పోలీసులకు తీపి కబురు

Wages Hike For Karnataka Police - Sakshi

వేతన పెంపునకు గ్రీన్‌సిగ్నల్‌

వచ్చే బడ్జెట్‌లో కేటాయింపులకు అవకాశం

ఫలించిన నిరీక్షణ

సాక్షి బెంగళూరు: రాష్ట్రంలోని 86 వేల మంది పోలీసుల పంట పండింది. ఎంతో కాలంగా వేచి చూస్తున్న తరుణం రానే వచ్చింది. బహుకాల నిరీక్షణకు తెరపడనుంది. వేతన పెంపు కోసం ఎదురు చూస్తున్న పోలీసుల ఆశలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. పోలీసుల జీతాల పెంపు అనివార్యమని ఐపీఎస్‌ అధికారి రాఘవేంద్ర ఔరాద్కర్‌ కమిటీ ఇచ్చిన నివేదికకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఈ మేరకు పెంచాల్సిన జీతాలను ప్రకటించనున్నట్లు సమాచారం.

ఆందోళనలతో కమిటీ..
దేశంలోని ఏ ఇతర రాష్ట్రాల పోలీసు జీతాలతో పోల్చినా ఇక్కడి రక్షకభటుల వేతనాలు తక్కువగా ఉన్నాయి. గతంలో తమ జీతాలను పెంచాలని అనేక సార్లు పోలీసులు ఆందోనలకు దిగారు. గత కాంగ్రెస్‌ హయాంలోనూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో మాజీ సీఎం సిద్ధరామయ్య అప్పట్లో ఐపీఎస్‌ అధికారి రాఘవేంద్ర ఔరాద్కర్‌ నేతృత్వంలో ఒక కమిటీని వేశారు.

30 శాతం పెంపునకు సిఫారసు..
2016 సెప్టెంబర్‌ 27న ప్రభుత్వానికి కమిటీ నివేదిక సమర్పించింది. రాష్ట్ర పోలీసులు జీతాల పెంపు అనివార్యమని ప్రభుత్వానికి నివేదించింది. పోలీసు శాఖలోని పని చేసే ఆయా విభాగాల్లోని సిబ్బందికి 30 శాతం మేర జీతాన్ని పెంచాలని కమిటీ సూచించింది. ఆ తర్వాత కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలను అమలు చేయాలని పోలీసులు ప్రభుత్వంపై ఒత్తిడి చేశారు.

కర్ణాటక 8వ స్థానం..
కమిటీ నివేదిక ప్రకారం పోలీసుల వేతన శ్రేణిలో కర్ణాటక ఎనిమిదో స్థానంలో నిలిచింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే కర్ణాటకలో వెనుకబడి ఉంది. కర్ణాటక పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు సైతం ముందుగానే ఉన్నాయి. దీంతో ఇక్కడి పోలీసులు ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు వీరి జీతాలు పెంచేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ విషయం ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న బడ్జెట్‌ పూర్వ సమావేశాల్లో ఈ విషయంపై తీర్మానించి వచ్చే బడ్జెట్‌లో పెంపు మేర కేటాయింపులు జరపనున్నారు. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top