నాకొద్దు ఈ ఉద్యోగం; మహిళా ఇన్‌స్పెక్టర్‌ రాజీనామా

Woman Inspector Resigned Her Job For Work Pressure Reason - Sakshi

సాక్షి, చెన్నై: పనిభారంతో ఓ మహిళా ఇన్‌స్పెక్టర్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేసిన సమాచారం గురువారం వెలుగులోకి వచ్చింది. మరో రెండేళ్లలో పదవీ విరమణ పొందాల్సిన తాను ఇన్నాళ్లు పడ్డ బాధలు, ప్రస్తుతం పడుతున్న కష్టాలను ఓ లేఖ రూపంలో ఆమె ఉన్నతాధికారులకు ఏకరువు పెట్టినట్టు సమాచారం.రాష్ట్ర పోలీసు శాఖలో పని భారం పెరిగినట్టు గత కొంత కాలంగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందుకు తోడు మానసిక ఒత్తిళ్లకు లోనైన వారు ఆత్మహత్య, ఆత్మహత్యాయత్నాలకు సైతం పాల్పడుతూ వస్తున్నారు.

గత నెల చెన్నై కానిస్టేబుల్‌ అరుణ్‌ రాజ్‌ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం పోలీసు వర్గాల్ని కలవరంలో పడేసింది. ఆ  ఘటన మరువక ముందే ఐనావరం స్టేషన్లోనే సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సతీష్‌కుమార్‌ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం మరింతగా కలకలం రేపింది. అలాగే, విధుల్లో ఉన్న వాళ్లు పనిభారం, ఒత్తిళ్ల కారణంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇద్దరు ముగ్గురు విధుల్లోనూ గుండె పోటుతో మరణించారు. 

కేవలం పనిభారం కారణంగా, ఉన్నతాధికారుల వేదింపులతో అనేకచోట్ల ఈ ఘటనలు చోటుచేసుకుంటూ వస్తున్నట్టు ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో అనేకమంది పోలీసులు స్పందిస్తున్నారు. ఈ వ్యవహారాలన్నీ మద్రాసు హైకోర్టుకు సైతం చేరాయి. పోలీసు బాసులకు, హోం శాఖకు అక్షింతలు వేసే రీతిలో కోర్టు స్పందించింది. దీంతో పోలీసులకు మానసిక ఒత్తిడి తగ్గించే రీతిలో యోగా తరగతులు ప్రతి వారం నిర్వహించే పనిలో పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో పని భారంతో తన ఉద్యోగాన్ని వదులుకుంటూ రాజీనామా చేస్తూ ఓ మహిళా ఇన్‌స్పెక్టర్‌ లేఖ రాసి పెట్టి వెళ్లడం వెలుగులోకి రావడంతో చర్చకు దారి తీసింది.

ఆలస్యంగా వెలుగులోకి..
సెంబియం మహిళా పోలీసు స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా ఇదయ కళ పనిచేస్తున్నారు. రెండు రోజుల క్రితం అసిస్టెంట్‌ కమిషనర్‌ కార్యాలయానికి ఓ లేఖ రాసి పెట్టి ఆమె వెళ్లి ఉండటం వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. అందులో పనిభారం మరింతగా పెరిగిందని, పనిచేయలేని పరిస్థితి ఉందని, సహ అధికారులు సహరించడం లేదని వివరిస్తూ, తాను పడుతున్న కష్టాలను ఏకరువు పెడుతూ తాను రాజీనామా చేస్తున్నామని అందులో ఆమె వివరించినట్టు తెలిసింది. అయితే, ఉన్నతాధికారులు మాత్రం ఆమె మెడికల్‌ సెలవుల్లో ఉన్నట్టు పేర్కొనడం గమనార్హం. 1981లో పోలీసు శాఖలో చేరిన ఆమె 2020లో పదవీ విరమణ చేయనున్నారు. ఈ సమయంలో ఆమె పని భారంతో పదవిని వదలుకోవడం గమనార్హం. ఇదే రకంగా అనేక స్టేషన్లలో పనిచేస్తున్న మహిళా సిబ్బందే కాదు, కింది స్థాయి వారు అనేకమంది రాజీనామా అంటూ లేఖల్ని ఉన్నతాధికారులకు పంపినట్టు సమాచారం.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top