‘భాస్కరుడి’కి అమ్మ అభయం | Sakshi
Sakshi News home page

‘భాస్కరుడి’కి అమ్మ అభయం

Published Sat, Nov 14 2015 8:43 AM

Jayalalitha positive response to vijayabaskar issue

చెన్నై : ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్‌కు సీఎం జయలలిత అభయహస్తం ఇచ్చారు. ఇంటెలిజెన్స్ విచారణ మంత్రికి అనుకూలంగా రావడంతో పదవీ గండం తప్పినట్టు అయింది. కులచిచ్చుతో వీరంగం సృష్టించే వాళ్లకు చెక్ పెట్టే రీతిలో మంత్రికి వ్యతిరేకంగా వ్యవహరించిన వాళ్లకు అమ్మ ఉద్వాసన పలకడం అన్నాడీఎంకే వర్గాలకు షాక్ ఇచ్చినట్టు అయింది.

అన్నాడీఎంకే సర్కారు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తరచూ మంత్రివర్గంలో మార్పులు జరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఎక్కువ శాతం మంది మంత్రులపై వచ్చిన పలు రకాల ఆరోపణలు, ఫిర్యాదులే కారణంగా చెప్పవచ్చు. ఏ మంత్రిపైన అయినా సరే చిన్న పాటి ఆరోపణలు, ఫిర్యాదులు వస్తే చాలు తక్షణం జయలలిత స్పందించడం జరుగుతోంది.
 
 మంత్రిపై ఫిర్యాదులు వచ్చినా, ఆయనకు వ్యతిరేకంగా పత్రికల్లో కథనాలు వచ్చినా, అన్నాడీఎంకే కార్యాలయానికి ఫిర్యాదులు వచ్చినా, ఆయా జిల్లాల్లోని నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కినా ఆ మంత్రి పదవి ఊడినట్టే. మరోచాన్స్ అంటూ లేని రీతిలో పదవులు ఊడుతూ వస్తున్నాయి. కొందర్ని క్షమించి మళ్లీ ఆహ్వానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ దిశగా జయలలిత నమ్మిన బంట్లు, పలువురు ముఖ్య, కీలక నాయకుల పదవులు ఊడిన సందర్భాలు అనేకం.
 
ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల మంత్రికి వ్యతిరేకంగా కొన్ని జిల్లాల్లో ఏకంగా కుల వివాదాలతో చిచ్చు రగిలినా చివరకు పదవీ గండం నుంచి ఆ మంత్రి తప్పించుకోవడం గమనార్హం. ఆరోగ్య మంత్రి విజయ్‌కు ఉద్వాసన పలికిన తర్వాత ఆ శాఖకు పుదుకోట్టై జిల్లా విరాళి మలై ఎమ్మెల్యే విజయ భాస్కర్‌కు అప్పగించారు. స్వతహాగా వైద్యుడు కావడంతో విజయ భాస్కర్ ఆరోగ్య శాఖ మీద పూర్తి పట్టు సాధించారని చెప్పవచ్చు.

రెండేళ్లకు పైగా ఆ పదవిలో కొనసాగుతూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గత నెల సొంత జిల్లా పుదుకోట్టైలో మంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే బయలుదేరింది. తమను కులం పేరుతో దూషించారంటూ కరంబక్కుడి పంచాయతీ యూనియన్ మాజీ కార్యదర్శి చొక్కలింగం, ఆయన భార్య, ఆ యూనియన్ అధ్యక్షురాలు గంగయ్యమ్మాల్ ఆరోపించడం వివాదాస్పదమైంది.
 
ముత్తయ్యార్ సామాజిక వర్గం ఏకం కావడంతో మంత్రికి వ్యతిరేకంగా ఉద్యమం బయలుదేరింది. పుదుకోట్టై, తిరుచ్చి, తంజావూరు, మదురైలోని ఆ సామాజిక వర్గం ఏకమై మంత్రికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగింది. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో మార్పు అనివార్యం అన్న ప్రశ్న బయలుదేరింది. సమగ్ర విచారణకు ఇంటెలిజెన్స్‌ను రంగంలోకి దించినట్టు సమాచారం. ఈ విచారణలో రాజకీయ లాభం కోసం కులచిచ్చును తెర మీదకు తెచ్చారని, దీని వెనుక డీఎంకే హస్తం ఉందని తేలింది.
 
దీన్ని సీరియస్‌గా పరిగణించిన అమ్మ పార్టీలో కుల చిచ్చు, వివాదాలకు చెక్ పెట్టే రీతిలో ఆగమేఘాలపై చొక్కలింగం, గంగయ్యమ్మాల్‌కు ఉద్వాసన పలికారు. ఆ ఇద్దర్నీ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించడంతో ఆ సామాజికవర్గానికి చెందిన ఇతర నేతల్లో గుబులు బయలు దేరింది. చివరకు పదవి గండం నుంచి విజయ భాస్కర్ తప్పించుకుని అమ్మ అభయం పొందారు.

ఇక ముత్తయ్యార్ సామాజిక వర్గాన్ని ఆకర్షించే రీతిలో డీఎంకే ఎంపి కనిమొళి పావులు కదపడం గమనార్హం. ఆ ఇద్దర్నీ తమ వైపునకు తిప్పుకుని ఆ సామాజిక వర్గం మద్దతు కూడగట్టుకునే రీతిలో ప్రయత్నాలు సాగించే పనిలో పడ్డట్టు సమాచారం.

Advertisement
Advertisement