ఆప్‌కు ఆదిలోనే అడ్డంకి ఎదురయింది. కేంద్రం హఠాత్తుగా సీఎన్జీ ధరలను పెంచడంతో కొత్త ప్రభుత్వం ఇబ్బందిలో పడింది. పెంచిన ధరలను
ఆప్‌కు ఆదిలోనే అడ్డంకి ఎదురయింది. కేంద్రం హఠాత్తుగా సీఎన్జీ ధరలను పెంచడంతో కొత్త ప్రభుత్వం ఇబ్బందిలో పడింది. పెంచిన ధరలను ఉపసంహరించే అవకాశాన్ని పరిశీలిస్తామని, సాధ్యం కాకుంటే ఆటో చార్జీలను పెంచాల్సి రావొచ్చని అరవింద్ కేజ్రీవాల్ సంకేతమిచ్చారు. ఆప్ సహకారంతోనే కేంద్రం సీఎన్జీ ధరలను పెంచిందని బీజేపీ ఆరోపించింది.
సాక్షి, న్యూఢిల్లీ:రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం మరో రెండు రోజులలో అధికారం చేపడుతుందనగా కేంద్రం సీఎన్జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) ధరలను పెంచింది. ఈ ఆకస్మిక నిర్ణయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పెంచిన ధరలను ఉపసంహరించే అవకాశాన్ని పరిశీలిస్తానని ఆయన చెప్పారు. లేకపోతే ఢిల్లీలో ఆటో చార్జీలను పెంచాల్సి రావొచ్చని సంకేతం ఇచ్చారు. సీఎన్జీ ధర పెంపునకు నిరసనగా సమ్మె చేస్తామంటున్న ఆటో యూనియన్లు ఆ యోచనను విరమించాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.
సమస్య పరిష్కారానికి రెండు రోజుల సమయం ఇవ్వాలని కోరారు. సీఎన్జీ ధరల పెంపునకు గల కారణాలను పదవీ చేపట్టిన తరువాత తెలుసుకుంటానన్నారు. ధర పెంచక తప్పదని తేలితే రాజధానిలో ఆటో చార్జీలను సవరిస్తామని ఆయన చెప్పారు. ‘ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఢిల్లీలో అధికారం చేపట్టడానికి రెండు రోజుల ముందు సీఎన్జీ ధరలను పెంచడంలో ఔచిత్యం ఏంటి ? కేంద్రం మమ్మల్ని కూడా అడిగి ఉంటే బాగుండేది. సీఎన్జీ ధరలను పెంచిన సమయంపై అనుమానాలు కలుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత సీఎన్జీ ధరల పెంపునకు సంబంధించిన ఫైళ్లు పరిశీలిస్తాను.
పెంపును ఉపసంహరించడం సాధ్యమవుతుందేమో చూస్తాను’ అని కేజ్రీవాల్ చెప్పారు. సీఎన్జీ ధరలను పెంచడంపై అసంతృప్తితో ఉన్న ఆటో డ్రైవర్లు సమ్మెకు సిద్ధమవుతున్నారని, అయితే తమ పార్టీ ఎన్నికల ప్రచారానికి వాళ్లు ఎంతగానో తోడ్పడ్డారని కేజ్రీవాల్ చెప్పారు. అవసరమైతే ఢిల్లీలోని ఆటో డ్రైవర్లందరితో సమావేశమై వారి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. అయితే ఆటోవాలాల వైఖరిపైనా కేజ్రీవాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఢిల్లీవాసులు ఆటోడ్రైవర్లపై ఆగ్రహంతో ఉన్నారు. వాళ్లు తమ ప్రవర్తన మార్చుకోవాలి. ఇందుకోసం ఆటో డ్రైవర్లకు శిక్షణ ఇస్తాం’ అని పేర్కొన్నారు. సీఎన్జీ ధరల పెంపునకు నిరసనగా జనవరి ఏడున సమ్మె చేస్తామని ప్రకటించిన ఆటో డ్రైవర్లు అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.
ఆయనపై పూర్తి నమ్మకం ఉందన్నారు. పెంచిన సీఎన్జీ ధరలను ఉపసంహరించుకోకుంటే, ఆటో చార్జీలను పెంచాలని ఆటో సంఘాల ప్రధాన కార్యదర్శి రాజేంద్ర సోనీ డిమాండ్ చేశారు. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ గురువారం అర్ధరాత్రి నుంచి సీఎన్జీ, పీఎన్జీ ధరలు పెంచింది. కిలో సీఎన్జీ ధరను రూ.4.50 మేర, పీఎన్జీ ధర రూ.5.15 పెరిగింది. దీంతోఢిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ.50.10లకు చేరింది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లో ఇది రూ.56.70 అయింది. గడచిన మూడు నెలల్లో సీఎన్జీ ధరలను పెంచడం ఇది రెండోసారి. ఢిల్లీలో పీఎన్జీ ధర కిలోకు రూ. 29.50 కాగా, ఎన్సీఆర్‌లో రూ.31 అయింది. కోర్టు ఉత్తర్వుల కారణంగా సీఎన్జీ ధరలను భారీగా పెంచవలసి వ చ్చిందని ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజీఎల్) వివరణ ఇచ్చింది. ఖనిజవాయువు కేటాయింపు కోర్టు ఉత్తర్వుల కారణంగా భారీగా తగ్గిందని ఐజీఎల్ తెలిపింది.