
ఇలియానా ప్రయత్నం ఫలిస్తుందా ?
నటి ఇలియనా ప్రయత్నం ఫలించిందా ప్రస్తుతం ఈ విషయమై కోలీవుడ్‌లో పెద్ద చర్చే జరుగుతోంది.
చెన్నై: నటి ఇలియనా ప్రయత్నం ఫలించిందా ప్రస్తుతం ఈ విషయమై పెద్ద చర్చే జరుగుతోంది కోలీవుడ్‌లో. కేడీ చిత్రంతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఈ గోవా బ్యూటీకి ఆ చిత్రం తీవ్ర నిరాశనే మిగిల్చింది. అయితే ఆమె ఊహించనంత ఉన్నత స్థానాన్ని టాలీవుడ్ అందించింది. అక్కడ టాప్ హీరోయిన్‌గా వెలిగిపోయిన ఇలియానాకు ఉన్నట్లుగా బాలీవుడ్ మోహం కలగడంతో దక్షిణాదికి టాటా చెప్పేసింది.
అయితే బాలీవుడ్‌లో బర్ఫీ లాంటి కొన్ని చిత్రాలు చేసినా ఈ జాణకు అక్కడ అచ్చిరాలేదు.ప్రస్తుతం ఒక్క చిత్రం లేదంటే ఇలియానా పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. దీంతో పీచేముడ్ అంటూ మళ్లీ దక్షిణాదిలో ప్రయత్నాలు మొదలెట్టింది. తెలిసిన వారిని కలిసి అవకాశాలు అడగటం, రాయబారాలు పంపడం వంటి కార్యాల్లో నిమగ్నమయ్యారు. ఇటీవల స్టార్ దర్శకుడు శంకర్‌ను కలిసి ఎందిరన్-2లో అవకాశం అడిగినట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఇళయదళపతి విజయ్‌తో నటించే అవకాశాన్ని చేజిక్కించుకుందనే ప్రచారం జోరందుకుంది.
విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో కాక్కీ (ఇంకా అధికారికంగా టైటిల్ ప్రకటించలేదు)చిత్రం చేస్తున్నారు. ఇది ఆయనకు 59వ చిత్రం అన్నది గమనార్హం. 60వ చిత్రానికి విజయ్ సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి దర్శకుడెవరన్న విషయంలో హరి, ఎస్‌జే.సూర్య, భరతన్, సుందర్.సీ ఇలా చాలా మంది పేర్లు ప్రచారంలో ఉన్నాయి. హీరోయిన్‌గా మాత్రం ఇలియానా పేరు బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఇలియానా విజయ్‌తో నన్భన్ చిత్రంలో జత కట్టారన్నది గమనార్హం.