యువకులు లైంగిక వేధింపులు తట్టుకోలేక మానసికంగా కుంగిపోయిన ఒక హిజ్రా ఆత్మహత్య చేసుకుంది.
టీనగర్: యువకులు లైంగిక వేధింపులు తట్టుకోలేక మానసికంగా కుంగిపోయిన ఒక హిజ్రా ఆత్మహత్య చేసుకుంది. దీంతో సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటేనే మృతదేహాన్ని తీసుకుంటామని హిజ్రాలు ఆందోళన జరపడంతో పళని ఆసుపత్రి ప్రాంగణంలో సంచలనం ఏర్పడింది. నాగపట్టణం జిల్లా, వేదారణ్యంకు చెందిన హిజ్రా మధుమిత (23). ఈమె 10 ఏళ్ల క్రితం తన కుటుంబాన్ని విడిచి దిండుగల్ జిల్లా, పళనికి చేరుకున్నారు. ఇక్కడ రామనాథన్ నగర్‌లో నివశిస్తున్న 60 మంది హిజ్రాలతో కలిసి వుంటూ వచ్చారు. దూరవిద్య ద్వారా బిఎ చదువుతూ వచ్చారు. శుక్రవారం ఇదే ప్రాంతానికి చెందిన యువకులు శివ, సతీష్, అతని సోదరుడు మధుమితను గేలి చేసి లైంగిక వేధింపులకు గురిచేశారు.
దీనిగురించి మధుమిత ఫిర్యాదు చేయడంతో మిగిలిన హిజ్రాలు యువకుల వద్ద విచారణ జరిపారు. దీంతో ఆగ్రహించిన స్థానిక ప్రజలు హిజ్రాలను ఆ ప్రాంతం నుంచి వెళ్లిపొమ్మని హెచ్చరించడమే కాకుండా వారిపై దాడి జరిపారు. దీంతో మనస్తాపానికి గురైన మధుమిత విషం సేవించింది. ప్రాణాపాయ స్థితిలో వున్న ఆమెను వెంటనే పళని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్సలు పొందుతూ మధుమిత మృతిచెందింది. దీంతో హిజ్రాలు ఆమెను వేధించిన యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆసుపత్రిని ముట్టడించారు.