెట్ తనకే ఇస్తామని అధిష్టానం భరోసా ఇచ్చిందని ఆమె చెప్పుకుంటున్నారట. ఇప్పటికే తన టిక్కెట్ విషయంపై రేణుకా చౌదరి చెప్పాల్సిన వారికి చెప్పుకున్నారట. వీరిద్దరితో పాటు మరో ఇద్దరు నేతలు సైతం ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే లోకసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య రసవత్తరమైన పోటీ ఉండే అవకాశం ఉంది. అయితే, ఖమ్మంలో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గానే పోటీ ఉండనుంది. అధికార పార్టీ కాబట్టి కాంగ్రెస్‌లో టిక్కెట్ కోసం పోటీ తీవ్రంగానే ఉంది. మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎవరికి అవకాశం ఇస్తుందో చూడాలి. -
కాంగ్రెస్‌లో టాక్.. సీఎం రేవంత్ సన్నిహితుడికి ఎమ్మెల్సీ?
ఆ నేత తెలంగాణ సీఎం రేవంత్‌కు సన్నిహితుడు. అయినా రెండుసార్లు ఆయనతో దురదృష్టమే దోస్తీ చేసింది. అసలు దోస్తు ముఖ్యమంత్రి కావడంతో ఆ నేత రాజకీయ జీవితంపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయనే టాక్ నడుస్తోంది. చట్టసభలో అడుగు పెట్టాలని ఆయన కన్న కలలు నిజం కానున్నాయా? ఎమ్మెల్యే టిక్కెట్ దక్కలేదు. ఎంపీ టిక్కెట్ హామీ దొరికింది. ఇప్పుడేమో ఎమ్మెల్సీ అంటున్నారు. ఏదో ఒక రూపంలో చట్టసభలోకి ఎంట్రీ ఇస్తారా? ఇంతకీ ఆ నేత ఎవరంటే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు మంత్రి పదవులు పొందిన వారు ఎంత సంతోషంగా ఉన్నారో వారితో పాటు ఇంకొందరు నేతలు కూడా ఆనందపడుతున్నారట. అలా సంతోషపడుతున్న వారిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పటేల్ రమేష్ రెడ్డి కూడా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన పటేల్ రమేష్ రెడ్డి ఎప్పటి నుంచో ఎమ్మెల్యేగా పోటీ చేసి చట్టసభలో అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. 2016లో రేవంత్‌తో పాటు టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు రమేష్ రెడ్డి. 2018లో సూర్యాపేట నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ చివరకు సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డికి అధిష్టానం అవకాశం ఇచ్చింది. ఆ సమయంలో 2019 నల్లగొండ ఎంపీగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. చివరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ బరిలో నిలవడంతో ఆయనకు మరోసారి భంగపాటే ఎదురైంది. రెండుసార్లు టికెట్ ఆశించి రాకపోవడంతో తీవ్ర ఆవేదనలో ఉన్న రమేష్ రెడ్డికి తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ చివరి నిమిషంలో మరోసారి రమేష్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ హ్యాండిచ్చింది. ఈసారి కూడా రాంరెడ్డి దామోదర్ రెడ్డికే కాంగ్రెస్ నాయకత్వం టికెట్ ఇచ్చింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రమేష్ రెడ్డి ఎలా అయినా పోటీ చేయాలని నిశ్చయించుకుని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి నామినేషన్ కూడా వేశారు. కానీ ఉప సంహకరణకు చివరి రోజున కాంగ్రెస్ హైకమాండ్ దూతలు బుజ్జగింపులకు దిగారు. నల్లగొండ స్థానం నుంచి ఎంపీగా అవకాశం కల్పిస్తామని అధిష్టానంతో పాటు సిట్టింగ్ ఎంపీ ఉత్తమ్ రాతపూర్వక హామీ ఇవ్వడంతో ఆయన వెనక్కి తగ్గారు. దామోదర్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు పూర్తి