సంక్షేమానికి మంగళం | Welfare burden | Sakshi
Sakshi News home page

సంక్షేమానికి మంగళం

Apr 27 2014 2:48 AM | Updated on Sep 2 2017 6:33 AM

ఎన్నికల్లో గెలవడానికి ముందూ వెనకా ఆలోచించకుండా అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి ఆటు తరువాత వాటిని విస్మరించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటైనట్లుంది.

సాక్షి, బెంగళూరు : ఎన్నికల్లో గెలవడానికి ముందూ వెనకా ఆలోచించకుండా అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి ఆటు తరువాత వాటిని విస్మరించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటైనట్లుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తున్నా పీయూసీ (ఇంటర్) విద్యార్థులకు ల్యాప్‌టాప్ చేతికి అందలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
 
అంతేకాకుండా నిధులు లేవనే నెపంతో గతంలో ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాలకు మంగళం పాడాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రంలో గత శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మానిఫెస్టోలో పీయూసీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్ అందజేస్తామని పేర్కొంది. ఇదే విషయాన్ని ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ చేసి ప్రసంగంలో (2014 జనవరి 22)లో కూడా ప్రస్తావించారు. రాష్ట్రంలోని సుమారు 10 లక్ష మంది పీయూసీ విద్యార్థులు ఉన్నారు.
 
వీరందరికి ల్యాప్‌టాప్‌లు అందించడానికి రూ1,000 కోట్లు అవసరం అవుతాయి. ఈ ఏడాది విద్యా రంగానికి కేటాయించిన బడ్జెట్ (రూ 21,305 కోట్లు)లో ఇది కేవలం 4.6 శాతం మాత్రమే. అయితే నిధుల కొరతను సాకుగా చూపుతూ ఉచిత ల్యాప్‌టాప్‌ల పథకానికి స్వస్తిపలికినట్లు తెలుస్తోంది.

కనీసం మెరిట్ స్టూడెంట్స్ (80 శాతానికి పైగా మార్కులు తెచ్చుకున్నవారికి) ల్యాప్‌టాప్ ఇవ్వాలనే ఉద్దేశంతో అధికారులు నివేదిక తయారు చేసి ఇందుకు రూ.300 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతులెత్తేసిన ట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక గతంలో బీజేపీ ప్రభుత్వం విద్యార్థినులకు అందిస్తున్న ఉచిత సైకిళ్ల వితరణ కూడా నిలిపి వేయనున్నట్లు తెలుస్తోంది. 2012-13 ఏడాదికి అప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ చివరిసారిగా విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేసింది.

అటు పై 2013-14 ఏడాదికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సైకిల్ కూడా కొనుగోలు చేయకం పోవడం ఇందుకు బలం చేకూరుస్తోంది. రాజీవ్ విద్యా మిషన్ నుంచి నిధులు వస్తాయనే ఉద్దేశంతో ఆరు నుంచి పదోతరగతి విద్యార్థినులకు ఉచితంగా ఏడాదికి 100 శానిటరి నాప్కిన్లు ఇవ్వనున్నట్లు గతంలో ప్రభుత్వం తెలిపింది. ఇందుకు మంత్రిమండలి కూడా ఆమోదముద్ర వేసింది.
 
అయితే కేంద్రం నుంచి అవసరమైన నిధులు ఇప్పటికీ అందలేదు. దీంతో నాప్కిన్ల వితరణ పథకం అమలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో అనుకున్నంత మేర పన్నులు వసూలు కావడం లేదు.

దీంతో ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకే నిధులు చాలడం లేదు. అంతేకాకుండా ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు దాదాపు అసాధ్యమని అన్ని సర్వేలు చెబుతున్నాయి. అందువల్లే మానిఫెస్టోలో పేర్కొన్న పలు సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి అటకెక్కించే ఆలోచనలో ఉన్నారు.’ అని పేర్కొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement