వింత ఆచారం.. ‘ఎర్రని’ అభిషేకం!

Priest Anoint With Chilli Powder Mixed Water - Sakshi

చెన్నై: కొన్ని ఆచారాలు వింత ఉంటాయి. తమిళనాడు ధర్మపురి జిల్లాలోని నల్లంపల్లిలో పాటించే ఆచారం కూడా ఇలాంటిదే. స్థానిక కరుప్పస్వామి ఆలయంలో ఆడి(ఆషాడ) అమావాస్య సందర్భంగా అర్చకుడికి కారం కలిపిన నీళ్లతో అభిషేకం చేస్తారు. ఏంటి నమ్మలేకపోతున్నారా! ప్రతి ఏటా ఆడి అమావాస్య రోజున ఆలయ ఉత్సవం నిర్వహించటం ఆనవాయితీ. ఉత్సవంలో భాగంగా పెద్ద ఎత్తున ఆలయానికి భక్తులు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరిగా ఆలయంలో అనాదిగా వస్తున్న ఆచారం నిర్వహించారు. అర్చకుడు ముందుగా ఓ ఆసనంపై కూర్చుని భక్తులకు ఉపదేశం చేయగా అక్కడే సిద్దంగా బిందెలలో ఉంచిన‌ నీటిలో 75 కిలోల దంచిన ఎండు మిరపకాయల కారం పోసి కలిపారు.

కారం కలిపిన జలంతో అర్చకుడికి గ్రామ పెద్దలు అభిషేకం చేశారు. భక్తులంతా ఈ ఘట్టాన్ని ఎంతో ఆసక్తిగా తిలకించారు. కారం కలిపిన నీటితో అభిషేకం చేస్తున్నా అర్చకుడు ఎటువంటి ఇబ్బంటి పడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కారం మంట పెడుతున్నా కరుప్పస్వామిపై ఉన్న భక్తి వల్ల అర్చకుడుకి ఏమాత్రం బాధ ఉండదని భక్తులు విశ్వసిస్తారు. తమ గ్రామంలో ఏళ్లు తరబడి వస్తున్న ఈ ఆచారాన్ని కొనసాగించటం ఆనందంగా ఉందని గ్రామస్తులు అంటున్నారు. ఇలా చేయటం ద్వారా అర్చకుడి ఉపదేశ వాక్కు ఫలిస్తుందని వారి‌నమ్మకమట. గ్రామస్తుల ఆచారాలు ఎలా ఉన్నా కారం నీళ్లతో మనిషికి అభిషేకం విచిత్రంగానే ఉంది.   

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top