కోత పడింది!

Salary cut enforced on transport strikers in Chennai - Sakshi

ఏడు రోజుల జీతం కట్‌

రవాణా కార్మికులకు షాక్‌

కోర్టును ఆశ్రయించే యత్నం

నేడు కార్మిక సంఘాల భేటీకి నిర్ణయం

రవాణా సంస్థ ఉద్యోగ, కార్మికులకు షాక్‌ ఇచ్చే నిర్ణయాన్ని ఆ సంస్థ యాజమాన్యం బుధవారం తీసుకుంది. సమ్మె కాలాన్ని సెలవు దినంగా పరిగణించి ఏడు రోజుల జీతంలో కోత విధిస్తూ నిర్ణయం తీసుకోవడం వివాదానికి దారి తీసింది. కోర్టును ఆశ్రయించడమా లేదా మళ్లీ మెరుపు సమ్మెకు దిగడమా అన్న నిర్ణయం తీసుకునేందుకు గురువారం కార్మిక సంఘాలు సమావేశం అవుతున్నాయి.

సాక్షి, చెన్నై: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో లక్షన్నర మంది ఉద్యోగ, కార్మికులు ఉన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం ఇప్పటికే మూడుసార్లు సమ్మె బాటను అనుసరించారు. పాలకుల్లో స్పందన లేని దృష్ట్యా, గత నెల జనవరి ఐదో తేదీ నుంచి మెరుపు సమ్మెకు కార్మికులు దిగారు. దీంతో ఎక్కడి బస్సులు అక్కడే ఆగాయి. ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు తప్పలేదు. రవాణా సంస్థకు కోట్లాది రూపాయల మేరకు నష్టం తప్పలేదు. ఈ సమయంలో సమ్మె కాలంలో పలువురు కార్మిక నేతలకు, వారి మద్దతుదారులకు శాఖా పరమైన నోటీసులు జారీ అయ్యాయి. చర్యలు తప్పదన్నట్టుగా హెచ్చరికలు వెళ్లాయి. అ సమయంలో సంక్రాంతి పర్వదినం సమీపించడంతో  ప్రజ లకు ఇబ్బంది కల్గించ కూడదన్న ఉద్దేశంతో కార్మికులు ఓ మెట్టు దిగారు. అలాగే, కార్మికులకు బాసటగా నిలిచే విధంగా హైకోర్టు నిర్ణయం తీసుకోవడంతో 11వ తేదీ సమ్మెను కార్మిక సంఘాలు విరమించాయి. కోర్టులో వాదనల సమయంలో శాఖా పరంగా ఎలాంటి చర్యలు ఉండబోవన్న హామీని ప్రభుత్వం కార్మికులకు ఇచ్చింది. అయితే, చాప కింద నీరులా తమ పనితనాన్ని రవాణా సంస్థ యాజమాన్యం తాజాగా ప్రదర్శించడం వివాదానికి దారి తీసింది. 

వేతనంలో కోత:  శాఖా పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఓ వైపు ప్రకటించి, మరో వైపు వేతనంలో కోత విధిస్తూ తమ పనితనాన్ని ప్రదర్శించారు. జనవరి నెల వేతన లెక్కింపు వివరాలు బుధవారం వెలుగులోకి రావడంతో కార్మికులకు షాక్‌ తగిలినట్టు అయింది. ఫిబ్రవరి ఒకటో తేదీన బ్యాంకుల్లో జీతాలు జమ కావాల్సి ఉంది. అయితే,  31వ తేదీ లెక్కింపు మేరకు ఏడు రోజుల పాటు లక్షల మంది ఉద్యోగ కార్మికులకు ఏడు రోజుల పాటు వేతనంలో కోత విధించి ఉండడం గమనార్హం. ఈ మేరకు ఒక్కో కార్మికులకు రూ. మూడు వేల ఐదు వందల  మేరకు వేతనం కట్‌ చేసి ఉన్న సమాచారం కార్మిక సంఘాల్లో ఆగ్రహాన్ని రేపాయి. తమ మీద ఎలాంటి చర్యలు ఉండబోవన్న పాలకులు, తాజాగా కోత విధించడాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా పరిగణించాయి. కింది స్థాయిలో రూ. 3500, ఆ పై స్థాయి వారికి మరింతగా వేతనాల్లో కోత విధించడాన్ని కార్మిక నేతలు ఖండిస్తున్నారు. ఐదో తేదీ నుంచి 11వ తేదీ వరకు ఏడు రోజుల పాటు జీతంలో కోత విధించామని యాజమాన్యం సైతం పేర్కొన్న సంకేతాలతో కార్మిక సంఘాల్లో ఆగ్రహం బయలు దేరింది.

గురువారం రవాణా కార్మిక సంఘాలన్నీ ఏకం అయ్యేందుకు నిర్ణయించారు. కార్మిక సంఘాల సమాలోచన తదుపరి కీలక నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు. ప్రజలకు ఇబ్బంది కల్గించకుండా ఈ వ్యవహారాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవడమా లేదా, మరో మారు ఇలాంటి కోతల జోలికి యాజమాన్యం వెళ్లకుండా ఉండే విధంగా, తీవ్ర హెచ్చరికలు ఇచ్చే రీతిలో మళ్లీ మెరుపు సమ్మెకు దిగడమా అన్న అంశంపై కార్మిక నేతలు మరికొన్ని గంటల్లో తమ నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు. ఈ విషయంగా సీఐటీ యూ నేత సౌందరరాజన్‌ పేర్కొంటూ, వేతనం కత్తిరింపు వ్యవహారం తమ దృష్టికి వచ్చిందన్నారు. యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నామని,  చాప కింద నీరులా ఇలాంటి చర్యలకు పాల్పడిన పక్షంలో, తామేమిటో మరో మారు చూపించాల్సి ఉంటుందని హెచ్చరించారు. గురువారం బ్యాంక్‌ ఖాతాల్లో జమ అయ్యే వేతనాల పరిశీలన మేరకు కార్మిక సంఘాలు సమావేశం కానున్నాయని, ఇందులో మరో మారు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. 

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top