రోజురోజుకూ ముంబైలో మహిళలపై పెరుగుతున్నదాడులు పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.
సాక్షి, ముంబై: రోజురోజుకూ ముంబైలో మహిళలపై పెరుగుతున్న దాడులు పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఏదో ఓ ప్రాంతంలో మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని సంఘటనల్లో నిందితులు దొరికినా.. కొన్ని సంఘటనలు పోలీసులకు సవాలుగా మారాయి. దీంతో ముంబైలో మహిళలకు రక్షణ కరువైందని, భద్రత అంశం ఆందోళన కలిగించేలా ఉంది. ఈ నేపథ్యంలో ముంబై పోలీసు కమిషనర్ పదవిని ఇంత వరకు భర్తీ చేయకపోవడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులకు సవాల్..
ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అనేక సంఘటనలు జరిగాయి. గతనెల ఐదో తేదీన తెలుగు అమ్మాయి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనూహ్య కుర్లాలోని లోకమాన్య తిలక్ టెర్మినల్(ఎల్‌టీటీ) దిగి అనంతరం కన్పించకుండా పోయింది. 16వ తేదీ కంజూర్‌మార్గ్, బాండూప్‌ల మధ్య ఆమె మృతదేహం లభించింది. అప్పటి నుంచి ఆమె హత్య కేసు మిస్టరీగానే మిగిలింది. అదేనెల 24న పవాయిలో పార్టీ నుంచి రాత్రి ఆలస్యంగా ఇంటికి తిరిగివస్తున్న 25 ఏళ్ల యువతిపై ఆ భవనం సెక్యూరిటీ గార్డు నడిరోడ్డుపై రాత్రి రెండున్నర గంటలకు అత్యాచారం జరిపాడు.
27న బాంద్రా రైల్వేస్టేషన్‌లో వెయిటింగ్ రూమ్‌లో కూర్చుని ఉన్న 25 ఏళ్ల జర్మనీ యువతితో కొందరు అసభ్యకరంగా ప్రవర్తించారు. నిందితులను నిర్మల్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. 28న అంధేరిలో కొత్తగా వివాహం చేసుకొని కాపురానికి వచ్చిన ఓ మహిళపై గ్యాస్ మెకానిక్‌లు ఇంట్లో చొరబడి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 30న ఫోర్ట్ ప్రాంతంలో 50 ఏళ్ల మహిళపై తాగుబోతులు దాడి చేశారు. ఇలా ప్రధాన నగరంతోపాటు ఉప నగరాల్లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన అనేక సంఘటనలను పరిశీలిస్తే నగరంలో మహిళలకు భద్రత కరువవుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ సంఘటనలపై ఇప్పటికే ప్రజలు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. అనూహ్య సంఘటన అనంతరం తెలుగు సంఘాలతోపాటు క్రైస్తవ సంఘాలు, ఇతర సంఘాల ప్రతినిధులు మహిళలకు భద్రత కల్పించాలంటూ ఆందోళనలు చేశారు. హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్, ముంబై పోలీసు అధికారులందరికీ వినతి పత్రాలు సమర్పించారు. అయితే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా వారం రోజులుగా ఖాళీగా ఉన్న ముంబై పోలీసు కమిషనర్ పదవిని ఇంకా భర్తీ చేయకపోవడం చూస్తుంటే భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.