కావడం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రమేష్ రెడ్డికి కొత్త ఆశ పుట్టిందట. ఎంపీ ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో అనుకుంటూనే ప్రస్తుతానికైతే ఎమ్మెల్సీ ఇస్తే బాగుంటుంది పార్టీ కోసం అనేక త్యాగాలు చేసిన తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారట. ఎలాగూ సీఎం కమ్ పీసీసీ చీఫ్ తన చిరకాల స్నేహితుడే కావడంతో ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్సీ వస్తుందన్న ధీమాతో ఉన్నారట. శాసనసభ ఎన్నికల్లో సూర్యాపేట నుంచి పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించిన పటేల్ రమేష్‌రెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను చుట్టి వచ్చేలా పాదయాత్ర చేశారు. పోటీకి అవసరమైన అన్ని వనరులను సమకూర్చుకున్నారు. ఆయనకు టికెట్ ఇప్పించేందుకు రేవంత్ రెడ్డి కూడా తీవ్రంగానే ప్రయత్నించారు. కానీ, టికెట్ రాకపోవడంతో తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయిన పటేల్ పట్ల రేవంత్‌కు కూడా సానుభూతి ఉంది. తనకు మొదటి నుంచి అండగా ఉన్న రమేష్ రెడ్డికి ఓ పదవి ఇస్తే పోలా అన్న ఆలోచనలో ఉన్నారట రేవంత్. దీంతో రాబోయే రోజుల్లో ఖాళీ అయ్యే ఏదో ఒక ఎమ్మెల్సీ స్థానంలో రమేష్ రెడ్డిని మండలికి పంపించే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. దీంతో రమేష్ రెడ్డి పట్టరాని సంతోషంతో ఉన్నారట. ఇన్నాళ్లు పట్టువదలని విక్రమార్కులా ప్రయత్నం చేసినందుకు ఫలితం త్వరలోనే రాబోతోందని రమేష్ రెడ్డి ఆశిస్తున్నారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి స్నేహితులు. ఇద్దరూ ఒకేసారి కాంగ్రెస్‌లోకి వచ్చారు. రేవంత్‌ను అదృష్టం వరించింది. పటేల్‌ను ఇప్పటివరకు దురదృష్టం వెంటాడింది. ఇప్పటికే ఆయన్ను అదృష్టం వరిస్తే మండలిలో ఎంట్రీ దొరకవచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. -
కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్.. రేపు బీఆర్ఎస్ ‘స్వేదపత్రం’ విడుదల
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తొమ్మిదన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం అని కేటీఆర్ తెలిపారు. దేశంలోనే అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని హెచ్చరించారు. కాగా, కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. ‘తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం పగలూ రాత్రి తేడా లేకుండా.. రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన.. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం.. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం.. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోం.. అందుకే గణాంకాలతో సహా.. వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించేందుకు.. అప్పులు కాదు.. తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు.. తెలంగాణ భవన్ వేదికగా 23వ తేదీన (శనివారం) ఉదయం 11 గంటలకు “ స్వేద పత్రం ” పవర్ పాయింట్ ప్రెజెంటేషన్..’అంటూ పోస్టు పెట్టారు. తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం పగలూ రాత్రి తేడా లేకుండా.. రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన.. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం.. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం.. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే… — KTR (@KTRBRS) December 22, 2023 -
