కాంగ్రెస్‌లో కలహం | Outbreaks of Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో కలహం

Jun 21 2014 2:28 AM | Updated on Mar 29 2019 9:24 PM

లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి కాంగ్రెస్‌లో కలహాలు రేపుతోంది. తాజాగా రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బీకే. హరిప్రసాద్‌ల మధ్య శుక్రవారం మాటల తూటాలు పేలాయి.

  • పేలిన మాటల తూటాలు
  •  హరిప్రసాద్‌ను తూర్పారబట్టిన మంత్రి రామలింగారెడ్డి
  • సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి కాంగ్రెస్‌లో కలహాలు రేపుతోంది. తాజాగా రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బీకే. హరిప్రసాద్‌ల మధ్య శుక్రవారం మాటల తూటాలు పేలాయి. సహజంగా సౌమ్యుడైన రామలింగా రెడ్డి, హరిప్రసాద్‌ను తూర్పారబట్టారు. ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయా ఇన్‌ఛార్జి మంత్రులు రాజీనామా చేయాలని హరిప్రసాద్ సూచించడంపై రామలింగా రెడ్డి విలేకరుల వద్ద తీవ్రంగా స్పందించారు.

    శాసన సభ ఎన్నికల్లో ఆయన సోదరుడు, ఆయన నియోజక వర్గంలో 50 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారని, హరిప్రసాద్ పేరు ప్రస్తావించకుండా దెప్పి పొడిచారు. ఆయన ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావడం సాధ్యం కాలేదా అని ఎద్దేవా చేశారు. తాను అధికారానికి అతుక్కుని ఉండబోనని అంటూ ‘అవకాశం ఇస్తే  సేవ చేస్తా, లేదంటే ఇంట్లో ఉంటా’ అని చెప్పారు.

    ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కోరితే తక్షణమే రాజీనామా చేస్తానని తెలిపారు. రాష్ట్రంలో తొమ్మిది లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నామని, దేశంలో ఏ రాష్ర్టంలోనూ కాంగ్రెస్‌కు ఇన్ని సీట్లు రాలేదని తెలిపారు. ముఖ్యమంత్రి ఉత్తమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని ప్రశంసించారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

    లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి కేవలం ఇన్‌ఛార్జి మంత్రులను మాత్రమే బాధ్యులను చేయడం సరికాదని హితవు పలికారు. జిల్లా కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులు, కేపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఏఐసీసీ కార్యదర్శులు బాధ్యత వహించాలని ఆయన చెప్పారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement