నన్ను ప్రాణాలతో వదిలిపెట్టరు

IMA Jewels Scam Accused Releases Video - Sakshi

సాక్షి, బెంగళూరు: వేలాది కోట్ల రూపాయల మేర డిపాజిటర్లకు ఎగనామం పెట్టి పరారీ అయిన బెంగళూరులోని ఐఎంఏ జువెలర్స్‌ గ్రూప్‌ అధినేత మహమ్మద్‌ మన్సూర్‌ ఖాన్‌ ఆదివారం ఒక సంచలనాత్మక వీడియో విడుదల చేశారు. తాను ఎక్కడికి పారిపోలేదని చెబుతూ ఐఎంఏ కుంభకోణంలో కొందరు రాజకీయ నేతల హస్తం కూడా ఉందని వారి పేర్లను బయటపెట్టడంతో ఈ కేసు మరింత క్లిష్టమయ్యేలా ఉంది. దుబాయ్‌ నుం చి వీడియో విడుదల చేసినట్లు భావిస్తున్నారు. తన సంస్థను మూసివేసేందుకు ప్రయత్నిస్తున్న కొందరు రాజకీయ నేతలు, వ్యాపారులకు కృతజ్ఞతలు అని వ్యంగ్యంగా అన్నారు. రాజ్యసభ మాజీ ఎంపీ రహమాన్‌ ఖాన్, మహమ్మద్‌ ఉబేదుల్లా షరీఫ్, పాస్‌బన్‌ పత్రిక ఎడిటర్‌ షరీఫ్, ముక్తార్‌ అహ్మద్, జేడీఎస్‌ ఎమ్మెల్సీ శరవణ, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారవేత్త ఫైరోజ్‌ అబ్దుల్లా, ప్రెస్టీజ్‌ గ్రూప్‌ ఇర్ఫాన్‌లు కలసి తనను ముగించేందుకు పక్కా ప్రణాళికలు వేశారని, అలాగే ఐఎంఏను ముగించే విషయంలో వీరంతా సఫలీకృతులయ్యారని ఆరోపించారు. ఐఎంఏ కంపెనీ ఎవరినీ మోసం చేయలేదని, 13 ఏళ్లలో ఐఎంఏ 12 వేల కోట్ల రూపాయల లాభాలను పెట్టుబడిదారులకు అందించినట్లు తెలిపాడు.  

సాయం చేయండి కమిషనర్‌  
రాజకీయ నేతలు, పెట్టుబడిదారులు తన మెడపై వచ్చి కూర్చొన్నారని, ఇలాంటి సమయంలో కుటుంబాన్ని వదిలేసి పరారీ కావాల్సి వచ్చిందని చెప్పారు. ఈ నెల 24న బెంగళూరుకు వచ్చేందుకు ప్లాన్‌ చేసుకున్నానని, కానీ తన పాస్‌పోర్టు, టికెట్‌ను అధికారులు సీజ్‌ చేశారన్నారు. బెంగళూరు నగర పోలీసు కమిషనర్‌ అలోక్‌ కుమార్‌ న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. ఐఎంఏ స్కామ్‌లో అసలు నిజాలను తాను వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నానని, భారత్‌కు వచ్చేందుకు అలోక్‌ కుమార్‌ సహకరించాలని విజ్ఞప్తి చేశాడు.
 
ప్రాణహాని ఉంది  
తాను భారతదేశానికి రావాలంటే భయంగా ఉందని, తనకు ప్రాణహాని ఉందని, పోలీసు కస్టడీలోనే తనను అంతమొందించేందుకు కొందరు ప్లాన్లు వేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తన కుటుంబాన్ని, బెంగళూరును వదిలి వచ్చినట్లు తెలిపాడు. ఒకవేళ ఐఎంఏ కేసును సీబీఐకి అప్పగించినా విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఒకవేళ తాను తప్పు చేశానని అంటే తన వెనుక అనేక మంది ఉన్నారని, వారికి కూడా శిక్ష పడాలని చెప్పారు. తాను ఇండియా వస్తే అంతమొందించే ప్రమాదముందని అన్నారు.

ఆ మాటల్ని అంగీకరించలేం: సిట్‌  
మన్సూర్‌ ఖాన్‌ విడుదల చేసిన వీడియోను పరిగణనలోకి తీసుకోలేమని సిట్‌ అధికారి ఎస్‌. గిరీశ్‌ తెలిపారు. వీడియో గురించి ఆయన మీడియాతో స్పందిస్తూ ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా నిందితుడు చెప్పిన విషయాలను అంగీకరించేది లేదని అన్నారు. నిందితుడు ఎవరెవరి మీద ఆరోపణలు చేసినా, వాస్తవాలు విచారణలో మాత్రమే తెలుస్తాయని చెప్పారు. మన్సూర్‌ఖాన్‌ ఐఎంఏ కేసులో ప్రధాన నిందితుడని, అతనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయిందని, అంతేకాకుండా రెడ్‌ కార్నర్‌ నోటీసు కూడా జారీ చేసినట్లు తెలిపారు. ఆయన స్వదేశానికి వస్తే రక్షణ కల్పిస్తామని గిరీశ్‌ తెలిపారు.     

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top