
ఫుట్‌బాల్‌కు ఓ హీరో కావాలి
భారతీయ ఫుట్‌బాల్‌కి మంచి కథానాయకుడు దొరికితే అది అందని తీరాలకు చేరుతుందని విపరీతంగా విశ్వసించే నటుడు జాన్ అబ్రహాం.. ......
నటుడు జాన్ అబ్రహాం
న్యూఢిల్లీ: భారతీయ ఫుట్‌బాల్‌కి మంచి కథానాయకుడు దొరికితే అది అందని తీరాలకు చేరుతుందని విపరీతంగా విశ్వసించే నటుడు జాన్ అబ్రహాం.. ఈ ఆట ఆధారంగా ఓ సినిమా కూడా తీస్తున్నాడు. ఫుట్‌బాల్ అంటే విపరీతమైన క్రేజ్ కలిగిన ఈ నటుడు అందుకు సంబంధించిన ఫ్రాంచైజీల్లోనూ పెట్టుబడులు పెట్టాడు. 2014 ఫిఫా వరల్డ్ కప్ వేడుకలను తిలకించేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ‘మంచి క్రీడాకారుడు ఉంటే ఏ ఆటకైనా విపరీతమైన క్రేజ్ పెరుగుతుంది. అందుకు ఉదాహరణ సానియా మీర్జా, నైనా నెహ్వాల్... వీరందరికంటే ముందు ప్రకాశ్ పదుకొణే. గోల్ఫ్‌లో టైగర్‌ఉడ్స్ కూడా ఇదే చేశాడు. భారతీయ ఫుట్‌బాల్‌కి కూడా అటువంటి కథానాయకుడు కావాలని నేను అనుకుంటున్నా’ అని జాన్ అన్నాడు. ‘భైచుంగ్ భాటియా దాదాపు అదే స్థాయిలో ఉన్నాడు. అయినప్పటికీ ఇంకా అంతకంటే మంచి కథానాయకుడు అవసరం. అటువంటి కథానాయకుడు దొరికిన క్షణంలో భారతీయ ఫుట్‌బాల్ ఆట ఉన్నతస్థానానికి చేరుకుంటుంది’ అని చెప్పాడు.
అయితే ఇందుకు కొంత సమయం పడుతుందని ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి చె ప్పాడు. అర్జెంటీనా ఆటగాడు డీగో మారడోనా ఆటలోకి దిగితే చాలు అబ్రహాం టీవీకి అతుక్కుపోతాడు. ‘డీగోని అతని తండ్రి తెల్లవారకముందే నిద్ర లేపేవాడు. అందువల్లనే డీగో మంచి నైపుణ్యం కలిగిన ఆటగాడిలా రాటుతేలాడు.ఆ కారణంగానే డీగో ఈ స్థాయికి చేరుకున్నాడు. ఈ గొప్పదనం డీగో తండ్రిదే. నేను కూడా భారత్ తరఫున ఫుట్‌బాల్ ఫుట్‌బాల్ ఆడే వాడినేమో. అయితే ఫుట్‌బాల్ నేర్చుకోవాలా లేక ఎంబీయే చేయాలా అనే సమస్య తలెత్తింది. దీంతో నేను ఎంబీయేనే ఎంచుకున్నా’ అంటూ తన గతాన్ని గుర్తుతెచుకున్నాడు జాన్.