నటుడు కమలహాసన్ తన పేరును తమిళంలోకి మార్చుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హెచ్.రాజా వ్యాఖ్యానించారు.
చెన్నై: నటుడు కమలహాసన్ తన పేరును తమిళంలోకి మార్చుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హెచ్.రాజా వ్యాఖ్యానించారు. కమలహాసన్ ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా మాట్లాడిన తీరు పెద్ద దుమారాన్నే రేపింది. ఆస్తికం,నాస్తికం, హేతువాదం, మూఢ నమ్మకాలు, పశు మాంసం, అవార్డు తిరిగి ఇవ్వడం వంటి పలు అంశాలపై కమలహాసన్ తనదైన బాణీలో చేసిన వ్యాఖ్యలపై తాజాగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తీవ్రంగా ఖండిస్తూ సోమవారం ఆయనకు ఒక లేఖ రాశారు.
అందులో నటుడు కమలహాసన్ తన పుట్టిన రోజు సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అటు ఆస్తికాన్ని, ఇటు నాస్తికాన్ని సూచించేవిగా కాకుండా సంస్కృత పదాల్లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. అసలు కమలహాసన్ అన్న పేరు తమిళమా అంటూ ప్రశ్నించారు. ముందు సంస్కృతం అయిన కమలహాసన్ అన్న తన పేరును ఆయన మార్చుకోవాలని సూచించారు. అదే విధంగా తన కూతురుకు కూడా శ్రుతి అనే సంస్కృత పేరునే పెట్టుకున్నారని ఆరోపించారు. ఇలా కమలహాసన్ పలు విషయాల గురించి మూలాలు తెలియకుండా అవగాహనారాహిత్యంతో మాట్లాడడాన్ని హెచ్.రాజా తప్పుపట్టారు.