Sakshi News home page

భూమంతర్

Published Thu, Sep 29 2016 7:59 AM

tdp leaders hulchul in amaravathi lands

  •  జరీబు మెట్ట.. మెట్ట జరీబు
  •  రాజధానిలో టీడీపీ నేతల దందా
  •  పెద్దఎత్తున ప్లాట్లు దండుకునే యత్నం
  •  అధికారులను నిలదీసిన రైతులు
  •  
    రాజధానిలో తెలుగుదేశం పార్టీ నేతల భూదందాకు అంతూపొంతూ లేకుండా పోయింది. ఎక్కడ చక్కని భూమి కనిపిస్తుందా నొక్కేద్దామని కాచుకుని కూర్చున్నారు. తుళ్లూరు మండల పరిధిలోని బోరుపాలెం, అబ్బురాజుపాలెం, రాయపూడి, కొండమరాజుపాలెం గ్రామాల్లోని మెట్ట భూములను జరీబుగా.. జరీబు భూములను మెట్టగా మారుస్తూ తిమ్మిని బమ్మి చేస్తున్నారు. శాఖమూరులో అయితే తాను చెప్పింది వింటే సగం భూమన్నా వస్తుందని.. లేకుంటే సర్వం గోవిందా అంటూ టీడీపీకే చెందిన మరో నేత దందా చేస్తున్నాడు.
     
    అమరావతి : మెట్ట భూములను జరీబుగా, జరీబు భూములను మెట్టగా మార్చి తద్వారా ప్రతి ఎకరాకు పరిహారం కింద వచ్చే 250 గజాల స్థలాన్ని సైతం కొట్టేసేందుకు అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఆ మేరకు ఇప్పటికే సుమారు 72 ఎకరాల మెట్ట భూములను జరీబుగా, 54 ఎకరాల జరీబు భూములను మెట్టగా మార్చేందుకు రంగం సిద్ధం చేశారు.
     
    విషయం తెలియడంతో బుధవారం బోరుపాలెం గ్రామానికి వచ్చిన రెవెన్యూ అధికారులను రైతులు నిలదీశారు. రాజధాని నిర్మాణం కోసం భూములు వదులుకున్న రైతులకు ప్రభుత్వం పరిహారం కింద ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు నేలపాడు, శాఖమూరు, పిచ్చుకలపాలెం, దొండపాడు గ్రామాల రైతులకు ప్లాట్ల కేటాయించారు.
     
    మిగిలిన గ్రామాల్లో ప్లాట్ల కేటాయింపు చేపట్టాల్సి ఉంది. ఎకరం మెట్ట భూమి ఇచ్చిన రైతుకు వెయ్యి గజాల నివాస స్థలం, 250 గజాల కమర్షియల్ ప్లాటు ఇస్తారు. జరీబు భూమి ఇచ్చిన రైతుకు వెయ్యి గజాల నివాస స్థలం, 450 గజాల వాణిజ్య ప్లాటు ఇవ్వాలని నిర్ణయించారు.
     
    ప్లాట్లు దండుకునే యత్నంలో తమ్ముళ్లు
     తుళ్లూరు మండల పరిధిలోని బోరుపాలెం, అబ్బరాజుపాలెం, రాయపూడి, కొండమరాజుపాలెం గ్రామాల పరిధిలో ఉన్న 72 ఎకరాల మెట్ట భూములను జరీబుగా మార్చేందుకు రికార్డులు సిద్ధం చేసినట్లు తెలిసింది. అందులో భాగంగా ఇటీవల 40 ఎకరాల్లో పవర్‌బోర్లు వేశారు. రాయపూడికి వెళ్లే మార్గంలో మరో ఐదు ఎకరాల మెట్ట భూమిని జరీబుగా మార్చినట్లు విశ్వసనీయ సమాచారం.
     
    జరీబు భూములను మెట్టగా మార్చినట్లు స్థానిక రైతులు కొందరు రెవెన్యూ అధికారులను నిలదీశారు. నిమ్మతోటలు ఉన్న భూములను మెట్టగా మార్చారని తెలుసుకున్న సంబంధిత రైతులు మంగళవారం పొద్దుపోయాక సాక్షి ప్రతినిధులను కలిశారు. అధికార పార్టీ నాయకులు, రెవెన్యూ అధికారులు కలిసి చేస్తున్న మోసాన్ని వివరిస్తుండగా ఇద్దరు టీడీపీ నాయకులు వచ్చి బలవంతంగా ఆ రైతులను తీసుకెళ్లారు. సీఆర్‌డీఏ అధికారులను కలిశారు. భూములను మార్చే విషయం బయటపడి  పత్రికల్లో వస్తే ఇబ్బంది అవుతుందని భావించిన అధికారులు బుధవారం బోరుపాలెం గ్రామంలో సమావేశమయ్యారు.
     
     ఈ సందర్భంగా పలువురు రైతులు కొందరు జరీబుని మెట్ట భూములుగా ఎలా మారుస్తారని నిలదీశారు. తమకొచ్చిన సమాచారం నిజమని తేలితే ఊరుకునేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. అనుకున్నట్లు అంతా సవ్యంగా జరిగితే అదనంగా వచ్చే 250 గజాల వాణిజ్య ప్లాట్లను టీడీపీ నాయకులు, అధికారులు కొందరు పంచుకునేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం.
     
     జరీబు భూములంటే..
     జరీబు భూముల గుర్తింపునకు కొన్ని నిబంధనలు విధించారు. నదికి దగరగా ఉండాలి. 50 అడుగుల లోపు నీరు, లూజ్ సాయిల్, ఉద్యానవన పంటలు సాగు చేసేవిగా ఉండే భూములను జరీబుగా నిర్ణయిస్తారు. మిగిలినవి మెట్ట భూములుగా గుర్తించి ఆమేరకు ప్లాట్లు పంపిణీ చేస్తారు.

Advertisement
Advertisement