నిజాయితీకి నిండు ప్రాణం బలి | Sakshi
Sakshi News home page

నిజాయితీకి నిండు ప్రాణం బలి

Published Tue, May 8 2018 11:50 AM

Illicit sand miners brutally murder police constable near Nanguneri - Sakshi

బెదిరింపులకు బెదరలేదు.. ప్రలోభాలకు లొంగలేదు... పోలీసు శాఖలో నిగూఢమై ఉన్న నిజాయితీకి నిలువుటద్దంగా నిలిచాడు.అక్రమార్కులను ఒంటి చేత్తో పట్టుకుని చట్టానికి పట్టించే ప్రయత్నంలో కరుడుగట్టిన ఇసుక మాఫియా చేతుల్లో దారుణంగా హతమయ్యాడు. అతని మరణంతో ఐదు నెలల గర్భిణిగా ఉన్న భార్య, నాలుగేళ్ల కుమారుడు అనాథలయ్యారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న పోలీస్‌ హెడ్‌కానిస్టేబుల్‌ను ఇసుక మాఫియా కిరాతకంగా హతమార్చింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తిరునెల్వేలి జిల్లా నాంగునేరి తాలూకా చింతామణికి చెందిన జగదీశ్‌ దురై (34) విజయనారాయణం పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. విజయనారాయణం సమీపంలో రేయింబవళ్లు ఇసుక అక్రమరవాణా సాగుతోంది. నంబిచెరువు నుంచి ఇసుక తరలిస్తున్నట్లు జగదీశ్‌కు సమాచారం అందడంతో సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మోటార్‌సైకిల్‌పై వెళ్లి తనిఖీలు నిర్వహించాడు. గుర్తుతెలియని వ్యక్తులు ఇసుక లోడ్‌చేసిన ట్రాక్టర్‌తో సహా పరారయ్యేందుకు ప్రయత్నించారు.

 జగదీశ్‌ వారిని వెంబడించాడు. పరప్పాడి–తామరైకుళం అటవీ ప్రాంతంలో వెనుకవైపు టైరు పంచరై ట్రాక్టర్‌ బోల్తాపడి నిలిచిపోయింది. ట్రాక్టర్‌ నుంచి దిగిన 8 మంది వ్యక్తులు తమను వెంటాడుతున్న జగదీశ్‌పై గడ్డపార, ఇనుపరాడ్డు, దుడ్డుకర్రలతో విచక్షణారహితంగా దాడిచేశారు. గిలగిలాకొట్టుకుంటూ జగదీశ్‌ అక్కడే ప్రాణాలువిడిచాడు. అతరువాత నిందితులు ట్రాక్టర్‌ను సంఘటన స్థలంలోనే విడిచి పారిపోయారు. గస్తీకి వెళ్లిన జగదీశ్‌ తిరిగి రాకపోవడంతో వెతుక్కుంటూ వెళ్లిన పోలీసులు హత్య గురైనట్లు గుర్తించారు. పంచరైన ట్రాక్టర్‌కోసం నలుగురు వ్యక్తులు రావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారికోసం గాలింపు చేపట్టారు. 

రెండు నెలలుగా బెదిరింపులు
ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపిన జగదీశ్‌కు ‘మా జోలికి రావద్దు’ అంటూ రెండునెలలుగా బెదిరింపులు వస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక తమకు అనుకూలమైన పోలీసుల ద్వారా జగదీశ్‌ను మచ్చిక చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఎవరికీ లొంగకుండా నిజాయితీగా విధులు నిర్వర్తించడంతో చంపేస్తామని కూడా హెచ్చరించి చివరకు అన్నంత పనిచేసి పొట్టనపెట్టుకున్నారు. 

తల్లడిల్లిన సతీమణి
జగదీశ్‌ హత్యకు గురైనట్లు సోమవారం ఉదయం భార్య, బంధువులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఐదునెలల గర్భిణిగా ఉన్న భార్య మారియారోస్‌ మార్గరెట్‌ (30) తన కుమారుడు జోయల్‌ (4)ను వెంటపెట్టుకుని హత్య జరిగిన ప్రదేశానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. నిజాయితీగా పనిచేస్తున్న తన భర్తను పాపిష్టి మూకలు ప్రాణం తీసాయని మృతదేహంపైపడి గుండెలవిసేలా రోదించారు. తనకు బెదిరింపులు వస్తున్నాయని ఉన్నతాధికారులకు భర్త తెలియజేసినా పట్టించుకోనందునే ఆయన ప్రాణాలు పోయాయని ఆమె నిందించారు. తిరునెల్వేలి జిల్లా ఎస్పీ అరుణ్‌శక్తికుమార్, నంగునేరి ఏఎస్పీ సురేష్‌కన్నన్‌ తదితరులు ఆమెను ఓదార్చారు.  

Advertisement
Advertisement