ప్రశ్నిస్తే అరెస్టులు.. దుర్మార్గమైన చర్య: డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, హైదరాబాద్: దేశంలో నియంతృత్వ పోకడ పాలన నడుస్తోందని.. ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి విఘాతమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పార్లమెంట్ ప్రతిపక్ష పార్టీల ఎంపీల సస్పెన్షన్ పరిణామంతో కేంద్రానికి వ్యతిరేకంగా విపక్ష కూటమి ‘ఇండియా’ దేశవ్యాప్త నిరసన ప్రదర్శనలు చేపట్టింది. ఇందులో భాగంగా.. శుక్రవారం మధ్యాహ్నాం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద కార్యక్రమం నిర్వహించింది. ‘‘దేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా?. ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య. నియంతృత్వ పోకడలతో మోదీ పాలన నడుస్తోంది. దేశంలో ఎక్కడా స్వేచ్ఛ లేదు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే అంతా రోడ్డెక్కారు’’ అని అన్నారాయన. ఈ నిరసనలో షబ్బీర్ అలీతో పాటు పలువురు సీనియర్లు పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ‘‘సమాధానం చెప్పే ధైర్యం లేక ఎంపీ లను సస్పెండ్ చేశారు. ప్రజాస్వామ్య స్పూర్తి కి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నా చౌక్ ఎత్తేస్తే.. కాంగ్రెస్ కోర్టుకు పోయి కొట్లాడింది. నియంతృత్వ పోకడలతో వెల్లినందుకే బీఆర్ఎస్ కు బుద్ది చెప్పారు. బీజేపీ కి కూడా వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘‘పార్లమెంట్ కే రక్షణ లేదు దేశానికి రక్షణ ఉంటుందా?. పార్లమెంట్ పై దాడి గురించి ప్రశ్నిస్తే..సభ్యులను సస్పెండ్ చేయడం ఏంటి?. ఎంపీ లకు ప్రశ్నించే హక్కు లేదా?. దేశ ప్రజలంతా ఇండియా కూటమి కి మద్దతు గా నిలవాలి’’. మరోవైపు.. మోదీ ప్రభుత్వ విధానాలపై ఇండియా కూటమి నిరసనలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. పార్లమెంట్ భద్రతా విఘాతంపై హోంశాఖ మంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని విపక్షాల పట్టుబట్టాయి. దీంతో 146 మంది ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారు. అదే సమయంలో కీలకమైన మూడు నేర చట్టాలకు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం లభించింది. అయితే.. ప్రతిపక్షం లేకుండా బిల్లుల ఆమోదాన్ని విపక్ష కూటమి తీవ్రంగా ఖండిస్తోంది. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఇవాళ నిర్వహించిన కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ.. సస్పెండ్ అయిన ఇతర ఎంపీలు పాల్గొన్నారు. పార్లమెంట్ భద్రతను గాలికొదిలేశారని రాహుల్ ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉద్యోగ కల్పన లేదు కాబట్టే సెల్ఫోన్లలో యువత గంటలు గంటలు గడుపుతోందని అభిప్రాయపడ్డారాయన. ఉద్యోగాలు లేక నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతోందని అన్నారాయన. ఇదీ చదవండి: సగానికిపైగా అప్పులు తీర్చాం -
