మిత్రుల ఆశలపై నీళ్లు చల్లిన బీజేపీ | Hopes allies water Sprinkled with BJP | Sakshi
Sakshi News home page

మిత్రుల ఆశలపై నీళ్లు చల్లిన బీజేపీ

Jan 18 2015 5:33 AM | Updated on Sep 2 2017 7:52 PM

బీజేపీ వైఖరిపై స్వాభిమాని షేట్కారీ సంఘటన్, రాష్ట్రీయ సమాజ్ పక్ష్, ఆర్‌పీఐ పార్టీల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

సాక్షి, ముంబై: బీజేపీ వైఖరిపై స్వాభిమాని షేట్కారీ సంఘటన్, రాష్ట్రీయ సమాజ్ పక్ష్, ఆర్‌పీఐ పార్టీల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మంత్రి మండలి విస్తరణ కోసం ఎదురు చూస్తున్న వీరికి బీజేపీ వైఖరితో ఆశలు సన్నగిల్లుతున్నాయి. నాలుగు విధాన మండలి స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సీట్లపై ఆశలు పెట్టుకున్న మిత్రులకు బీజేపీ మొండిచేయి చూపినట్టు తెలుస్తోంది. విధానమండలికి ఎన్నికై ఆ తరువాత మంత్రి పదవికి ఎర వేయాలనుకున్న మిత్రుల ఆశలను బీజేపీ మొగ్గలోనే తుంచివేసింది.

మూడు స్థానాల్లో స్వయంగా పోటీ చేయాలని, మరో స్థానం శివసేనకు వదిలేయాలని బీజేపీ నిర్ణయించినట్టు తెలిసింది. అయితే 2017 ప్రారంభంలో జరగబోయే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రామ్‌దాస్ ఆఠవలేకు చెందిన ఆర్‌పీఐకి ఓ మంత్రి పదవి ఇచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అందువల్ల మండలి స్థానాల్లో ఒకటి ఆర్‌పీఐకి కేటాయించనున్నట్టు సమాచారం.

ఇక శివసంగ్రామ్ పార్టీ నాయకుడు వినాయక్ మెటే ఇటీవలే బీజేపీ సభ్యత్వం తీసుకోవడంతో ఆయనకు కూడా మంత్రి పదవి లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి. అందుకు గాను వినాయక్ మెటే బీజేపీ టికెట్‌పై శాసనమండలికి పోటీ చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మూడో స్థానంలో బీజేపీ అధికార ప్రతినిధి మాధవ్ భండారీని బరిలోకి దింపనున్నారని తెలిసింది. దీనిని బట్టి స్వాభిమానిషేట్కారీ సంఘటన్, రాష్ట్రీయ సమాజ్ పార్టీలకు కేబినెట్‌లో చోటు లేనట్టేనని భావిస్తున్నారు. లోకసభతోపాటు శాసనసభ ఎన్నికల్లో విజయం తర్వాత మిత్రపక్షాలకు బీజేపీ నుంచి సరైన ఆదరణ లభించడంలేదని ఆరోపణలు విన్పిస్తున్నాయి.
 
శివసేనను వీడి తప్పుచేశాం..!
అసెంబ్లీ ఎన్నికల సమయంలో శివసేనను వీడి తప్పుచేశామన్న భావనను ఆర్‌పీఐ నాయకుడు రామ్‌దాస్ ఆఠవలే వ్యక్తంచేశారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ శివసేనతో ఉండి ఉంటే తమ పార్టీకి సరైన న్యాయం జరిగేదని పేర్కొన్నారు. శివసేనతో పొత్తుపెట్టుకుని ఉంటే ఆ పార్టీ స్థానాలు మరో 30 నుంచి 35 పెరిగేవి. దీంతో బీజేపీ ద్వితీయ స్థానంలో నిలిచేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే రాష్ట్రం, కేంద్రంలో ఆర్‌పీఐని బాగస్వామ్యం చేసుకుంటామని బీజేపీ లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు ఆ హామీని అమలు చేయలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement