రాష్ట్రంలో ఉపాధ్యాయులు 45 శాతం పాఠశాలకు గైర్హాజర్ అవుతున్నారని, ఇది విద్యార్థుల విద్యపై తీవ్ర ప్రభావం చూపుతోందని
రాష్ట్రస్థాయి సెమినార్‌లో తళవార్ ఆవేదన
కోలారు : రాష్ట్రంలో ఉపాధ్యాయులు 45 శాతం పాఠశాలకు గైర్హాజర్ అవుతున్నారని, ఇది విద్యార్థుల విద్యపై తీవ్ర ప్రభావం చూపుతోందని బెంగుళూరు విశ్వ విద్యాలయం విద్యా విభాగం ప్రముఖుడు ఎంఎస్ తళవార్ విచారం వ్యక్తం చేశారు. నగర సమీపంలోని హేమాద్రి బీఎడ్ కళాశాలలో గుణాత్మక విద్యపై ఉపాధ్యాయుల ముందున్న సవాళ్లపై రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సెమినార్‌ను శుక్రవారం ప్రారంభించిన ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్లి హాజరు పుస్తకంలో సంతకం చేసి తరగతులకు మాత్రం వెళ్లడం లేదన్నారు.
దీంతో విద్యార్థులకు గుణాత్మక విద్య లభించడం లేదన్నారు. 50 శాతం మంది పిల్లలకు తమ మాతృభాషలో తమ పేరు రాయడం రాదంటే మనం విద్యార్థులకు ఎలాంటి విద్యను అందిస్తున్నామని ఆలోచించాలన్నారు. సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం పిల్లలకు రోజుకు ఒకటిన్నర గంట కాలం మాత్రమే తరగతి గదిలో కూర్చునే ఉత్సాహం ఉంటుందని, కాని నేడు పాఠశాలల్లో నిత్యం పిల్లలను పాఠాలు చెబుతూనే ఉన్నారని అన్నారు. యువత విద్యకు దూరమైతే సమాజంలో అరాచకత్వం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుద్ధమార్గ స్మరణ సంచికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో హేమాద్రి విద్యా సంస్థ అధ్యక్షుడు ఎస్‌బీ మునివెంకటప్ప, డెరైక్టర్ హేమంత్, డాక్టర్ పూర్వి, జయలక్ష్మి మునివెంకటప్ప తదితరులు పాల్గొన్నారు.