రేవంత్ X అక్బర్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగ శ్వేతపత్రంపై గురువారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరువురి మధ్య మాటల తూటాలు పేలాయి. అక్బరుద్దీన్ మాట్లాడుతుండగా మొదలైన ఈ రగడ గంటకుపైగా కొనసాగింది. దీంతో సభలోని కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ సభ్యులు వాదోపవాదాలకు దిగారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఒకానొక సందర్భంలో స్పీకర్ పోడియం వద్దకు అక్బరుద్దీన్ సహా ఎంఐఎం సభ్యులు దూసుకెళ్లారు. ఎంఐఎం సభ్యులతోపాటు బీఆర్ఎస్ సభ్యులు హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు పోడియం వద్దకు వెళ్లి సభాపతితో వాదనకు దిగారు. దీంతో సభ అదుపుతప్పింది. బీఆర్ఎస్ పాలనపై ప్రశంసలతో వాదన మొదలు.. : విద్యుత్ రంగ శ్వేతపత్రంపై చర్చలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ ‘గత ప్రభుత్వ హయాంలో పాతబస్తీలో రూ. 25 వేల కోట్ల అభివృద్ధి జరిగింది. 2014తో పోలిస్తే విద్యుదుత్పత్తి భారీగా పెరిగింది. బీఆర్ఎస్ హయాంలో జెన్కో ఆస్తులు రూ. 12,783 కోట్ల నుంచి రూ. 40,454 కోట్లకు పెరిగాయి. పాతబస్తీలో ఇంకా 5 వేల స్తంభాలు, కొత్త కండక్టర్ (తీగ), ట్రాన్స్పార్మర్ల ఏర్పాటుకు కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’అని కోరారు. దీనిపై మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జోక్యం చేసుకుంటూ అక్బరుద్దీన్ గత పదేళ్ల కాలంలో ఆ పనులేవీ చేయించుకోలేకపోగా ఇప్పుడు ప్రశ్నించడం ఏమిటంటూ నిలదీశారు. దీనిపై అక్బరుద్దీన్ ఘాటుగా ప్రతిస్పందించారు. సీనియర్‌ను అయిన తనను మొదటిసారి సభకు వచ్చిన సత్యనారాయణ ప్రశ్నిస్తున్నారని... పెద్దలు మాట్లాడుకుంటుండగా చిన్న పిల్లాడిలా మాట్లాడొద్దని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి జోక్యం... అక్బరుద్దీన్ మాట్లాడుతుండగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు. ‘అక్బరుద్దీన్ సహచర ఎమ్మెల్యేలను గౌరవించాలి. సభలో ప్రస్తుతం 57 మంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నారు. కవ్వంపల్లి సత్యనారాయణ దళితుడు. ఆయన మాట్లాడితే ఆగ్రహం వ్యక్తం చేయాలా? అధికారంలోకి రాగానే అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌ను చేశాం. ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది. అక్బరుద్దీన్ కేవలం ఎంఐఎం నేత మాత్రమే. ఆయన్ను మేం ముస్లిం ప్రతినిధిగా చూడట్లేదు. చాంద్రాయణగుట్టలో హిందువులు కూడా ఆయనకు ఓటు వేశారు. మాకు ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అనే తేడాలేదు. బీఆర్ఎస్ దుర్మార్గాలు మిత్రపక్షమైన ఎంఐఎంకు కనిపించలేదా? గత ప్రభుత్వాన్ని అదే పనిగా ఎంఐఎం పొగుడుతుంటే వినేందుకు మేం సిద్ధంగా లేము. తెలంగాణ ప్రజలు మీ మిత్రపక్షం బీఆర్ఎస్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. బీఆర్ఎస్ తరఫున ఎంఐఎం ఎందుకు వకాల్తా పుచ్చుకుంటోంది? మైనారిటీల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు‘అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మా ముస్లిం నేతలను ఓడించారు.. ‘అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, మజ్లిస్ కలసి పనిచేశాయి. నిజామాబాద్ అర్బన్‌లో షబ్బీర్ అలీని, జూబ్లీహిల్స్‌లో అజాహరుద్దీన్‌ను ఓడించేందుకు కేసీఆర్‌తో కలసి మజ్లిస్ పనిచేసింది. అదే మజ్లిస్ పార్టీ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలలో