రాష్ట్రంలో కార్మికుల పిల్లల విద్య కోసం రూ.వెయ్యి కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు కార్మిక శాఖ మంత్రి పరమేశ్వర్ నాయక్ వెల్లడించారు.
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో కార్మికుల పిల్లల విద్య కోసం రూ.వెయ్యి కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు కార్మిక శాఖ మంత్రి పరమేశ్వర్ నాయక్ వెల్లడించారు. బుధవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ప్రతి మహా నగర పాలికెలో ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఏడు ఆశ్రమ పాఠశాలలను కార్మికుల పిల్లల కోసమే ప్రత్యేకంగా నిర్మించనున్నట్లు తెలిపారు. వీటిల్లో ఒకటో తరగతి నుంచి పీయూసీ వరకు ఉచిత విద్యను అందించనున్నట్లు చెప్పారు. ఈ పాఠశాలల్లో బోధన ప్రైవేటు సంస్థలకు దీటుగా ఉండాలనే లక్ష్యంతో వీటి నిర్వహణను ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు అప్పగించే ఆలోచన ఉందన్నారు.
పీయూసీ లేదా డిప్లొమా చదువుతున్న కార్మికుల పిల్లలకు ఏడాదికి రూ.20 వేల ప్రోత్సాహక ధనాన్ని, ఇంజనీరింగ్, వైద్య విద్యను అభ్యసిస్తున్న కార్మికుల పిల్లలకు నెలకు రూ.2 వేలు చొప్పున ఉపకార వేతనాన్ని అందిస్తామని వివరించారు. బృహత్ బెంగళూరు మహా నగర పాలికె పరిధిలో రూ.24 కోట్ల వ్యయంతో నాలుగు కల్యాణ మంటపాలను నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో కూడా రూ.3 కోట్లు చొప్పున ఖర్చుతో నిర్మిస్తామని చెప్పారు. సెస్ రూపంలో బిల్డర్ల ద్వారా వసూలు చేసిన మొత్తం రూ.2,066 కోట్లు కార్మిక శాఖ వద్ద ఉందన్నారు. కనుక నిధుల కొరత ఎదురు కాబోదన్నారు.