అసిస్టెంట్‌ కమిషనర్‌పై చర్యలు! | Sakshi
Sakshi News home page

అసిస్టెంట్‌ కమిషనర్‌పై చర్యలు!

Published Sun, Oct 9 2016 12:44 PM

అసిస్టెంట్‌ కమిషనర్‌పై చర్యలు!

► విశాఖలో కొనసాగించబోమన్న కమిషనర్‌ 
► కలెక్టర్‌ సమక్షంలో హామీ 
► ఆందోళన విరమించిన దేవాదాయ ఉద్యోగులు 

సాక్షి, విశాఖపట్నం : దేవాదాయ, ధర్మాదాయశాఖ కార్యనిర్వహణాధికారులు, ఉద్యోగులు ఆందోళన విరమించారు. దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఇ.వి.పుష్పవర్థన్ వేధింపులకు నిరసనగా నాలుగు రోజుల నుంచి వీరంతా సామూహిక సెలవులో ఉన్నారు. విధులను బహిష్కరించి వివిధ రకాలుగా ఆందోళనలు చేస్తున్నారు.

ఏసీ పుష్పవర్థన్ పై చర్యలు తీసుకోవాలని, ఇక్కడ నుంచి బదిలీ చేయాలని వీరు డిమాండ్‌ చేస్తూ తొలుత ఆ శాఖ కమిషనర్‌ వై.వి.అనురాధకు, ఆ తర్వాత విశాఖ వచ్చిన సీఎం చంద్రబాబుకు విన్నవించారు. దీనిపై కమిషనర్‌ అనురాధ రాజమండ్రి రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ (ఆర్జేసీ)తో విచారణకు ఆదేశించారు. అలాగే ముఖ్యమంత్రి కూడా ఈ వివాదాన్ని పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఇందులోభాగంగా శుక్రవారం ఆర్జేసీ చంద్రశేఖర్‌ ఆజాద్‌ విచారణ చేపట్టారు. శనివారం కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో దేవాదాయశాఖ డిప్యూటి కమిషనర్‌ ఎన్.వి.ఎస్‌.ఎన్.మూర్తి సహా, ఈవోలు, ఉద్యోగులతో సమావేశమయ్యారు. కమిషనర్‌ అనురాధతో కలెక్టర్‌ ఫోన్లో మాట్లాడారు. సహాయ కమిషనర్‌ పుష్పవర్థన్ ఈనెల 12 వరకు సెలవులో ఉన్నారని, అనంతరం ఆయనను విశాఖ నుంచి బదిలీ చేస్తామని, ఇక్కడ కొనసాగించబోమని హామీ ఇచ్చారు. అందువల్ల ఉద్యోగులు నిర్భయంగా విధులు నిర్వహించుకోవచ్చని చెప్పారు.

దీంతో ఉద్యోగులు, ఈవోలు చర్చించుకున్నారు. 12 తర్వాత ఏసీపై చర్యలు తీసుకోని పక్షంలో 13వ తేదీ నుంచి మళ్లీ ఆందోళన కొనసాగిస్తామని కలెక్టర్‌కు స్పష్టం చేశారు. కాగా కమిషనర్‌ హామీతో విజయదశమి పండగను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఇబ్బంది కలగకుండా తామంతా తిరిగి విధులకు హాజరవుతున్నామని జిల్లా దేవాదాయశాఖ కార్యనిర్వహణాధికారుల సంఘం అధ్యక్షుడు ఎ.జగన్నాధరావు ’సాక్షి’కి చెప్పారు. కలెక్టర్‌తో సమావేశమైన వారిలో ఈవోలు జగన్నాధరావు, ఎ¯ŒS.ఎల్‌.ఎస్‌.శాస్తి్ర, పి.శేఖర్‌బాబు, పీఎస్‌.ఎన్ మూర్తి, దేవాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధి జి.కృష్ణమాచారి తదితరులున్నారు. 

Advertisement
Advertisement