ఎందుకు పోటీ చేయలేదు? కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను ముఖ్యమంత్రులుగా, రాష్ట్రపతులుగా చేసింది. మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అక్బరుద్దీన్.. కేసీఆర్‌కు మిత్రుడు కావొచ్చు. మోదీకి మద్దతివ్వవచ్చు.. అది వాళ్లిష్టం. మజ్లిస్, బీఆర్ఎస్ మిత్రపక్షాలు అని కేసీఆర్ పలుమార్లు చెప్పారు. మజ్లిస్ పార్టీ కేసీఆర్‌ను రక్షించేందుకు ప్రయత్నిస్తోంది. అక్బరుద్దీన్ ముస్లింలందరికీ నాయకుడు కాదు. మజ్లిస్ పార్టీకి మాత్రమే నాయకుడు’అని రేవంత్ వ్యాఖ్యానించారు. విద్యుత్ బకాయిలు రాబడతారా? ‘విద్యుత్ మొండి బకాయిల్లో సిద్దిపేట 61.37 శాతం, గజ్వేల్ 50.29 శాతం, హైదరాబాద్ సౌత్ 43 శాతంతో టాప్‌లో ఉన్నాయి. కేసీఆర్, హరీశ్‌రావు, అక్బరుద్దీన్ బాధ్యత తీసుకొని విద్యుత్ బకాయిలను క్లియర్ చేస్తారా?’అని రేవంత్ ప్రశ్నించారు. ఈ బిల్లులు వసూలు చేస్తే బకాయిల నుంచి బయటపడతామన్నారు. పాతబస్తీలో విద్యుత్ బకాయిల చెల్లింపులు జరిపే బాధ్యత తనదని అక్బరుద్దీన్ చెప్పడం లేదని రేవంత్ విమర్శలు గుప్పించారు. రేవంత్ మాట్లాడుతుండగా మజ్లిస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. వైఎస్సాఆర్ వల్లే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు... రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై అక్బరుద్దీన్ తీవ్రంగా స్పందించారు. ‘మేము ఎవరికీ భయపడం. కిరణ్‌కుమార్‌రెడ్డి జైల్లో పెట్టినా భయపడలేదు. కాంగ్రెస్ మమ్మల్ని అణచివేసే ప్రయత్నం చేస్తోంది. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కాంగ్రెస్, ఎంఐఎం కలసి ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చాయి. వైఎస్సార్ నిజమైన జెంటిల్మాన్... గొప్ప నాయకుడు. కాంగ్రెస్‌కు చెందిన అప్పటి ఢిల్లీ నేతలు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మా నాన్నను కలిశారు. ఆ తర్వాతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో రిజర్వేషన్ల అంశాన్ని చేర్చారు. కాంగ్రెస్, ఎంఐఎం కలసే అప్పడు ఎన్నికలను ఎదుర్కొన్నాయి’అని పేర్కొన్నారు. సీఎంకు చాలెంజ్.. షబ్బీర్ అలీని ఓడించేందుకు ప్రయత్నించామని రేవంత్ ఆరోపించారు. మేము నిజామాబాద్ అర్బన్‌లో పోటీ చేయలేదు. షబ్బీర్ అలీ ఓటమితో మాకేం సంబంధం? జూబ్లీహిల్స్‌లో మాకు కార్పొరేటర్ ఉన్నారు. బలమైన అభ్యర్థిని నిలిపాం. అంబేడ్కర్ వంటి మహానేతను కూడా ఓడించిన ఘనత కాంగ్రెస్‌దే. మమ్మల్ని బీజేపీ బీ–టీం అంటున్నారు. మేము బతికి ఉన్నంత వరకు బీజేపీతో కలసి పనిచేయం. సీఎం రేవంత్‌కు చాలెంజ్’అంటూ కామెంట్స్ చేశారు. ఏబీవీపీ, బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి ఉన్నారని... అన్నిచోట్లా సీఎంకు అనుభవం ఉందని వ్యాఖ్యానించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అక్బరుద్దీన్ సభానాయకుడిని కించపర్చేలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. స్పీకర్ కూడా జోక్యం చేసుకొని సభానాయకుడు మాట్లాడుతున్నప్పుడు ఎవరూ మధ్యలో మాట్లాడవద్దన్నారు. ఈ దశలో మరోసారి జోక్యం చేసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ‘నాదెండ్ల భాస్కర్‌రావు, ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, కేసీఆర్ హయాం వరకు ఎంఐఎం ఎవరెవరితో దోస్తీ చేసిందో అందరికీ తెలుసు. ఆ అంశంపై చర్చించాలంటే మరోసారి చర్చిద్దాం’అని పేర్కొన్నారు. దీనికి అక్బరుద్దీన్ బదులిస్తూ ‘మేము ఎవరితో కలసి పనిచేసినా రాష్ట్ర అభివృద్ధి కోసమే. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిపక్వతగా మాట్లాడటం లేదు’అని అన్నారు. -
యాదాద్రి ప్రాజెక్టులో 10వేల కోట్లు తిన్నావ్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. ఇందులో 10 వేల కోట్లను అప్పటి మంత్రి జగదీశ్ రెడ్డి తిన్నారని నిందించారు. అనంతరం మంత్రి చేసిన వ్యాఖ్యలపై జగదీశ్ రెడ్డి దీటుగా స్పందించారు. 24గంటల విద్యుత్ ఎన్నడూ ఇవ్వలేదు: మంత్రి కోమటిరెడ్డి తెలంగాణలో విద్యుత్ రంగంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మాట్లాడుతుండగా మంత్రి వెంకటరెడ్డి జోక్యం చేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటల ఉచిత విద్యుత్ పూర్తిగా అవాస్తవమని, ఎనిమిదిన్నర గంటల నుంచి 12 గంటల వరకే విద్యుత్ ఇచ్చేదని పునరుద్ఘాటించారు. కొన్ని ప్రత్యేక రోజుల్లో 16 గంటలు ఇచ్చి ఉండొచ్చు తప్ప 24 గంటలు ఎన్నడూ ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. విద్యుత్ శాఖలో నష్టాలకు కారణం అవినీతేనన్నారు. యాదాద్రి ప్రాజెక్టును 29వేల కోట్లకు నామినేషన్ మీద అప్పగించారని, జార్ఖండ్ విద్యుత్ ప్రాజెక్టుకు యాదాద్రికి రూ. రూ.6వేల కోట్లు తేడా ఉందన్నారు. ఇందులో పెద్ద స్కాం ఉందని, రూ. 10వేల కోట్లు తిన్నారని ఆరోపించారు. అప్పటి మిర్యాలగూడ ఎమ్మెల్యే బినామీగా ఉండి తిన్నారని ఆరోపించారు. టెండర్ పెట్టకుండా ప్రాజెక్టు అప్పగించుడే పెద్ద స్కాం అని ఆరోపించారు. సోనియా గాందీతో కొట్లాడి వైఎస్ ఫ్రీ పవర్ తెచ్చారు రాష్ట్రంలో ఉచిత విద్యుత్‌కు పేటెంట్ కాంగ్రెస్‌దేనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సోనియాగాం«దీతో కొట్లాడి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టించారని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అమలు చేశారని అన్నారు. విచారణకు జగదీశ్ రెడ్డి సవాల్ తనపై గతంలో కూడా ఆరోపణలు చేశారని, ఈ ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో లేదా కమిషన్‌తో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని జగదీశ్ రెడ్డి సవాల్ విసిరారు. ఆ విచారణలో ఎవరు దోషులుగా తేలితే వాళ్లకు శిక్ష వేయాలన్నారు. లేదంటే ఆధారాలు లేకుండా అసంబద్ధ ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలన్నారు. ఇటువంటి ఆరోపణలు చాలా సందర్భాల్లో బయట మాట్లాడుతుంటే విన్నానని.. కానీ ఏ ఒక్కరోజు కూడా రియాక్ట్ కాలేదని జగదీశ్ రెడ్డి చెప్పారు. ఇవన్నీ పనికిమాలిన మాటలు.. అర్థం లేని.. ఆధార రహితమైన మాటలని కొట్టిపారేశారు. ఇవన్నీ రికార్డుల్లోకి రావాలనే ఇన్ని రోజులు వెయిట్ చేశానని.. ఇవాళ రికార్డుల్లోకి వచ్చాయన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సీఎం రేవంత్ మూడు అంశాలపై జ్యుడీషియల్ ఎంక్వైరీకి సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఆరోపణలపై కూడా విచారణ చేయాలని జగదీశ్ రెడ్డి కోరారు. వారు చేసిన ఆరోపణలు అసంబద్ధమైతే తప్పకుండా శిక్ష పడాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. అది మీరు చేయగలుగుతారా? ప్రజా కోర్టులో తేలుస్తారా అనేది చూడాలని వ్యాఖ్యానించారు.